Arshdeep Singh: టీమిండియా బౌలర్‌పై పిచ్చిరాతలు.. వికీపీడియాకు ప్రభుత్వం సమన్లు

ABN , First Publish Date - 2022-09-05T22:14:03+05:30 IST

టీమిండియా బౌలర్ అర్షదీప్‌ సింగ్ (Arshdeep Singh)కు ఖలిస్థాన్‌ (Khalistan)తో సంబంధాలు ఉన్నాయంటూ

Arshdeep Singh: టీమిండియా బౌలర్‌పై పిచ్చిరాతలు.. వికీపీడియాకు ప్రభుత్వం సమన్లు

న్యూఢిల్లీ:  టీమిండియా బౌలర్ అర్షదీప్‌ సింగ్ (Arshdeep Singh)కు ఖలిస్థాన్‌ (Khalistan)తో సంబంధాలు ఉన్నాయంటూ వికీపీడియా పేజీలో కనిపించడం కలకలం రేపింది. ఎవరో కావాలనే ఇలా ఎడిట్ చేసి ఇండియా అని ఉన్న ప్రతి చోటా ఖలిస్థాన్ అనే పదాన్ని చేర్చారు. విషయం వెలుగులోకి రావడంతో చర్చనీయాంశమైంది. దీంతో స్పందించిన  భారత ఐటీ మంత్రిత్వశాఖ వికీపీడియా ప్రతినిధులకు సమన్లు జారీ చేసింది. వెంటనే వచ్చి కలవాలని ఆదేశించింది. ఐటీ మంత్రిత్వశాఖ కార్యదర్శి నేతృత్వంలోని అత్యున్నతస్థాయి ప్యానెల్ వికీపీడియా ప్రతినిధులను ప్రశ్నించనుంది. అలాగే, వికీపీడియాకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేయనుంది. 


ఇది చాలా తీవ్రమైన అంశమని, పొరుగు దేశంలో ఎడిట్ అయినట్టు గుర్తించామని సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఇలాంటి చర్యలు భారత అంతర్గత శాంతి భద్రతలను దెబ్బతీస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సవరణలను ఎలా అనుమతిస్తారని వారిని (వికీపీడియా ప్రతినిధులను) ప్రశ్నిస్తామన్నారు. అర్షదీప్‌ సింగ్‌ వికీపీడియా పేజీ ఎంట్రీని మార్చి ఖలిస్థాన్‌ అనే పదాన్ని చేర్చడం వెనక పాకిస్థాన్‌కు చెందిన ఐపీ అడ్రస్ ఉందని చెబుతున్నారు. 


ట్విట్టర్ వెరిఫైడ్ యూజర్ ఆస్క్ అన్షుల్ (@AskAnshul) ఓ ట్వీట్ చేస్తూ.. అర్షదీప్ వికీపీడియా పేజీ పాకిస్థాన్‌లో ఎడిట్ అయిందని, ఎడిట్ చేసిన వారు భారత్ అని ఉన్న ప్రతి చోట ఖలిస్థాన్ అని ఉద్దేశపూర్వకంగా మార్చారని  పేర్కొంటూ.. అర్షదీప్ పేజీని ఎడిట్ చేసిన వ్యక్తి ఐపీ అడ్రస్‌ను కూడా షేర్ చేశారు. 


ఆసియాకప్‌లో భాగంగా ఆదివారం రాత్రి పాకిస్థాన్‌తో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో అర్షదీప్ కీలక సమయంలో క్యాచ్ వదిలేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తర్వాతే అతడి వికీపీడియా బయో ఎడిట్ అయింది. భారత ఆటగాడు అర్షదీప్ సింగ్ వికీపీడియా పేజీని ఎడిట్ చేసి ఉద్దేశపూర్వకంగానే ఖలిస్థాన్ అనే పదాన్ని చేర్చారని ట్విట్టర్ యూజర్ అన్షుల్ సక్సేనా పేర్కొన్నారు. పాకిస్థాన్‌లోనే ఈ ఎడిట్ జరిగిందంటూ ఆధారాలను కూడా బయటపెట్టారు. పంజాబ్ (పాకిస్థాన్) రాష్ట్రంలో ముర్రే నగరంలో ఈ ఎడిటింగ్ జరిగినట్టు ఐపీ ఎడ్రస్ ద్వారా తెలుస్తోంది. 


పాకిస్థాన్‌తో ఆదివారం రాత్రి హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో విజయం ఇరువైపులా దోబూచులాడింది. ఈ క్రమంలో రవి బిష్ణోయ్ వేసిన బంతిని పాక్ ఆటగాడు అసిఫ్ బాదేందుకు ప్రయత్నించాడు. గాల్లోకి లేచిన బంతి నేరుగా అర్షదీప్ చేతుల్లోకి వెళ్లినప్పటికీ జారవిడిచాడు. ఆ తర్వాత జోరు పెంచిన పాక్ విజయం సాధించింది. అర్షదీప్ ఆ క్యాచ్‌ను వదిలివేయకుండా భారత్ విజయం సాధించేదని, అతడి వల్లే ఓడిదంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత కాసేపటికే అతడి వికీపీడియా పేజీ ఎడిట్ అయింది. అయితే, ఆ తర్వాత 15 నిమిషాల్లోనే తప్పుడు పేజీని తొలగించి పేజీని పునరుద్ధరించారు.



Updated Date - 2022-09-05T22:14:03+05:30 IST