వీడలేకున్నా...వీడిపోతున్నా..!

ABN , First Publish Date - 2022-09-25T09:10:59+05:30 IST

తన ఆటతో రెండు దశాబ్దాలకుపైగా అభిమానులను అలరించిన స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌..

వీడలేకున్నా...వీడిపోతున్నా..!

కెరీర్‌కు ఫెడరర్‌ గుడ్‌బై


‘ప్రత్యర్థులకు ఒకరిపై ఒకరికి ఇంతటి ప్రేమాభిమానాలు ఉంటాయని ఎవరైనా ఊహించారా? క్రీడల గొప్పతనం ఇదే. నా జీవితంలో ఇదే చిరస్మరణీయ చిత్రం’ అని కోహ్లీ ట్వీట్‌ చేశాడు. ఫెడెక్స్‌, నడాల్‌ ఫొటోను పోస్టు చేశాడు. 

లండన్‌: తన ఆటతో రెండు దశాబ్దాలకుపైగా అభిమానులను అలరించిన స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌.. ఆటకు వీడ్కోలు పలికాడు. కెరీర్‌లో 20 గ్రాండ్‌స్లామ్‌లతో ఆల్‌ టైమ్‌ గ్రేట్‌ ప్లేయర్లలో ఒకడిగా నిలిచిన 41 ఏళ్ల ఫెడెక్స్‌ ఆఖరి మ్యాచ్‌ ఆడేశాడు. లేవర్‌ కప్‌లో టీమ్‌ వరల్డ్‌తో మ్యాచ్‌లో యూరోప్‌ జట్టు తరఫున తన చిరకాల ప్రత్యర్థి రఫెల్‌ నడాల్‌తో జోడీగా రోజర్‌ బరిలోకి దిగాడు. ఫెడెక్స్‌-నడాల్‌ జంట 6-4, 6-7(2), 9-11తో ఫ్రాన్సిస్‌ టియాఫో-జాక్‌ స్టాక్‌ చేతిలో పరాజయం పాలైంది. అయితే, కెరీర్‌లో చివరి మ్యాచ్‌ ఆడుతున్న ఫెడెక్స్‌పైనే అందరి దృష్టీ. ఇదే తన ఆఖరి మ్యాచ్‌ అని రోజర్‌ కొద్ది రోజుల క్రితమే ప్రకటించాడు.


మ్యాచ్‌ అనంతరం ఫెడరర్‌.. ఉబికి వస్తున్న కన్నీళ్లతో ‘థాంక్యూ’ అని  వీడ్కోలు పలుకుతుంటే సహచర ఆటగాళ్లతోపాటు స్టేడియం అంతా తీవ్ర భావోద్వేగానికి గురైంది. ‘లెట్స్‌ గో రోజర్‌.. లెట్స్‌ గో’ అంటూ ఆ ప్రాంతమంతా మార్మోగింది. మోకాలి గాయంతో పలుమార్లు శస్త్ర చికిత్స చేయించుకొన్న ఫెడెక్స్‌.. గతేడాది వింబుల్డన్‌ క్వార్టర్స్‌లో ఓటమి తర్వాత మళ్లీ బరిలోకి దిగలేదు. తన శరీరం సహకరించడం లేదని నిర్ధారించుకొన్న ఫెడెక్స్‌ ఆటకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ‘వీడ్కోలు నిర్ణయం తీసుకోడానికి తీవ్ర సంఘర్షణను ఎదుర్కొన్నా. లోలోన ఆ బాధ నన్ను తొలుస్తోంది’ అని ఫెడరర్‌ చెప్పాడు. తన భార్య మిర్కాకు ఈ సందర్భంగా ఫెడరర్‌ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు. 


నాలో ఓ భాగం వదిలి వెళ్తున్నట్టుంది..

ప్రత్యర్థులుగా బరిలోకి దిగారంటే.. కొదమ సింహాల్లా తలపడతారు. ఆఖరి పాయింట్‌ వరకు పట్టువదలకుండా పోరాడతారు.. వారే ఫెడరర్‌, స్పెయిన్‌ బుల్‌ నడాల్‌. అయితే, ఈ మ్యాచ్‌లో అందుకు పూర్తి భిన్నమైన సీన్‌ కనిపించింది. ఈ ఇద్దరు దిగ్గజాలు జట్టుగా బరిలోకి దిగారు. ఇక వీడ్కోలు సమయంలో అయితే, పక్కపక్కనే కూర్చున్న రోజర్‌, రఫా తీవ్ర భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకోవడం అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. చెంపల మీదుగా కారుతున్న కన్నీటిని తుడుచుకుంటూనే తన సమకాలీనులు, అభిమానులు, కుటుంబ సభ్యులకు ఫెడరర్‌ కృతజ్ఞతలు చెప్పాడు.


బిగ్‌-3లో ఒకడైన సెర్బియా టెన్నిస్‌ యోధుడు నొవాక్‌ జొకోవిచ్‌ కూడా ఎంతో భావోద్వేగానికి గురయ్యాడు. ప్రత్యర్థులుగా ఎంతగా తలపడినా.. ఆటగాడికి ఎంతటి గౌరవం ఇవ్వాలనే దానికి ఫెడెక్స్‌ వీడ్కోలు వేదిక తార్కాణం. ‘ఈ అరుదైన క్షణంలో నాకు చోటుదక్కడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా. ఫెడెక్స్‌ లేని లోటును వర్ణించలేను. అతడు కెరీర్‌ వీడుతుంటే.. నా శరీరంలోని ఓ ముఖ్య భాగం నన్ను వీడుతున్నట్టుంది. నా జీవితంలోని ప్రతి సందర్భంలోనూ అతడు భాగస్వామి. ఒక్కోసారి నా ముందున్నాడు.. ఒక్కోసారి నా పక్కన నిలబడ్డాడు’ అని నడాల్‌ ఎంతో భావోద్వేగంతో చెప్పాడు. 

Read more