Team India: ఏదీ ఆ స్టార్‌ పవర్‌?

ABN , First Publish Date - 2022-11-12T03:06:58+05:30 IST

2021 టీ20 ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌..తాజా మెగా టోర్నీలో ఆఖరి మ్యాచ్‌ను టీమిండియా ఒకే రీతిన ముగించడం అభిమానులకు మనోవేదనను కలిగించింది.

Team India: ఏదీ ఆ స్టార్‌ పవర్‌?

2021 టీ20 ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌.. తాజా మెగా టోర్నీలో ఆఖరి మ్యాచ్‌ను టీమిండియా ఒకే రీతిన ముగించడం అభిమానులకు మనోవేదనను కలిగించింది. ఈ రెండింట్లోనూ జట్టు పది వికెట్ల తేడాతో చిత్తయింది. వాస్తవానికి చాలా ఏళ్లుగా ఐసీసీ టోర్నీల్లో భారత జట్టు విఫలమవుతూనే ఉంది. పోనీ.. జట్టులో నాణ్యమైన క్రికెటర్లకు కొదువా? అంటే ప్రపంచ క్రికెట్‌లో రికార్డులను తిరగరాసే వారిలో ఎక్కువ మంది మన జట్టులోనే ఉన్నారు. అయినా కూడా గత ఎనిమిదేళ్లలో ఏడు సార్లు నాకౌట్‌ నుంచే ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది. మరి ప్రపంచ క్రికెట్‌లో ఇప్పుడు ‘నయా చోకర్స్‌’గా ఎవరిని పిలవాల్సి ఉంటుందో..?

(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)

టీ20 ఫార్మాట్‌ ఆవిర్భావం నుంచి భారత క్రికెట్‌ జట్టు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇటీవలి కాలంలో ద్వైపాక్షిక సిరీ్‌సలను దక్కించుకుని ఊపు మీదుంది. ఓవిధంగా భారత క్రికెట్‌ అంతా స్టార్‌ పవర్‌పైనే ఆధారపడి ఉందనడంలో సందేహం లేదు. రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీ, హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ ఓపెనర్‌ రాహుల్‌తో పాటు పొట్టి ఫార్మాట్‌లో వరల్డ్‌ నెంబర్‌వన్‌ సూర్యకుమార్‌ కూడా టీమిండియా సభ్యుడే. వీరందరినీ కోట్లాది అభిమానులు డెమీ గాడ్స్‌గా భావిస్తూ ఆరాధిస్తుంటారు. తమ స్థాయికి తగ్గ ఆటతీరుతో గెలిపిస్తే ఆహా.. ఓహో అనేయడం పరిపాటి. ఒకవేళ రాణించకపోయినా.. అపారమైన నమ్మకముంచి తిరిగి పుంజుకుంటారని ఎదురుచూస్తూనే ఉంటాం. స్టార్‌ ఆటగాళ్లపై ఉంచే ఈ అంతులేని నమ్మకమే ప్రతిష్ఠాత్మకమైన ఐసీసీ ఈవెంట్స్‌లో కీలక దశ నుంచే తిరుగుముఖం పట్టేందుకు కారణమవుతోంది. అయితే ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా భారత క్రికెట్‌ పాఠాలు నేర్చుకున్నట్టు కనిపించడం లేదు. పొట్టి ఫార్మాట్‌లో సంచలనాలు సృష్టిస్తున్న యువ ఆటగాళ్లకు భారత క్రికెట్‌ బోర్డు (బీసీసీఐ) మొండిచేయి చూపుతోంది. పాతుకుపోయిన స్టార్లను కదపాలంటే బెరుకు. ధనాధన్‌ ఆటలో చిరుతలా చురుగ్గా కదలాల్సి ఉంటుంది. కానీ 15 మందితో కూడిన మొత్తం జట్టులో ఏకంగా 10 మంది 30కి మించిన వయస్సున్న వారే కావడం గమనార్హం. అయినా వీరి గత రికార్డులను చూపుతూ ప్రస్తుతం జట్టును అధోగతి పట్టించడం మాత్రం సమర్థనీయం కాదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తేలిపోయిన ‘టాప్‌’

టాప్‌-3 ఆటగాళ్లు రాహుల్‌, రోహిత్‌, విరాట్‌ కలిసికట్టుగా రాణించిన ఒక్క మ్యాచ్‌ కూడా తాజా టీ20 ప్రపంచక్‌పలో కనిపించదు. కెప్టెన్‌ రోహిత్‌ అయితే పూర్తిగా టచ్‌ కోల్పోయాడు. రాహుల్‌ చిన్నజట్లు జింబాబ్వే, బంగ్లాదేశ్‌లపై మాత్రమే ఆడాడు. అయితే కేవలం కోహ్లీ, సూర్యకుమార్‌ మాత్రమే జట్టు పరువు కాపాడారు. ఒకటీ, అరా మ్యాచ్‌ల్లో హార్దిక్‌ మెరిశాడు. ఆరు మ్యాచ్‌ల్లో కేవలం ఇద్దరే 200+ రన్స్‌ సాధించగలిగారు. పవర్‌ప్లేను ఏమాత్రం సద్వినియోగం చేసుకోలేక అభాసు పాలయ్యారు. అడిలైడ్‌లాంటి బ్యాటింగ్‌ పిచ్‌పై సగం ఓవర్లు ముగిసేసరికి చేసింది 62 పరుగులే. జట్టు సాధించిన మూడు అత్యధిక స్కోర్లు జింబాబ్వే, బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌పై మాత్రమే అంటే మన స్టార్ల గొప్పతనం అర్థమవుతుంది.

తుది జట్టులో లోపాలు

ప్రతీ మ్యాచ్‌ ఆరంభానికి ముందు టీమ్‌లో పంత్‌ ఉంటాడా? లేక దినేశ్‌ కార్తీక్‌ ఉంటాడా? అనే చర్చ మాత్రమే సాగింది. కానీ అత్యంత కీలకమైన టాపార్డర్‌లో మార్పుల గురించి అసలేమాత్రం ఆలోచన చేయలేదు. ఎందుకంటే అక్కడ వరుసగా స్టార్‌ బ్యాటర్స్‌ కొలువై ఉన్నారు కాబట్టి. ఒక్క మ్యాచ్‌లో కాకపోయినా మరో మ్యాచ్‌లోనైనా వారి బ్యాట్లు గర్జించకపోవా? అని ఎదురుచూడడంతోనే పుణ్యకాలం గడిచిపోయింది. ఇలా ఓ దశాబ్దకాలంగా సాగుతున్నా 2011 తర్వాత జట్టుకు ఒక్క మేజర్‌ టోర్నీ కూడా అందించలేకపోయారు. ఇంగ్లండ్‌తో సెమీ్‌సలో కోహ్లీ, పాండ్యా మాత్రమే రాణించగా.. జట్టు స్కోరంతా వారి ఓపెనర్లే బాదేసి డెత్‌ ఓవర్లు రావడానికి ముందే మ్యాచ్‌ను ముగించారు. ఒకవేళ ఓపెనర్లు విఫలమైనా మిడిలార్డర్‌లో స్టోక్స్‌, లివింగ్‌స్టోన్‌, మొయిన్‌ అలీ ఆదుకునేందుకు సిద్ధంగా ఉంటారు. వీరిలో ఎవరూ కోహ్లీకి మించి సమర్థులు కాకపోయినా సమష్టి ఆటను నమ్ముకున్న విషయం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అందుకే క్రికెట్‌ను టీమ్‌ గేమ్‌గా పిలుస్తుంటారు. అసలు ప్రపంచక్‌పలాంటి మెగా టోర్నీలకు ఫామ్‌లో లేని వారిని కాకుండా మ్యాచ్‌ విన్నర్లను తీసుకెళ్లాలనే విషయం బీసీసీఐ గుర్తుంచుకుంటే భవిష్యత్‌లో ఇలాంటి పరాభవాలకు చెక్‌ పెట్టినట్టవుతుంది.

Updated Date - 2022-11-12T11:27:42+05:30 IST