India New Zealand T20 series: కుర్రాళ్లకు భలే చాన్స్‌

ABN , First Publish Date - 2022-11-18T03:25:55+05:30 IST

టీ20 ప్రపంచకప్‌ ముగిసిన వారం రోజుల్లోపే భారత జట్టు మరో పొట్టి సిరీ్‌సకు సిద్ధమైంది. న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం తొలి మ్యాచ్‌ జరగనుంది..

India New Zealand  T20 series: కుర్రాళ్లకు భలే చాన్స్‌

నేటి నుంచి కివీ్‌సతో టీ20 సిరీస్‌

సీనియర్లకు విశ్రాంతి

మధ్యాహ్నం 12 నుంచి డీడీ స్పోర్ట్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌లో..

వెల్లింగ్టన్‌: టీ20 ప్రపంచకప్‌ ముగిసిన వారం రోజుల్లోపే భారత జట్టు మరో పొట్టి సిరీ్‌సకు సిద్ధమైంది. న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం తొలి మ్యాచ్‌ జరగనుంది. ఇక.. వరల్డ్‌కప్‌లో నిరాశాజనక ప్రదర్శనతో సీనియర్ల ఆటపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అటు రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌, విరాట్‌, రాహుల్‌, అశ్విన్‌, షమిలను ఈ టూర్‌కు ఎంపిక చేయలేదు. హార్దిక్‌కు పగ్గాలు అప్పగించడంతో పాటు యువ ఆటగాళ్లకు చోటు కల్పించారు. ఈ నేపథ్యంలో ఈ జట్టు ప్రదర్శనపై అందరి దృష్టీ నెలకొంది. 2024లో జరిగే టీ20 ప్రపంచకప్‌ కోసం ఇప్పటి నుంచే సరైన క్రికెటర్ల కోసం వేటను ఆరంభించాలనే ఆలోచనలో బీసీసీఐ ఉంది. ఇప్పుడున్న సీనియర్‌ ఆటగాళ్లకు అందులో బెర్త్‌ దక్కడం అసాధ్యమే. ఇంగ్లండ్‌ తరహా దూకుడు కోసం యువకులను ప్రోత్సహించాలనే డిమాండ్‌ కూడా ఊపందుకుంటోంది. అందుకే ఈ సిరీ స్‌లో రాణించి జట్టులో సుస్థిరస్థానం దక్కించుకోవాలనుకుంటున్నారు. అటు కివీస్‌ మాత్రం కేన్‌ కెప్టెన్సీలో దాదాపు వరల్డ్‌కప్‌ బరిలో దిగిన జట్టుతోనే ఆడనుంది. అనుభవజ్ఞులతో కూడిన ప్రత్యర్థిని యువ భారత్‌ ఎలా ఎదుర్కుంటుందో వేచిచూడాల్సిందే. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 20 టీ20 మ్యాచ్‌లు జరగగా, భారత్‌ 11-9తో ఆధిక్యంలో ఉంది.

ఉమ్రాన్‌కు చోటు దక్కేనా :

శుభ్‌మన్‌ గిల్‌ తొలిసారిగా పొట్టి ఫార్మాట్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది. మరో ఓపెనర్‌గా ఇషాన్‌ కిషన్‌ ఉండనున్నాడు. వన్‌డౌన్‌లో శ్రేయాస్‌, సంజూ శాంసన్‌ మధ్య పోటీ ఉంది. చాహల్‌ ఈ సిరీస్‌ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు. పేస్‌ బౌలింగ్‌లో భువనేశ్వర్‌, అర్ష్‌దీప్‌ కొత్తబంతిని పంచుకోనున్నారు. మూడో పేసర్‌గా హర్షల్‌, ఉమ్రాన్‌ల మధ్య పోటీ ఉంది.

పూర్తిస్థాయి జట్టుతో..:

న్యూజిలాండ్‌ పూర్తిస్థాయి జట్టుతోనే బరిలోకి దిగబోతోంది. వరల్డ్‌క్‌పలో భారత్‌ తరహాలోనే కివీస్‌ కూడా సెమీ్‌సలోనే నిష్క్రమించింది. వెటరన్‌ పేసర్‌ బౌల్ట్‌, గప్టిల్‌లకు ఉద్వాసన పలికారు. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ వేగంగా ఆడలేకపోతున్నాడు. కానీ ఓపెనర్లు ఆలెన్‌, కాన్వే మాత్రం దూకుడుగా ఇన్నింగ్స్‌ ఆరంభించేందుకు ఎదురుచూస్తున్నారు. మిడిలార్డర్‌లో ఫిలిప్స్‌, మిచెల్‌, నీషమ్‌ కుదురుకుంటే భారీ స్కోరు ఖాయం. పేస్‌ భారం సౌథీ, ఫెర్గూసన్‌పై పడనుంది.

తుది జట్లు (అంచనా)

భారత్‌:

గిల్‌, ఇషాన్‌, శ్రేయా్‌స/శాంసన్‌, సూర్యకుమార్‌, పంత్‌, హార్దిక్‌ (కెప్టెన్‌), సుందర్‌, భువనేశ్వర్‌, చాహల్‌, అర్ష్‌దీప్‌, ఉమ్రాన్‌/హర్షల్‌.

న్యూజిలాండ్‌:

ఆలెన్‌, కాన్వే, విలియమ్సన్‌ (కెప్టెన్‌), ఫిలిప్స్‌, మిచెల్‌, నీషమ్‌, శాంట్నర్‌, సౌథీ, సోధీ, మిల్నే, ఫెర్గూసన్‌.

పిచ్‌, వాతావరణం

శుక్రవారం ఉదయం, మధ్యాహ్నం ఇక్కడ భారీ వర్షం కురిసే చాన్సుంది. కానీ మ్యాచ్‌ జరిగే సమయానికిది 54 శాతంగా ఉండనుంది. వాతావరణం అత్యంత చల్లగా ఉంటుంది. టాస్‌ నెగ్గిన జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకోవచ్చు.

Updated Date - 2022-11-18T07:21:42+05:30 IST