T20 World Cup England : విశ్వవిజేత ఇంగ్లండ్‌

ABN , First Publish Date - 2022-11-14T03:42:54+05:30 IST

ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన ఇంగ్లండ్‌ జట్టు ఈ ఏడాది టీ20 ప్రపంచ కప్‌ చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్లో ఈ జట్టు 5 వికెట్ల తేడాతో గెలిచింది.

T20 World Cup England : విశ్వవిజేత  ఇంగ్లండ్‌

టీ20 ప్రపంచకప్‌

ఫైనల్లో పాక్‌పై గెలుపు

అదరగొట్టిన స్టోక్స్‌, కర్రాన్‌

ఫైనల్లో పాక్‌పై విజయం జూ గెలిపించిన స్టోక్స్‌, కర్రాన్‌

టీ20 ప్రపంచకప్‌ విజేతగా బట్లర్‌ సేన

2016 టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ గుర్తుందా.. ఆఖరి ఓవర్‌లో విండీస్‌కు 19 పరుగులు కావాల్సి ఉండగా ఆ బౌలర్‌ వరుసగా 4 సిక్సర్లు సమర్పించేసి ఇంగ్లండ్‌ పాలిట విలన్‌గా మారాడు..

సీన్‌ కట్‌ చేస్తే.. 2022 టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌. 138 పరుగుల ఛేదనలో 45/3 స్కోరుతో గెలుపుపై సందేహాలున్న వేళ అదే బౌలర్‌ ఇక్కడ బ్యాటర్‌గా పట్టుదలను చూపాడు. క్లిష్టమైన స్థితిలో బ్యాటింగ్‌ కొనసాగించి అజేయ అర్ధసెంచరీతో హీరో అయ్యాడు. అవును.. అప్పుడు బంతిని, ఇప్పుడు బ్యాట్‌ను చేతబట్టింది ఒక్కడే. బెన్‌ స్టోక్స్‌. చరిత్ర తమవైపే ఉందని, ఈసారీ కప్‌ మాదనే అతి విశ్వాసంతో ఉన్న పాకిస్థాన్‌ గుండె బద్దలయ్యే ఇన్నింగ్స్‌తో అదరగొట్టి 12 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌కు రెండో మెగా టోర్నీ అందించాడు. అటు స్వల్ప స్కోరును కాపాడే క్రమంలో పాక్‌ బౌలర్లు చివరి వరకు పోరాడగలిగారు.

ఏకకాలంలో వన్డే, టీ20 వరల్డ్‌కప్‌ చాంపియన్‌ హోదా దక్కించుకున్న ఏకైక జట్టుగా ఇంగ్లండ్‌

ఈ మెగా టోర్నీ చరిత్రలో మ్యాన్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌ పురస్కారం తొలిసారి ఓ స్పెషలిస్ట్‌ బౌలర్‌ (సామ్‌ కర్రాన్‌)కు దక్కింది.

పాక్‌ తరఫున టీ20ల్లో ఎక్కువ వికెట్లు (98) తీసిన బౌలర్‌గా షాదాబ్‌ ఖాన్‌. షాహిద్‌ అఫ్రీది (97)ని అధిగమించాడు.

టీ20 వరల్డ్‌కప్‌ల్లో చివరి 11 నాకౌట్‌ మ్యాచ్‌ల్లో చేజింగ్‌ జట్టే గెలిచింది.

వరుసగా మూడు వరల్డ్‌కప్‌ (2016, 2019 వన్డే, 2022)లలో ఆఖరి ఓవర్‌లో బెన్‌ స్టోక్స్‌ పాత్ర ఉండడం విశేషం.

మెల్‌బోర్న్‌: ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన ఇంగ్లండ్‌ జట్టు ఈ ఏడాది టీ20 ప్రపంచ కప్‌ చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్లో ఈ జట్టు 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఓవరాల్‌గా ఇంగ్లిష్‌ టీమ్‌కిది రెండో టైటిల్‌. 2010లో తొలిసారి ఈ ఫార్మాట్‌లో వరల్డ్‌కప్‌ సాధించింది. అలాగే 2019 వన్డే వరల్డ్‌కప్‌ కూడా వీరి దగ్గరే ఉండడం విశేషం. అటు 1992 వన్డే వరల్డ్‌కప్‌ మాదిరే ఇప్పుడూ తామే గెలుస్తామని ఆశలు పెట్టుకున్న పాక్‌కు భంగపాటే ఎదురైంది. బౌలింగ్‌లో సామ్‌ కర్రాన్‌ (4-0-12-3) అద్వితీయ బౌలింగ్‌తో చెలరేగగా.. బ్యాటింగ్‌లో బెన్‌ స్టోక్స్‌ (49 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 52 నాటౌట్‌) నిలకడైన ఆటతీరుతో తుదికంటా నిలిచి జట్టును గట్టెక్కించాడు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 137 పరుగులు చేసింది. షాన్‌ మసూద్‌ (38), బాబర్‌ ఆజమ్‌ (32), షాదాబ్‌ ఖాన్‌ (20) మాత్రమే రాణించారు. రషీద్‌, జోర్డాన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ఇంగ్లండ్‌ 19 ఓవర్లలో 5 వికెట్లకు 138 పరుగులు చేసి గెలిచింది. బట్లర్‌ (26), బ్రూక్‌ (20), మొయిన్‌ అలీ (19) అండగా నిలిచారు. రౌఫ్‌కు రెండు వికెట్లు దక్కాయి. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’తో పాటు ప్రతిష్ఠాత్మకమైన ‘మ్యాన్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌’గా సామ్‌ కర్రాన్‌ నిలిచాడు.

ఆదిలో ఝలక్‌ తగిలినా..:

ఇంగ్లండ్‌ ముందున్న లక్ష్యం.. కేవలం 139 పరుగులే. కానీ ఈ సాధారణ లక్ష్యాన్ని కాపాడుకునేందుకు పాక్‌ పోరాడిన తీరు ఉత్కంఠనే రేపింది. తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ హేల్స్‌ (1)ను షహీన్‌ సూపర్‌ ఇన్‌స్వింగర్‌తో బౌల్డ్‌ చేసిన తీరు వహ్వా అనిపించింది. ఆ తర్వాత బట్లర్‌, సాల్ట్‌ (10) స్కోరును గాడిన పెట్టే ప్రయత్నం చేశారు. కానీ పేసర్‌ రౌఫ్‌ తన వరుస ఓవర్లలో ఈ ఇద్దరినీ పెవిలియన్‌కు చేర్చడంతో పవర్‌ప్లేలోనే జట్టు 3 వికెట్లు కోల్పోయింది. అయితే వెటరన్‌ స్టార్‌ స్టోక్స్‌ క్రీజులో కుదురుకోవడం జట్టుకు కలిసివచ్చింది. నాలుగో వికెట్‌కు 39 పరుగుల భాగస్వామ్యం తర్వాత 13వ ఓవర్‌లో బ్రూక్స్‌ను షాదాబ్‌ అవుట్‌ చేశాడు. అప్పటిదాకా ఇన్నింగ్స్‌లో పెద్దగా మెరుపులు లేవు. కానీ 16వ ఓవర్‌లో బ్యాట్‌ ఝుళిపించిన స్టోక్స్‌ 4,6తో 13 రన్స్‌ సాధించాడు. తర్వాతి ఓవర్‌లో మొయిన్‌ అలీ మూడు ఫోర్లు బాది 16 రన్స్‌ రాబట్టడంతో ఒక్కసారిగా జట్టుపై ఒత్తిడి తగ్గింది. 19వ ఓవర్‌లో అలీ వెనుదిరిగినా స్టోక్స్‌ మరో ఫోర్‌, సింగిల్‌తో విజయనాదం చేశాడు. ఐదో వికెట్‌కు ఈ జోడీ 48 పరుగులు అందించారు.

సూపర్‌ సామ్‌:

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ను పేసర్‌ సామ్‌ కర్రాన్‌, లెగ్‌ స్పిన్నర్‌ రషీద్‌ రెండు వైపులా తీవ్ర ఒత్తిడిలోకి నెట్టారు. ఈ జోడీ 25 డాట్‌ బాల్స్‌ వేయడం విశేషం. దీంతో పరుగులను సాధించేందుకు ఈ జట్టు అష్టకష్టాలు పడింది. ఫామ్‌లోకి వచ్చిన ఓపెనర్లు బాబర్‌, రిజ్వాన్‌ల నుంచి ఈసారి శుభారంభం దక్కలేదు. బంతికో పరుగు చొప్పున సాధించిన రిజ్వాన్‌ను ఐదో ఓవర్‌లోనే కర్రాన్‌ బౌల్డ్‌ చేశాడు. ఇక బౌన్సీ, పేస్‌ ఉన్న పిచ్‌పై రషీద్‌ మాత్రం అద్భుత టర్న్‌తో మధ్య ఓవర్లలో పాక్‌ను కట్టడి చేశాడు. 12వ ఓవర్‌ను మెయిడిన్‌గా వేయడంతో పాటు ఓ చక్కటి గూగ్లీతో బాబర్‌ను రిటర్న్‌ క్యాచ్‌తో అవుట్‌ చేశాడు. ఆ వెంటనే ఇఫ్తికార్‌ను స్టోక్స్‌ డకౌట్‌ చేయడంతో 85/4తో పాక్‌ కష్టాల్లో పడింది. ఈ సమయంలో మసూద్‌, షాదాబ్‌ కాసేపు ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ డెత్‌ ఓవర్లలో కర్రాన్‌ ఎప్పటిలాగే చెలరేగి మసూద్‌తో పాటు నవాజ్‌ (5)ను పెవిలియన్‌కు చేర్చడంతో పాక్‌ స్పల్ప స్కోరుకే పరిమితమైంది. కర్రాన్‌, జోర్డాన్‌ ధాటికి చివరి నాలుగు ఓవర్లలో ఈ జట్టు కేవలం ఒక ఫోర్‌ మాత్రమే సాధించింది.

2019 వన్డే వరల్డ్‌కప్‌లోనూ..

మూడేళ్ల క్రితం లార్డ్స్‌లో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లోనూ బెన్‌ స్టోక్స్‌ హీరోచిత ఇన్నింగ్స్‌తో జట్టుకు టైటిల్‌ అందించాడు. కివీ్‌సపై 242 పరుగుల ఛేదనలో ఓ దశలో జట్టు 86/4 స్కోరుతో ఓటమి వైపు పయనించింది. కానీ మరో ఎండ్‌లో స్టోక్స్‌ అసమాన పోరాటంతో అజేయంగా 84 పరుగులు సాధించి బట్లర్‌తో ఐదో వికెట్‌కు 110 రన్స్‌ జోడించాడు. దీంతో జట్టుకు ఓటమి తప్పి మ్యాచ్‌ టై అయింది. ఇక సూపర్‌ ఓవర్‌లోనూ బరిలోకి దిగి స్టోక్స్‌ 8 రన్స్‌ సాధించాడు. అదీ టై కావడంతో బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లండ్‌ విజేతగా నిలిచింది.

పాకిస్థాన్‌:

రిజ్వాన్‌ (బి) కర్రాన్‌ 15; బాబర్‌ (సి అండ్‌ బి) రషీద్‌ 32; హరీస్‌ (సి) స్టోక్స్‌ (బి) రషీద్‌ 8; మసూద్‌ (సి) లివింగ్‌స్టోన్‌ (బి) కర్రాన్‌ 38; ఇఫ్తికార్‌ (సి) బట్లర్‌ (బి) స్టోక్స్‌ 0; షాదాబ్‌ (సి) వోక్స్‌ (బి) జోర్డాన్‌ 20; నవాజ్‌ (సి) లివింగ్‌స్టోన్‌ (బి) కర్రాన్‌ 5; వసీం జూనియర్‌ (సి) లివింగ్‌స్టోన్‌ (బి) జోర్డాన్‌ 4; షహీన్‌ (నాటౌట్‌) 5; రౌఫ్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 137/8. వికెట్ల పతనం: 1-29, 2-45, 3-84, 4-85, 5-121, 6-123, 7-129, 8-131. బౌలింగ్‌: స్టోక్స్‌ 4-0-32-1; వోక్స్‌ 3-0-26-0; కర్రాన్‌ 4-0-12-3; రషీద్‌ 4-1-22-2; జోర్డాన్‌ 4-0-27-2; లివింగ్‌స్టోన్‌ 1-0-16-0.

ఇంగ్లండ్‌:

బట్లర్‌ (సి) రిజ్వాన్‌ (బి) రౌఫ్‌ 26; హేల్స్‌ (బి) షహీన్‌ 1; సాల్ట్‌ (సి) ఇఫ్తికార్‌ (బి) రౌఫ్‌ 10; స్టోక్స్‌ (నాటౌట్‌) 52; బ్రూక్‌ (సి) షహీన్‌ (బి) షాదాబ్‌ 20; మొయిన్‌ అలీ (బి) వసీం జూనియర్‌ 19; లివింగ్‌స్టోన్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 19 ఓవర్లలో 138/5. వికెట్ల పతనం: 1-7, 2-32, 3-45, 4-84, 5-132. బౌలింగ్‌: షహీన్‌ 2.1-0-13-1; నసీమ్‌ షా 4-0-30-0; రౌఫ్‌ 4-0-23-2; షాదాబ్‌ 4-0-20-1; వసీం జూనియర్‌ 4-0-38-1; ఇఫ్తికార్‌ 0.5-0-13-0.

Updated Date - 2022-11-14T05:01:16+05:30 IST

Read more