ఇద్దరే ఆడేశారు

ABN , First Publish Date - 2022-11-26T01:12:02+05:30 IST

న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీ్‌సను టీమిండియా నిరాశాజనకంగా ఆరంభించింది. బ్యాటర్లు విశేష ప్రతిభ కనబర్చి భారీస్కోరు సాధించినా..

ఇద్దరే ఆడేశారు

లాథమ్‌, కేన్‌ల భారీ ఇన్నింగ్స్‌

తొలి వన్డేలో భారత్‌పై కివీస్‌ విజయం

ఆక్లాండ్‌: న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీ్‌సను టీమిండియా నిరాశాజనకంగా ఆరంభించింది. బ్యాటర్లు విశేష ప్రతిభ కనబర్చి భారీస్కోరు సాధించినా.. భారత బౌలర్లు ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. అటు టామ్‌ లాథమ్‌ (104 బంతుల్లో 19 ఫోర్లు, 5 సిక్సర్లతో 145 నాటౌట్‌) అజేయ శతకంతో చెలరేగగా.. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (98 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 94 నాటౌట్‌) కూడా సెంచరీ దరిదాపుల్లోకి వచ్చాడు. ఈ జోడీ అద్భుత బ్యాటింగ్‌తో కివీస్‌ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. స్వదేశంలో కివీ్‌సకిది వరుసగా 13వ విజయం కావడం విశేషం. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 7 వికెట్లకు 306 పరుగులు సాధించింది. టాపార్డర్‌లో శ్రేయాస్‌ అయ్యర్‌ (76 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 80), ఓపెనర్లు ధవన్‌ (77 బంతుల్లో 13 ఫోర్లతో 72), గిల్‌ (65 బంతుల్లో ఫోర్‌, 3 సిక్సర్లతో 50) అర్ధసెంచరీలు సాధించారు. సౌథీ, ఫెర్గూసన్‌కు మూడేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో కివీస్‌ 47.1 ఓవర్లలో 309/3 స్కోరు చేసి గెలిచింది. ఉమ్రాన్‌మాలిక్‌ 2 వికెట్లు తీశాడు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా లాథమ్‌ నిలిచాడు.

ఆకట్టుకున్న టాపార్డర్‌: ఓపెనర్లు ధవన్‌, గిల్‌ సాధికారికంగా బ్యాటింగ్‌ కొనసాగిస్తూ 23 ఓవర్లపాటు క్రీజులో నిలిచారు. దీంతో ఓపెనింగ్‌ జోడీ మధ్య తొలి వికెట్‌కు 124 రన్స్‌ జత చేరాయి. అయితే వరుస ఓవర్లలో ఈ ఇద్దరూ వెనుదిరగగా, ఆ తర్వాత శ్రేయాస్‌ జట్టుకు అండగా నిలిచాడు. సంజూ శాంసన్‌ (36) ఫర్వాలేదనిపించగా.. చివర్లో వాషింగ్టన్‌ సుందర్‌ (16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 నాటౌట్‌) తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో అదరగొట్టి స్కోరును 300 దాటించాడు.

ఆ ఇద్దరే..: భారీ ఛేదనలో కివీస్‌ ఆదిలో కాస్త తడబడింది. తొలి వన్డే ఆడిన ఉమ్రాన్‌ నిలకడగా 150కి.మీ వేగంతో బంతులు విసిరి ఆకట్టుకున్నాడు. అలాగే రెండు వికెట్లు కూడా తీసి సత్తా చాటాడు. కానీ 88/3 స్కోరుతో ఇబ్బందుల్లో పడిన కివీ్‌సను ఆ తర్వాత భారత్‌ కట్టడి చేయలేకపోయింది. కేన్‌, లాథమ్‌ జోడీ భారత బౌలర్లను ఆడేసుకుంది. ముఖ్యంగా లాథమ్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో 40వ ఓవర్‌లో వరుసగా 6,4,4,4తో 25 పరుగులు సాధించి 76 బంతుల్లోనే శతకం పూర్తి చేశాడు. 46వ ఓవర్‌లోనూ హ్యాట్రిక్‌ ఫోర్లు బాది మరో 17 బంతులుండగానే మ్యాచ్‌ను ముగించాడు.

కివీస్‌ తరఫున భారత్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోరు (145 నాటౌట్‌) సాధించిన లాథమ్‌.

భారత్‌పై ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం (అజేయంగా 208) నమోదు చేసిన కివీస్‌ జోడీ కేన్‌-లాథమ్‌.

స్కోరుబోర్డు

భారత్‌: ధవన్‌ (సి) ఆలెన్‌ (బి) సౌథీ 72; గిల్‌ (సి) కాన్వే (బి) ఫెర్గూసన్‌ 50; శ్రేయాస్‌ (సి) కాన్వే (బి) సౌథీ 80; పంత్‌ (బి) ఫెర్గూసన్‌ 15; సూర్యకుమార్‌ (సి) ఆలెన్‌ (బి) ఫెర్గూసన్‌ 4; శాంసన్‌ (సి) ఫిలిప్స్‌ (బి) మిల్నే 36; సుందర్‌ (నాటౌట్‌) 37; శార్దూల్‌ (సి) లాథమ్‌ (బి) సౌథీ 1; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 50 ఓవర్లలో 306/7. వికెట్ల పతనం: 1-124, 2-124, 3-156, 4-160, 5-254, 6-300, 7-306. బౌలింగ్‌: సౌథీ 10-0-73-3; హెన్రీ 10-1-48-0; ఫెర్గూసన్‌ 10-1-59-3; శాంట్నర్‌ 10-0-56-0; మిల్నే 10-0-67-1.

న్యూజిలాండ్‌: ఆలెన్‌ (సి) పంత్‌ (బి) శార్దూల్‌ 22; కాన్వే (సి) పంత్‌ (బి) ఉమ్రాన్‌ 24; విలియమ్సన్‌ (నాటౌట్‌) 94; మిచెల్‌ (సి) సబ్‌-హుడా (బి) ఉమ్రాన్‌ 11; లాథమ్‌ (నాటౌట్‌) 145; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 47.1 ఓవర్లలో 309/3. వికెట్ల పతనం: 1-35, 2-68, 3-88. బౌలింగ్‌: అర్ష్‌దీప్‌ 8.1-0-68-0; శార్దూల్‌ 9-1-63-1; సుందర్‌ 10-0-42-0; ఉమ్రాన్‌ 10-0-66-2; చాహల్‌ 10-0-67-0.

Updated Date - 2022-11-26T01:12:05+05:30 IST