తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం లభించినా భారత్ ఓడిన మ్యాచ్‌లు ఇవే!

ABN , First Publish Date - 2022-07-05T23:00:57+05:30 IST

ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్టులో భారత (Team India) జట్టు ఘోర పరాజయం పాలైంది.

తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం లభించినా భారత్ ఓడిన మ్యాచ్‌లు ఇవే!

బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్టులో భారత (Team India) జట్టు ఘోర పరాజయం పాలైంది. ఫలితంగా మ్యాచ్ గెలిచి ఇంగ్లండ్ (England) గడ్డపై చరిత్ర సృష్టించాలని భావించిన టీమిండియా ఆశలు అడియాసలయ్యాయి. విజయం సాధించిన ఇంగ్లండ్ సిరీస్ ఓటమి నుంచి తప్పించుకుని 2-2తో సమం చేసింది. ఈ రీషెడ్యూల్డ్ (Rescheduled) టెస్టులో తొలి నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన భారత జట్టు నాలుగో రోజు మాత్రం మ్యాచ్‌పై పట్టుకోల్పోయింది. 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందు ఉంచినప్పటికీ కాపాడుకోవడంలో విఫలమైంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను బెంబేలెత్తించిన భారత బౌలర్లు రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం చేతులెత్తేశారు. వికెట్లు తీసేందుకు తీవ్రంగా చెమటోడ్చినా ఐదో రోజు ఒక్క వికెట్ కూడా నేల కూల్చలేకపోయారు. ఫలితంగా రూట్ (142), జానీ బెయిర్ స్టో (114) అజేయ శతకాలతో అదరగొట్టి జట్టుకు విజయాన్ని అందించిపెట్టారు. 


తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించినప్పటికీ ఓటమి పాలు కావడం భారత్‌కు ఇది కొత్తకాదు. 2015లో గాలేలో శ్రీలంక (Sri Lanka)తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా తొలి  ఇన్నింగ్స్‌లో 192 పరుగుల ఆధిక్యం సాధించింది. అయినప్పటికీ ఆ మ్యాచ్‌లో ఓడింది. 1992లో అడిలైడ్‌లో ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 80 పరుగుల ఆధిక్యంలో నిలిచినప్పటికీ ఆ తర్వాత పేలవ ప్రదర్శన కారణంగా ఆ మ్యాచ్‌లో ఓటమి పాలైంది. 2008లో సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 69 పరుగుల ఆధిక్యం సాధించింది. అయినప్పటికీ ఆ టెస్టులో భారత జట్టు పరాజయం పాలైంది. ఇప్పుడు బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 132 పరుగుల ఆధిక్యం సాధించి పటిష్ఠ స్థితిలో నిలిచింది. అయితే, బౌలర్ల పేలవ ప్రదర్శన కారణంగా ఈ మ్యాచ్‌లో ఏకంగా ఏడు వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది.

Read more