‘బుడగ’ దాటితే కఠిన చర్యలే

ABN , First Publish Date - 2022-03-16T09:17:59+05:30 IST

గతేడాది ఐపీఎల్‌ బయోబబుల్‌ విచ్ఛిన్నం కావడంతో తీవ్ర విమర్శల పాలైన బీసీసీఐ.. ఈసారి కఠినంగా వ్యవహరించనుంది.

‘బుడగ’ దాటితే కఠిన చర్యలే

ఐపీఎల్‌ ఆటగాళ్లకు బీసీసీఐ హెచ్చరిక

న్యూఢిల్లీ: గతేడాది ఐపీఎల్‌ బయోబబుల్‌ విచ్ఛిన్నం కావడంతో తీవ్ర విమర్శల పాలైన బీసీసీఐ.. ఈసారి కఠినంగా వ్యవహరించనుంది. ఈ నెల 26 నుంచి జరిగే మెగా లీగ్‌లో ముందస్తుగా కొవిడ్‌ ప్రొటోకాల్‌ను విడుదల చేసింది. కరోనా మహమ్మారి పొంచి ఉన్న నేపథ్యంలో.. ఆటగాళ్లు లేదా వారి కుటుంబ సభ్యులు నిబంధనలను ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. రూల్స్‌ను అతిక్రమిస్తే ఎలాంటి చర్యలు తీసుకోనుందో కూడా స్పష్టంగా పేర్కొంది.


కొవిడ్‌ ప్రొటోకాల్‌ను తొలిసారి అతిక్రమిస్తే.. ఆ క్రికెటర్‌ను ఏడు రోజుల క్వారంటైన్‌కు పంపడంతోపాటు సదరు ఆటగాడు దూరమైన మ్యాచ్‌ల జీతాలను కూడా నిలిపివేయనుంది. రెండోసారి ఉల్లంఘిస్తే ఓ మ్యాచ్‌ నిషేధంతోపాటు మ్యాచ్‌ ఫీజును కూడా చెల్లించదు. ఇక మూడోసారి అదే తరహా తప్పునకు పాల్పడితే జట్టు నుంచి ఆ ఆటగాడిని తొలగించడమే కాకుండా.. ఆ స్థానంలో మరొకరిని తీసుకొనేందుకు కూడా బోర్డు అనుమతించదు. ఒకవేళ వైరస్‌ కారణంగా మ్యాచ్‌ ముందు ఓ జట్టు 12 మంది ఆటగాళ్లను కూడా సమీకరించలేకపోతే.. సాంకేతిక కమిటీ విచక్షణ ఆధారంగా ఆ మ్యాచ్‌ను రీ-షెడ్యూల్‌ చేసే అవకాశం బీసీసీఐ కల్పించింది. 

Read more