208.. సరిపోలేదు

ABN , First Publish Date - 2022-09-21T09:30:34+05:30 IST

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు టీ20ల సిరీ్‌సను భారత్‌ పరాజయంతో ఆరంభించింది.

208.. సరిపోలేదు

భారీ ఛేదనలో ఆసీస్‌ విజయం

చెలరేగిన గ్రీన్‌, వేడ్‌ 

హార్దిక్‌, రాహుల్‌ పోరాటం వృథా

తొలి టీ20లో భారత్‌ ఓటమి

హార్దిక్‌ పాండ్యా 

    (30 బంతుల్లో 71 నాటౌట్‌)

కామెరూన్‌ గ్రీన్‌ (30 బంతుల్లో 61)


ఆరంభంలో రాహుల్‌.. మిడిలార్డర్‌లో సూర్యకుమార్‌.. ఆఖర్లో హార్దిక్‌ మెరుపు ఇన్నింగ్స్‌ కారణంగా భారత్‌ 208 పరుగులు సాధించినా ఫలితం లేకపోయింది. ఆసీస్‌ అంతకుమించి అన్నట్టుగా మొహాలీ స్టేడియాన్ని మోతెక్కించింది. ఓపెనర్‌ గ్రీన్‌కు జతగా మాథ్యూ వేడ్‌ భారీ షాట్లకు భారత బౌలర్లలో అక్షర్‌ మినహా అంతా చేతులెత్తేశారు. దీనికి తోడు ఫీల్డింగ్‌ వైఫల్యం కూడా దెబ్బతీసింది.


మొహాలీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు టీ20ల సిరీ్‌సను భారత్‌ పరాజయంతో ఆరంభించింది. బ్యాటింగ్‌లో మెరుగ్గానే కనిపించినా.. కీలక దశలో బౌలర్ల వైఫల్యంతో మూల్యం చెల్లించుకుంది. దీంతో మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఆసీస్‌ 4 వికెట్ల తేడాతో గెలిచి సిరీ్‌సలో 1-0తో ఆధిక్యంలో ఉంది. రెండో మ్యాచ్‌ శుక్రవారం నాగ్‌పూర్‌లో జరుగుతుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు చేసింది. హార్దిక్‌ పాండ్యా (30 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 71 నాటౌట్‌) కెరీర్‌లో అత్యధిక స్కోరు సాధించగా, రాహుల్‌ (35 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 55) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. సూర్యకుమార్‌ (25 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 46) తనదైన శైలిలో ఆడాడు.


ఎల్లి్‌సకు మూడు, హాజెల్‌వుడ్‌కు 2 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ఆసీస్‌ 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 211 పరుగులు చేసి గెలిచింది. గ్రీన్‌ (30 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 61), వేడ్‌ (21 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 నాటౌట్‌) మెరుపు ఆటను ప్రదర్శించారు. అక్షర్‌కు మూడు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా గ్రీన్‌ నిలిచాడు. గాయం నుంచి కోలుకున్న పేసర్‌ బుమ్రాకు ఈ మ్యాచ్‌కు విశ్రాంతినివ్వగా, మూడేళ్ల తర్వాత ఉమేశ్‌ యాదవ్‌ జట్టులోకి వచ్చాడు.


గ్రీన్‌, వేడ్‌ ధనాధన్‌:

భారీ ఛేదనను ఆసీస్‌ మెరుపు వేగంతో ఆరంభించింది. ఓపెనర్‌ ఫించ్‌ (22) ఇన్నింగ్స్‌ తొలి బంతినే సిక్సర్‌గా మలవగా.. మరో ఓపెనర్‌ గ్రీన్‌ రెండో ఓవర్‌లో వరుసగా నాలుగు ఫోర్లు.. మూడో ఓవర్‌లో ఫించ్‌ మూడు ఫోర్లతో చెలరేగడంతో ఆసీస్‌ స్కోరు 18 బంతుల్లోనే 38కి చేరింది. ఈ దశలో ఫించ్‌ను అక్షర్‌ బౌల్డ్‌ చేసినప్పటికీ, గ్రీన్‌ రూపంలో భారత బౌలర్లకు చుక్కలు కనిపించాయి. మరోవైపు గ్రీన్‌ క్యాచ్‌ను అక్షర్‌.. స్మిత్‌ క్యాచ్‌ను రాహుల్‌ వరుస ఓవర్లలో వదిలేయడం ఆసీస్‌కు కలిసి వచ్చింది. అయితే స్పిన్నర్‌ అక్షర్‌ మరోసారి జట్టును ఆదుకుంటూ 11వ ఓవర్‌లో గ్రీన్‌ వికెట్‌ తీయడంతో రెండో వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.


మరుసటి ఓవర్‌లోనే స్మిత్‌ 6,4తో బ్యాట్‌ ఝుళిపించినా అతడితో పాటు మ్యాక్స్‌వెల్‌ (1)ను సైతం ఉమేశ్‌ పెవిలియన్‌కు చేర్చాడు. కాసేపటికే ఇన్‌గ్లి్‌స (17)ను అక్షర్‌ బౌల్డ్‌ చేయడంతో భారత్‌ పోటీలో కొచ్చినట్టు కనిపించింది. ఈ క్లిష్ట పరిస్థితిలో ఆరు, ఏడో బ్యాటర్స్‌ టిమ్‌ డేవిడ్‌ (18), మాథ్యూ వేడ్‌ జట్టును ఆదుకున్నారు. 24 బంతుల్లో 55 పరుగులు కావాల్సిన దశలో ఈ జోడీ మైదానం నలువైపులా భారీ షాట్లతో విరుచుకుపడింది. 18వ ఓవర్‌లో వేడ్‌ రెండు, డేవిడ్‌ ఓ సిక్సర్‌తో 22 రన్స్‌ రావడంతో సమీకరణం ఆసీస్‌కు తేలికైంది. ఇక ఎప్పటిలాగే భువీ వేసిన ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌లో వేడ్‌ 4,4,4 బాదేయడంతో 16 రన్స్‌ వచ్చాయి. ఆఖరి ఓవర్‌లో కావాల్సిన రెండు పరుగులను తొలి బంతికే డేవిడ్‌ వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌, రెండో బంతికి కమిన్స్‌ (4 నాటౌట్‌) ఫోర్‌ ద్వారా మ్యాచ్‌ను ముగించింది.


పాండ్యా, రాహుల్‌ జోరు:

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ పవర్‌ప్లేలోనే ఓపెనర్‌ రోహిత్‌ (11), కోహ్లీ (2) వికెట్లను కోల్పోయింది. కానీ ఈ సంతోషాన్ని ఆవిరి చేస్తూ మరో ఓపెనర్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ ఆసీస్‌ బౌలర్లను ఆటాడుకున్నారు. మిడిలార్డర్‌లో హార్దిక్‌ పాండ్యా ధనాధన్‌ ఆటతీరుతో విరుచుకుపడి చివరికంటా నిలవడంతో జట్టు భారీ స్కోరు సాధించింది. ముందుగా సూర్య బ్యాట్‌ ఝుళిపిస్తూ ఆరో ఓవర్‌లో 4,6 బాదగా.. ఆ తర్వాత రాహుల్‌ చెలరేగాడు. తన స్ట్రయిక్‌ రేట్‌పై ఇటీవల విమర్శలు వినిపిస్తుండగా.. ఈ మ్యాచ్‌లో వాటికి బదులిస్తూ 32 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. మూడో వికెట్‌కు 68 పరుగులు జత చేశాక హాజెల్‌వుడ్‌ చేతిలో రాహుల్‌ అవుటయ్యాడు. ఇక 14వ ఓవర్‌లో హార్దిక్‌ 6,4 బాదినా.. సూర్య వికెట్‌ను కోల్పోవాల్సి వచ్చింది.


గ్రీన్‌ బౌలింగ్‌లో అతడు కీపర్‌ వేడ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఆ తర్వాత అక్షర్‌ (6) స్వల్ప స్కోరుకే వెనుదిరగడంతో డెత్‌ ఓవర్లలో హార్దిక్‌ బౌండరీలతో జోరు ప్రదర్శించాడు. తనే ఎక్కు వగా స్ట్రయికింగ్‌ తీసుకుంటూ 25 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. అటు 16వ ఓవర్‌ ఆఖరి బంతికి క్రీజులోకి వచ్చిన దినేశ్‌ కార్తీక్‌ (6) ఐదు బంతులే ఎదుర్కొని అవుటయ్యాడు. ఆఖరి ఓవర్‌లో చివరి మూడు బంతులను సిక్సర్లుగా మలిచిన పాండ్యా 21 పరుగులు అందించడంతో జట్టు స్కోరు 200 దాటింది. చివరి ఐదు ఓవర్లలో జట్టు 67 పరుగులు సాధించడం విశేషం.


స్కోరుబోర్డు

భారత్‌:

రాహుల్‌ (సి) ఎల్లిస్‌ (బి) హాజెల్‌వుడ్‌ 55, రోహిత్‌ (సి) ఎల్లిస్‌ (బి) హాజెల్‌వుడ్‌ 11, విరాట్‌ కోహ్లీ (సి) గ్రీన్‌ (బి) ఎల్లిస్‌ 2, సూర్యకుమార్‌ యాదవ్‌ (సి) వేడ్‌ (బి) గ్రీన్‌ 46, హార్దిక్‌ (నాటౌట్‌) 71, అక్షర్‌ పటేల్‌ (సి) గ్రీన్‌ (బి) ఎల్లిస్‌ 6, దినేశ్‌ (ఎల్బీ) ఎల్లిస్‌ 6, హర్షల్‌ పటేల్‌ (నాటౌట్‌) 7, ఎక్స్‌ట్రాలు: 4, మొత్తం 20 ఓవర్లలో 208/6. వికెట్ల పతనం: 1-21, 2-35, 3-103, 4-126, 5-146, 6-176; బౌలింగ్‌: హాజెల్‌వుడ్‌ 4-0-39-2, కమిన్స్‌ 4-0-47-0, జంపా 4-0-36-0, ఎల్లిస్‌ 4-0-30-3, గ్రీన్‌ 3-0-46-1, మ్యాక్స్‌వెల్‌ 1-0-10-0.


ఆస్ట్రేలియా:

ఫించ్‌ (బి) అక్షర్‌ 22, గ్రీన్‌ (సి) కోహ్లీ (బి) అక్షర్‌ 61, స్మిత్‌ (సి) కార్తీక్‌ (బి) ఉమేష్‌ 35, మ్యాక్స్‌వెల్‌ (సి) కార్తీక్‌ (బి) ఉమేష్‌ 1, ఇన్‌గ్లిస్‌ (బి) అక్షర్‌ 17, డేవిడ్‌ (సి) హార్దిక్‌ (బి) చాహల్‌ 18, వేడ్‌ (నాటౌట్‌) 45, కమిన్స్‌ (నాటౌట్‌) 4, ఎక్స్‌ట్రాలు: 8, మొత్తం 19.2 ఓవర్లలో 211/6; వికెట్ల పతనం: 1-39, 2-109, 3-122, 4-123, 5-145, 6-207; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-52-0, ఉమేష్‌ 2-0-27-2, అక్షర్‌ 4-0-17-3, చాహల్‌ 3.2-0-42-1, హర్షల్‌ 4-0-49-0, హార్దిక్‌ 2-0-22-0.

Updated Date - 2022-09-21T09:30:34+05:30 IST