Ambati Rayudu: బర్త్‌డే బాయ్ అంబటి రాయుడు గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

ABN , First Publish Date - 2022-09-23T18:21:58+05:30 IST

భారత క్రికెటర్లలో తెలుగు ఆటగాడైన అంబటి రాయుడి కథ కూసింత వేరేగా ఉంటుంది. టాలెంట్, పర్ఫామెన్స్ అన్నీ సరిపడా ఉన్నా.. అదృష్టం కలిసిరాక స్టార్‌ క్రికెటర్‌గా ఎదగలేకపోయాడు.

Ambati Rayudu: బర్త్‌డే బాయ్ అంబటి రాయుడు గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెటర్లలో తెలుగు ఆటగాడైన అంబటి రాయుడి కథ కూసింత వేరేగా ఉంటుంది. టాలెంట్, పర్ఫామెన్స్ అన్నీ సరిపడా ఉన్నా.. అదృష్టం కలిసిరాక స్టార్‌ క్రికెటర్‌గా ఎదగలేకపోయాడు. దాంతో భారత జట్టుకు దూరమయ్యాడు. అయితే, ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో మాస్టర్‌బ్లాస్టర్ సచిన్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ తరపున ఆడడం అంబటికి బాగానే కలిసొచ్చింది. లిటిల్ మాస్టర్ పర్యవేక్షణలో అంబటి రాయుడు కొంచెం తన ప్రవర్తనతో పాటు ఆటలోనూ మార్పులు చేసుకుని తిరిగి టీమిండియా తలుపులు తట్టాడు. కానీ, అదే సమయంలో మిగతా ఆటగాళ్లు బాగా రాణించడం రాయుడును టీమిండియాకు దూరం చేసిందనే చెప్పాలి. నేడు (శుక్రవారం) అంబటి రాయుడు 37వ పుట్టినరోజు. 1985 సెప్టెంబర్ 23న ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో పుట్టాడు. అంబటి తాత  


చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ప్రాణం. అందుకే వేరే ఆలోచన లేకుండా క్రికెట్ వైపే అడుగులు వేశాడు. హైదరబాద్, ఆంధ్ర జట్టులకు ప్రాతినిథ్యం వహించిన అంబటి 17 ఏళ్ల వయసులో ఓ రంజీ మ్యాచులో మొదటి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో అందరి దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత అండర్-19, రంజీలు ఆడి చివరికి 27ఏళ్ల వయసులో 2013లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ ద్వారా జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. అలా 2013లో టీమిండియాకు ఎంపికైన రాయుడు తన కెరీర్‌లో భారత్ తరపున మొత్తం 55 వన్డేలు, 6 టీ20 మ్యాచులు ఆడాడు. అలాగే 97 ఫస్ట్ క్లాస్ మ్యాచులు, 167 లిస్ట్ ఏ మ్యాచులు కూడా ఆడాడు. ఇక 2015 వన్డే వరల్డ్‌కప్ ఆడిన భారత జట్టుకి ఎంపికైన అంబటికి ఆ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. 


అంబటి కెరీర్‌లో వివాదాలెన్నో..

అంబటి రాయుడి కెరీర్ ఆసాంతం అనేక వివాదాలు ఉన్నాయి. 2012 ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆడిన అంబటి.. మీడియం పేసర్, ప్రస్తుత టీమిండియా బౌలర్ హర్షల్ పటేల్‌ని బూతులు తిట్టి వార్తల్లో నిలిచాడు. అలాగే 2014లో ఇండియ-ఏ జట్టు తరపున ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లిన సమయంలో అంపైర్‌తో గొడవపడ్డాడు. ఇక 2016 ఐపీఎల్‌లోనైతే ఏకంగా తన జట్టు సభ్యుడు, సీనియర్ బౌలర్ హర్భజన్ సింగ్‌తోనే ఘర్షణకు దిగాడు. ఆ తర్వాత 2018 సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలోనూ అంపైర్లతో గొడవపడడంతో రెండు మ్యాచుల నిషేధానికి గురయ్యాడు.


ఇవన్నీ ఒక ఎత్తైతే.. 2019 వన్డే వరల్డ్‌కప్‌లో చోటు దక్కకపోవడంపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన తీరు మరో ఎత్తు అనే చెప్పాలి. తన స్థానంలో ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ను ఎంపిక చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన అంబటి కూసింత వెరైటీగానే స్పందించాడు. టీమిండియా మ్యాచులు చూసేందుకు ‘త్రీడీ గ్లాసెస్ ఆర్డర్’ చేశానంటూ ట్వీట్ చేశాడు. ఇది అప్పుడు పెను దుమారం రేపింది. ఆ తర్వాత 2019 వన్డే వరల్డ్‌కప్‌కి ఎంపిక కాకపోవడంతో అసహనానికి గురైన అంబటి, అర్ధాంతరంగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ, ఆవేశంలో తీసుకున్న తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఆ తర్వాత కొన్నాళ్లకు వెనక్కి తీసుకున్నాడు. అయితే, ఆ సంఘటన తర్వాత అంబటికి మళ్లీ సెలక్టర్ల నుంచి పిలుపు రాలేదు.


అంబటి 'లవ్ మ్యారేజ్' అందరికి పెద్ద షాక్..

ఆన్ ఫీల్డ్‌లో ఎంతో ఆవేశంగా, దూకుడుగా ఉంటూ టెంపర్ కోల్పోయే అంబటి రాయుడు లవ్ మ్యారేజ్ చేసుకుని అందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు. అసలు ప్రేమ పెళ్లి చేసుకున్నాడంటే నమ్మడం కష్టమే. అందుకే అతని వ్యక్తిగత జీవితం పూర్తిగా డిఫరెంట్ అనే చెప్పాలి. అంబటి రాయుడు తనతో పాటు కాలేజీలో చదువుకున్న చెన్నుపల్లి విద్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీర వివాహం 2009లో ప్రేమికుల రోజున (ఫిబ్రవరి 14) జరగడం విశేషం. 11 ఏళ్ల వీరి వివాహబంధానికి గుర్తుగా అంబటి, విద్య దంపతులలకు వివియ రాయుడు అనే కూతురు ఉంది. 


Updated Date - 2022-09-23T18:21:58+05:30 IST