ఆల్‌ ఇంగ్లండ్‌ అందేనా?

ABN , First Publish Date - 2022-03-16T09:10:16+05:30 IST

రెండు దశాబ్దాలుగా ఊరిస్తున్న ప్రఖ్యాత ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షి్‌పను సొంతం చేసుకోవాలని భారత ఏస్‌ షట్లర్లు లక్ష్యసేన్‌, డబుల్‌ ఒలింపిక్‌ మెడలిస్ట్‌ పీవీ సింధు పట్టుదలతో..

ఆల్‌ ఇంగ్లండ్‌  అందేనా?

నేటినుంచే ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్‌

బరిలో సైనా, సింధు

శీకాంత్‌, లక్ష్య సేన్‌ కూడా

మ. 2.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో...

ప్రతిష్ఠాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌.. 


21 ఏళ్లుగా అందని ద్రాక్షలా భారత షట్లర్లను ఊరిస్తోంది. గోపీచంద్‌ తర్వాత నేటి తరం షట్లర్లలో మేటిగా భావించే సింధు, శ్రీకాంత్‌, సైనా కూడా టైటిల్‌ నెగ్గలేక పోయారు. అయితే, ఆరు నెలలుగా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న లక్ష్య సేన్‌పై భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో రెండు దశాబ్దాల నిరీక్షణకు ఈసారైనా తెరపడుతుందా..!


బర్మింగ్‌హామ్‌: రెండు దశాబ్దాలుగా ఊరిస్తున్న ప్రఖ్యాత ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షి్‌పను సొంతం చేసుకోవాలని భారత ఏస్‌ షట్లర్లు లక్ష్యసేన్‌, డబుల్‌ ఒలింపిక్‌ మెడలిస్ట్‌ పీవీ సింధు పట్టుదలతో ఉన్నారు. బుధవారం నుంచి జరిగే మెగా ఈవెంట్‌లో వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప రజత పతక విజేత కిడాంబి శ్రీకాంత్‌, వెటరన్‌ సైనా నెహ్వాల్‌ కూడా అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పుల్లెల గోపీచంద్‌ (2001), ప్రకాష్‌ పడుకోన్‌ (1980) మాత్రమే టాప్‌ టోర్నీలో విజేతలుగా నిలవగా.. ఈ తరం షట్లర్లలో 2015లో సైనా ఫైనల్‌ చేరినా టైటిల్‌ను దక్కించుకోలేకపోయింది. మేజర్‌ టోర్నీలో అద్భుత ప్రతిభను కనబర్చే సింధు.. గతేడాది సెమీ్‌సతోనే వెనుదిరిగింది. కాగా, గతవారం జరిగిన జర్మన్‌ ఓపెన్‌లో రెండో రౌండ్‌లోనే ఇంటి ముఖం పట్టిన సింధుకు.. ఆల్‌ ఇంగ్లండ్‌కు సిద్ధం కావడానికి కొంత సమయం దొరికింది. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో చైనా ప్లేయర్‌ వాంగ్‌ జు యితో ఆరో సీడ్‌ సింధు తలపడనుంది. సింధు క్వార్టర్స్‌ చేరితే జపాన్‌ స్టార్‌ యమగూచిని ఎదుర్కొనే చాన్సుంది. ఫిట్‌నెస్‌ సమస్యలతో ఇబ్బంది పడుతున్న సైనా.. థాయ్‌ షట్లర్‌ పోర్న్‌పవీ చొచోవోంగ్‌తో ఆడనుంది. 


సేన్‌పై భారీ అంచనాలు:

పురుషుల సింగిల్స్‌లో ఫుల్‌ఫామ్‌లో ఉన్న యువకెరటం లక్ష్యసేన్‌పై అందరి దృష్టీ నెలకొంది. జర్మన్‌ ఓపెన్‌లో ఒలింపిక్‌ చాంపియన్‌ విక్టర్‌ అక్సెల్‌సెన్‌(డెన్మార్క్‌)ను ఓడించి సంచలనం సృష్టించిన సేన్‌.. 


తొలి రౌండ్‌లో సహచరుడు సౌరభ్‌ వర్మతో తలపడనున్నాడు. మాజీ వరల్డ్‌ నంబర్‌ వన్‌ శ్రీకాంత్‌.. కంటపోన్‌ వాంగ్‌చెరోయిన్‌ (థాయ్‌లాండ్‌)తో ఆడనున్నాడు. కాగా, కొవిడ్‌ నుంచి కోలుకొన్న తర్వాత ఫామ్‌ కోసం తంటాలు పడుతున్న సాయి ప్రణీత్‌.. తొలి రౌండ్‌లోనే కఠిన ప్రత్యర్థి అక్సెల్‌సెన్‌ను ఎదుర్కోనున్నాడు. హెచ్‌ఎ్‌స ప్రణయ్‌, కశ్యప్‌, సమీర్‌ వర్మ కూడా బరిలో ఉన్నారు. పురుషుల డబుల్స్‌లో ఇండియా ఓపెన్‌ విజేత సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ జోడీ గెలుపు జోరును కొనసాగించాలనుకుంటోంది. ఈ జంట తొలి రౌండ్‌లో స్కాట్లాండ్‌ ద్వయం అలెగ్జాండ్రా-ఆడమ్‌తో తలపడనుంది. ధ్రువ్‌ -అర్జున్‌, అశ్విని-సిక్కి జంటలు కూడా టోర్నీలో ఆడుతున్నాయి. 

Updated Date - 2022-03-16T09:10:16+05:30 IST