నెంబర్‌ వన్‌..చాంపియన్‌

ABN , First Publish Date - 2022-09-13T09:04:13+05:30 IST

స్పెయిన్‌ టీనేజర్‌ కార్లోస్‌ అల్కరాజ్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌తో ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నాడు.

నెంబర్‌ వన్‌..చాంపియన్‌

యూఎస్‌ ఓపెన్‌ విజేత కార్లోస్‌ అల్కరాజ్‌

ఫైనల్లో కాస్పెర్‌ రూడ్‌పై గెలుపు

టైటిల్‌తోపాటు టాప్‌ ర్యాంక్‌ కైవసం


స్పెయిన్‌ టీనేజర్‌ కార్లోస్‌ అల్కరాజ్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌తో ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నాడు. నార్వే యువ కెరటం కాస్పెర్‌ రూడ్‌పై ఫైనల్లో గెలిచిన 19 ఏళ్ల అల్కరాజ్‌.. నడాల్‌ తర్వాత పిన్న వయస్సులో గ్రాండ్‌స్లామ్‌ అందుకున్న ఆటగాడయ్యాడు. అలాగే  సంప్రాస్‌ తర్వాత అతి తక్కువ వయస్సులో యూఎస్‌ ఓపెన్‌ సాధించిన ప్లేయర్‌గానూ వినుతికెక్కాడు. ఐదు దశాబ్దాల ఏటీపీ ర్యాంకింగ్స్‌లో చిన్న వయస్సులో టాప్‌ ర్యాంక్‌ అందుకున్నక్రీడారుడిగానూ కార్లోస్‌ రికార్డులకెక్కాడు.


న్యూయార్క్‌: టెన్నిస్‌ భవిష్య తారలు కార్లోస్‌ అల్కరాజ్‌, కాస్పెర్‌ రూడ్‌ మధ్య జరిగిన యూఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో..స్పెయిన్‌ స్టార్‌నే విజయం వరించింది. ఆర్ధర్‌ యాష్‌ కోర్టులో సోమవారం జరిగిన అంతిమ పోరులో అల్కరాజ్‌ 6-4, 2-6, 7-6 (1), 6-3తో  రూడ్‌పై గెలుపొందాడు. ఈ టైటిల్‌తోపాటు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో కార్లోస్‌ అగ్రస్థానానికి చేరాడు. 23 ఏళ్ల రూడ్‌ కనుక చాంపియన్‌ అయి ఉంటే అతడు కూడా నెం.1 ర్యాంక్‌ను కైవసం చేసుకొని ఉండేవాడు. డిఫెండింగ్‌ చాంపియన్‌ డానిల్‌ మెద్వెదెవ్‌ (రష్యా) ప్రీక్వార్టర్‌ఫైనల్లో ఓడిపోయిన నేపథ్యంలో ఫ్లషింగ్‌ మెడో్‌సలో విజేతగా నిలిచిన ఎవరికైనా టాప్‌ ర్యాంక్‌ లభించే అవకాశం ఏర్పడింది. ఇక..తొలి సెట్‌ను నెగ్గిన అల్కరాజ్‌ ఫైనల్‌ను ఆశావహంగా ప్రారంభించాడు.


అయితే ఒక్కసారిగా పుంజుకున్న రూడ్‌ రెండో సెట్‌ను ఏకపక్షంగా సొంతం చేసుకున్నాడు. ఇక కార్లోస్‌, కాస్పెర్‌ హోరాహోరీగా తలపడడంతో మూడో సెట్‌ టైబ్రేకర్‌కు దారితీసింది. అయితే టైబ్రేకర్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచిన అల్కరాజ్‌ అదే ఊపులో సెట్‌ను దక్కించుకున్నాడు. అదే జోరులో నాలుగో సెట్‌లో జయకేతనం ఎగురవేసిన అల్కరాజ్‌ చాంపియన్‌గా అవతరించాడు. విజయం సాధించిన వెంటనే చేతుల్లో ముఖం పెట్టుకొని ఉద్వేగానికి లోనయ్యాడు. అనంతరం నెట్‌ వద్దకు జంప్‌ చేసి రూడ్‌ను ఆలింగనం చేసుకున్నాడు.  


కార్లోస్‌ రికార్డులు..

రఫెల్‌ నడాల్‌ (2005 ఫ్రెంచ్‌ ఓపెన్‌) తర్వాత పిన్న వయస్సులో గ్రాండ్‌స్లామ్‌ విజేత

పీట్‌ సంప్రాస్‌ (1990, 19) అనంతరం చిన్న వయస్సులో (19) యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ కైవసం

హెవిట్‌ (2001, 20 ఏళ్ల 9 నెలలు)ను అధిగమించి తక్కువ వయస్సులో (19 సం 4నెలలు) నెం.1 ర్యాంకర్‌ గా ఆవిర్భావం 

కార్లోస్‌ ఫెరెరో, కార్లోస్‌ మోయా, నడాల్‌ తర్వాత టాప్‌ ర్యాంకర్‌గా నిలిచిన 4వ స్పెయిన్‌ ఆటగాడు అల్కరాజ్‌


కల నిజమైంది - అల్కరాజ్‌

నెం. 1గా, గ్రాండ్‌స్లామ్‌ చాంపియన్‌గా నిలవాలన్న నా కల నిజమైంది. నా టీం, నా కుటుంబం కలిసికట్టుగా శ్రమించిన ఫలితమిది. 

      

ప్రైజ్‌మనీ

అల్కరాజ్‌: రూ. 20.77 కోట్లు

రూడ్‌:      రూ. 10.38 కోట్లు

Read more