Messi: మెస్సీసేనకు షాక్‌

ABN , First Publish Date - 2022-11-23T03:28:29+05:30 IST

ఫిఫా వరల్డ్‌క్‌పలో పెనుసంచలనం నమోదైంది. టైటిల్‌ ఫేవరెట్‌ అర్జెంటీనాకు 51వ ర్యాంకర్‌ సౌదీ అరేబియా ఊహించని షాకిచ్చింది.

Messi: మెస్సీసేనకు షాక్‌

సాకర్‌ వరల్డ్‌కప్‌

నేడు సెలవు ప్రకటించిన సౌదీ రాజు

నాలుగు వరల్డ్‌కప్‌ల్లో (2006, 2014, 2018, 2022) గోల్స్‌ చేసిన తొలి అర్జెంటీనా ప్లేయర్‌గా.. ఓవరాల్‌గా పీలే, సీలర్‌, మిరోస్లావ్‌ క్లోజ్‌, రొనాల్డో తర్వాత ఐదో ఆటగాడిగా మెస్సీ రికార్డులకెక్కాడు.

1990లో కామెరూన్‌ చేతిలో 0-1తో ఓటమి తర్వాత.. మెగా ఈవెంట్‌లో తొలి మ్యాచ్‌లో ఓడడం అర్జెంటీనాకిదే తొలిసారి.

అర్జెంటీనా ఇంకొక్క మ్యాచ్‌ గెలిచివుంటే 37 వరుస విజయాల రికార్డు (ఇటలీ పేరిట)ను సమం చేసేది. అర్జెంటీనా అంతర్జాతీయ పోటీల్లో చివరిసారిగా 2019 జులై 3వ తేదీన...అంటే 1239 రోజుల క్రితం ఓడింది.

దోహా: ఫిఫా వరల్డ్‌క్‌పలో పెనుసంచలనం నమోదైంది. టైటిల్‌ ఫేవరెట్‌ అర్జెంటీనాకు 51వ ర్యాంకర్‌ సౌదీ అరేబియా ఊహించని షాకిచ్చింది. గ్రూప్‌-సిలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 1-2తో సౌదీ అరేబియా చేతిలో ఓడింది. దీంతో మెస్సీ సేన వరుస 36 మ్యాచ్‌ల విజయాల రికార్డుకు బ్రేక్‌ పడింది. 10వ నిమిషంలో పెనాల్టీ కిక్‌ను మెస్సీ గోల్‌గా మలచగా.. సౌదీ తరఫున సలేస్‌ అల్‌ షహ్రి (48వ), సలీమ్‌ అల్‌ డౌసరి (53వ) చెరో గోల్‌ సాధించారు. కీపర్‌ అల్‌ ఒవైస్‌ గోల్‌కు అడ్డుగోడలా నిలిచి.. అరేబియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. 1994లో బెల్జియంపై నెగ్గిన సౌదీకి ప్రఖ్యాత టోర్నీలో ఇదే అతిగొప్ప విజయం కావడంతో.. సంబరాలు చేసుకోవడానికి సౌదీ రాజు బుధవారం సెలవు ప్రకటించాడు. కాగా, ఫైనల్‌ విజిల్‌ తర్వాత ప్రత్యర్థి ఆటగాళ్లు సంబరాలు చేసుకొంటుంటే.. మెస్సీ నిశ్చేష్ఠుడై చూస్తూ ఉండిపోవడం అర్జెంటీనా ఫ్యాన్స్‌ను తీవ్రంగా బాధించింది.

ఫస్టాఫ్‌ అర్టెంటీనాదే..:

మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన అర్జెంటీనా.. ఆరంభం నుంచే తనదైన శైలిలో విరుచుకుపడింది. రెండో నిమిషంలోనే బంతిని అందిపుచ్చుకొన్న మెస్సీ.. సౌదీ గోల్‌పో్‌స్టలోకి షూట్‌ చేయగా.. కీపర్‌ చాకచక్యంగా అడ్డుకున్నాడు. కానీ, వరుస దాడులతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసిన అర్జెంటీనా.. 10వ నిమిషంలోనే ఫలితాన్ని సాధించింది. సౌదీ పెనాల్టీ ఏరియాలో లియనార్డో పరేడస్‌ జెర్సీని లాగుతూ అభ్యంతరకరంగా అడ్డుకోవడంతో సమీక్షించిన రెఫరీ.. అర్జెంటీనాకు పెనాల్టీ కిక్‌ ఇచ్చాడు. దీన్ని మెస్సీ గోల్‌గా మలచడంతో అర్జెంటీనా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత కూడా అర్జెంటీనా పదేపదే దాడులతో ప్రత్యర్థిని ఆత్మరక్షణలోకి నెట్టింది. అయితే, 30వ నిమిషంలో మార్టినెజ్‌, 35వ నిమిషంలో లౌటరో గోల్స్‌ చేసినా.. వాటిని ఆఫ్‌సైడ్‌గా నిర్ధారించిన రెఫరీ గోల్స్‌ ఇవ్వలేదు. మొత్తంగా ఫస్టా్‌ఫను అర్జెంటీనా ఆధిక్యంతో ముగించింది.

కానీ, సెకండాఫ్‌ ఆరంభమైన మూడో నిమిషంలోనే మెస్సీ సేనకు షాక్‌ తగిలింది. 48వ నిమిషంలో ప్రత్యర్థి మార్కింగ్‌ను తప్పించుకొంటూ ముందుకు సాగిన సౌదీ ఆటగాడు అల్‌ షహ్రి.. చాకచక్యంగా బంతిని గోల్‌లోకి పంపి 1-1తో స్కోరు సమం చేశాడు. ఈ షాక్‌నుంచి తేరుకోకముందే అర్జెంటీనా డిఫెన్స్‌ లోపాన్ని సద్వినియోగం చేసుకొన్న డౌసరి.. కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ పైకి కొట్టిన బంతి నేరుగా గోల్‌లో పడడంతో.. సౌదీ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత నుంచి అర్జెంటీనా.. సౌదీ గోల్‌పోస్టుపై దండయాత్రలు చేసినా వారి రక్షణ పంక్తిని ఛేదించలేక పోయింది. లిసాండ్రో మార్టినెజ్‌ను కొట్టిన షాట్‌ను ఒవైస్‌ అద్భుతంగా అడ్డుకోవడంతో సువర్ణావకాశం చేజారింది. టోర్నీలోనే తక్కువ ర్యాంక్‌ జట్లలో రెండోదైన సౌదీ అరేబియా.. అనూహ్య విజయంతో నాకౌట్‌ అవకాశాలను మెరుగుపరచుకొంది. కాగా, గ్రూప్‌-డిలో డెన్మార్క్‌, ట్యునీసియాల మధ్య మ్యాచ్‌ 0-0తో గోల్‌ లెస్‌ డ్రాగా ముగిసింది.

Updated Date - 2022-11-23T06:17:09+05:30 IST