అత్యున్నత శిఖరాలకు

ABN , First Publish Date - 2022-08-15T11:20:23+05:30 IST

దేశమంతా ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ పేరిట 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలను జరుపుకొంటున్న తరుణమిది. ఇన్ని దశాబ్దాలుగా క్రీడారంగంలో ఎన్నో అడ్డంకులను అధిగమించిన భారత్‌ ఇప్పుడు సగర్వంగా దూసుకెళుతోంది.

అత్యున్నత శిఖరాలకు

75 ఏళ్ల భారత క్రీడారంగం


దేశమంతా ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ పేరిట 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలను జరుపుకొంటున్న తరుణమిది. ఇన్ని దశాబ్దాలుగా క్రీడారంగంలో  ఎన్నో అడ్డంకులను అధిగమించిన భారత్‌ ఇప్పుడు సగర్వంగా దూసుకెళుతోంది. 1948 ఒలింపిక్స్‌లో ఏకైక పతకం అందుకున్నప్పటి నుంచి ఇటీవలి కామన్వెల్త్‌ గేమ్స్‌ వరకు సాధించిన ప్రగతి పరిశీలిస్తే సుదీర్ఘ  ప్రస్థానమే సాగింది. ఒకప్పుడు అంతర్జాతీయ ఈవెంట్స్‌లో పాల్గొనడమే గొప్ప అని భావించే పరిస్థితి. ఇప్పుడు ఏ గేమ్స్‌ అయినా పోడియంపై మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించే స్థితికి చేరగలిగాం. షూటింగ్‌, రెజ్లింగ్‌, అథ్లెటిక్స్‌, ఆర్చరీ, టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌, క్రికెట్‌ ఇలా ఏ క్రీడ తీసుకున్నా ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తున్నాం. ఈ నేపథ్యంలో స్వాతంత్ర్యానంతరం భారత క్రీడారంగం సాధించిన ఘన విజయాలను ఓసారి అవలోకనం చేసుకుందాం.(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)

ఆసియా గేమ్స్‌ (1951): స్వాతంత్ర్యానంతరం నాలుగేళ్లకే దేశంలో జరిగిన తొలి అంతర్జాతీయ క్రీడోత్సవమిది. 1951 మార్చి 4 నుంచి 11 వరకు ఢిల్లీలో జరిగిన ఈ ఈవెంట్‌ను విజయవంతంగా నిర్వహించాం. 11 దేశాల నుంచి 489 మంది అథ్లెట్లు పాల్గొనగా.. 8 క్రీడావిభాగాల్లో 57 ఈవెంట్స్‌లో పోటీలు జరిగాయి. ఇందులో భారత్‌ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి 15 స్వర్ణాలతో 51 పతకాలు సాధించి రెండో స్థానంలో నిలవడం విశేషం.


ఒలింపిక్స్‌ (1952): ఫిన్లాండ్‌ రాజధాని హెల్సెంకీలో జరిగిన 1952 ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున 64 మంది అథ్లెట్లు పాల్గొనగా, అత్యధికంగా రెండు పతకాలు వచ్చాయి. రెజ్లర్‌ కేడీ జాదవ్‌ రజతంతో తొలి వ్యక్తిగత పతకం సాధించిన భారతీయుడిగా నిలిచాడు. ఈ క్రీడలతో స్వాతంత్య్రం తర్వాత హాకీ జట్టు రెండో పసిడి అందుకుంది. 1948లోనూ హాకీ స్వర్ణంతో అలరించింది.


వరల్డ్‌కప్‌ హాకీ (1975): మలేసియాలో 1975లో జరిగిన హాకీ వరల్డ్‌క్‌పలో భారత్‌ స్వర్ణం సాధించింది. ఫైనల్లో పాకిస్థాన్‌ను 2-1 తేడాతో మట్టికరిపించింది. 


ఆసియా గేమ్స్‌ (1982): భారత్‌ రెండోసారి ఆతిథ్యమిచ్చిన ఈ గేమ్స్‌లో 13 స్వర్ణాలతో 57 పతకాలు కైవసం చేసుకుంది.


వన్డే ప్రపంచకప్‌ (1983): ప్రపంచ క్రికెట్‌లో భారత్‌ ఆధిపత్యానికి బీజం వేసిన టోర్నీ ఇది. అప్పటికే రెండు వరుస ప్రపంచక్‌పలు సాధించిన వెస్టిండీ్‌సను కపిల్‌ దేవ్‌ సారథ్యంలోని భారత జట్టు ఓడించి విజేతగా నిలిచింది. ఆ తర్వాత దేశంలో క్రికెట్‌ అత్యంత ఆదరణ కలిగిన ఆటగా మారింది.


అట్లాంటా ఒలింపిక్స్‌ (1996): భారత్‌లో 1990వ దశకం వరకు హాకీ, క్రికెట్‌ మినహా మిగిలిన క్రీడల్లో పరిమిత విజయాలే వచ్చాయి. కానీ అనూహ్యంగా అట్లాంటా గేమ్స్‌లో లియాండర్‌ పేస్‌ (టెన్నిస్‌) కాంస్యం ద్వారా మరెంతో మందికి ఆదర్శంగా నిలిచాడు.


సిడ్నీ ఒలింపిక్స్‌ (2000): తెలుగు తేజం కరణం మల్లీశ్వరి (వెయిట్‌ లిఫ్టింగ్‌) రూపంలో భారత మహిళా అథ్లెట్‌ తొలిసారిగా ఓ పతకం అందుకుంది. ఈ విజయంతో మల్లి.. దేశంలో మహిళలకు ఆటలపై మక్కువ ఏర్పడేలా చేసింది.


ఏథెన్స్‌ ఒలింపిక్స్‌ (2004): కార్గిల్‌ యుద్ధంలో పాల్గొన్న ఆర్మీ కల్నల్‌ రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌ షూటింగ్‌లో రజతం అందుకున్నాడు. తద్వారా ఏ విభాగంలోనైనా ఈ పతకం చేజిక్కించుకున్న తొలి భారత అథ్లెట్‌గా నిలిచాడు.


బీజింగ్‌ ఒలింపిక్స్‌ (2008): ఈ క్రీడల్లో షూటర్‌ అభినవ్‌ బింద్రా స్వర్ణ పతకం అందుకున్న తొలి భారత అథ్లెట్‌గా దేశ గౌరవాన్ని మరింతగా ఇనుమడించాడు. విజేందర్‌, సుశీల్‌ కాంస్యాలు సాధించారు. 


కామన్వెల్త్‌ గేమ్స్‌ (2010): భారత్‌ నిర్వహించిన అతి పెద్ద క్రీడా ఈవెంట్‌ ఇదే. 71 దేశాల నుంచి 4350 మంది అథ్లెట్లు పోటీపడ్డారు. మన క్రీడాకారులు రికార్డుస్థాయిలో 38 స్వర్ణాలు సహా 101 పతకాలు నెగ్గి పట్టికలో  ఆస్ట్రేలియా తర్వాత భారత్‌ను రెండో స్థానంలో నిలిపారు. 


వన్డే వరల్డ్‌కప్‌ (2011): స్వదేశంలో జరిగిన ఈ మెగా ఈవెంట్‌ నేటితరం క్రికెట్‌ ప్రేమికులను ఎంతగానో అలరించింది. 28ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఎంఎస్‌ ధోనీ కెప్టెన్సీలో భారత్‌ వన్డే ప్రపంచక్‌పను ముద్దాడింది. ఫైనల్లో శ్రీలంకను 6 వికెట్ల తేడాతో ఓడించడంతో పాటు సొంతగడ్డపై ఈ టైటిల్‌ సాధించిన తొలి జట్టుగా నిలిచింది.


టోక్యో ఒలింపిక్స్‌ (2020): కరోనా కారణంగా షెడ్యూల్‌కన్నా ఓ ఏడాది ఆలస్యంగా జరిగిన టోక్యో గేమ్స్‌లో జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా చరిత్ర సృష్టించాడు. వందేళ్ల అథ్లెటిక్స్‌ చరిత్రలో ఒక్క పతకం కూడా లేని లోటును అతడు ఏకంగా స్వర్ణంతో పూరించాడు. తద్వారా భిన్న క్రీడాంశాల్లో భారత్‌ సాధిస్తున్న ప్రగతిని చాటి చెప్పినట్టయింది. బింద్రా తర్వాత వ్యక్తిగత స్థాయిలో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో భారత అథ్లెటయ్యాడు నీరజ్‌. మీరాబాయి, రవి దహియా రజతాలు.. సింధు, లవ్లీనా, బజ్‌రంగ్‌, పురుషుల హాకీ జట్టు కాంస్య పతకాలతో మురిపించారు. ఇక, పారాలింపిక్స్‌లో 5 స్వర్ణాలతో మొత్తంగా 19 మెడల్స్‌ సాధించడం మరో విశేషం. 2016 రియో ఒలింపిక్స్‌లో షట్లర్‌ సింఽధు రజతం, రెజ్లర్‌ సాక్షి మాలిక్‌ కాంస్యం.. 2012 లండన్‌ విశ్వక్రీడల్లో బాక్సింగ్‌లో మేరీకోమ్‌, బ్యాడ్మింటన్‌లో సైనా కాంస్యాలు సహా ఆరు పతకాలతో చరిత్ర సృష్టించారు. 


కామన్వెల్త్‌ గేమ్స్‌ (2022): ఈ గేమ్స్‌లో పతకాలను కొల్లగొట్టే ఆర్చరీ, షూటింగ్‌ ఈసారి లేకపోయినా.. భారత అథ్లెట్లు స్ఫూర్తిదాయక ఆటతీరుతో ఆకట్టుకున్నారు. 22 స్వర్ణాలతో 61 పతకాలను సాధించారు. అత్యధికంగా రెజ్లింగ్‌లో 12, వెయిట్‌లిఫ్టింగ్‌లో 10 మెడల్స్‌ వచ్చాయి. ఇక ఎప్పటిలాగే బ్యాడ్మింటన్‌, అథ్లెటిక్స్‌, టేబుల్‌ టెన్ని్‌సలతో పాటు అనూహ్యంగా లాన్‌బౌల్స్‌లోనూ రెండు పతకాలతో సత్తా చాటడం గర్వకారణం. 
75 ఏళ్ల భారత క్రీడా చరిత్రలో హాకీ మాంత్రికుడు మేజర్‌ ధ్యాన్‌చంద్‌, అథ్లెటిక్స్‌లో ఫ్లయింగ్‌ సిఖ్‌ మిల్కా సింగ్‌, పీటీ ఉష, టెన్నిస్‌లో సానియా మీర్జా లాంటి క్రీడాకారులు దిగ్గజాలుగా నిలిచారు. అలాగే క్రికెట్‌ గాడ్‌గా నీరాజనాలు అందుకున్న సచిన్‌ టెండూల్కర్‌ వంద కోట్ల భారతావనిని దశాబ్దాలుగా అలరించాడు. 

Read more