Vijay Hazare : ఒకే ఓవర్‌లో 7 సిక్స్‌లు

ABN , First Publish Date - 2022-11-29T01:16:28+05:30 IST

మహారాష్ట్ర కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (159 బంతుల్లో 10 ఫోర్లు, 16 సిక్స్‌లతో 220 నాటౌట్‌) విధ్వంసకర బ్యాటింగ్‌తో పెను సంచలనం సృష్టించాడు.

Vijay Hazare : ఒకే ఓవర్‌లో 7 సిక్స్‌లు

6,6,6,6,6 (నోబ్‌), 6,6తో

రుతురాజ్‌ విధ్వంసం

పరిమిత ఓవర్లలో ప్రపంచ రికార్డు

స్పిన్నర్‌ శివ సింగ్‌కు చుక్కలు

విజయ్‌ హజారే సెమీస్‌లో మహారాష్ట్ర

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో ఏడు సిక్స్‌లు బాదిన తొలి బ్యాటర్‌గా రుతురాజ్‌. కాగా, 1990లో వెల్లింగ్టన్‌-క్యాంట్‌బరీ జట్ల మధ్య వెల్లింగ్టన్‌లో జరిగిన షెల్‌ ట్రోఫీ 4 రోజుల ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌ లీ జర్మన్‌ ఒకే ఓవర్‌లో 8 సిక్స్‌లు బాదడం ఓవరాల్‌ రికార్డు. ఆ మ్యాచ్‌లో బౌలర్‌ బెర్త్‌ వాన్స్‌ 17 నోబాల్స్‌తో కలిపి మొత్తం 22 బంతుల ఓవర్‌ వేశాడు. ఆ ఓవర్లో వెల్లింగ్టన్‌ 77 రన్స్‌ సాధించింది.

విజయ్‌ హజారే ట్రోఫీలో ఓ ఓవర్‌లో 43 పరుగులు సాధించడం ఇదే తొలిసారి. గతంలో కేరళ.. హైదరాబాద్‌ బౌలర్‌ రవితేజ బౌలింగ్‌లో ఓ ఓవర్‌లో 35 పరుగులు సాధించడం ఇప్పటి వరకు టోర్నీ రికార్డు.

విజయ్‌ హజారే ట్రోఫీలో అత్యధికంగా 16 సిక్స్‌లు సాధించిన తొలి బ్యాటర్‌గా.. ఓవరాల్‌గా రెండో భారత ఆటగాడిగా గైక్వాడ్‌. 2013లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ 16 సిక్స్‌లతో 209 పరుగులు చేశాడు.

అహ్మదాబాద్‌: మహారాష్ట్ర కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (159 బంతుల్లో 10 ఫోర్లు, 16 సిక్స్‌లతో 220 నాటౌట్‌) విధ్వంసకర బ్యాటింగ్‌తో పెను సంచలనం సృష్టించాడు. ఒకే ఓవర్‌లో ఏడు సిక్స్‌లతో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా సోమవారం ఉత్తరప్రదేశ్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో గైక్వాడ్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో.. 58 పరుగుల తేడాతో నెగ్గిన మహారాష్ట్ర సెమీ్‌సకు చేరుకొంది. అప్పటి వరకు ఓ మాదిరిగా ఆడిన రుతురాజ్‌.. స్పిన్నర్‌ శివ సింగ్‌ (9-0-88-0) వేసిన 49వ ఓవర్‌లో ఒక్కసారిగా శివాలెత్తి పోయాడు. వరుస బంతుల్లో ఏడు సిక్స్‌లు (నోబాల్‌ సహా) బాది.. ఒకే ఓవర్‌లో మొత్తం 43 పరుగులు పిండుకున్నాడు. ఈ ఫీట్‌తో ఒక ఓవర్‌లో ఆరు వరుస బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టిన సోబర్స్‌, రవిశాస్త్రి, యువరాజ్‌ సింగ్‌ తదితరులను అధిగమించాడు. సుడిగాలి బ్యాటింగ్‌ చేసిన రుతురాజ్‌ డబుల్‌ సెంచరీ చేయడంతో.. తొలుత బ్యాటింగ్‌కు దిగిన మహారాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 330 పరుగులు చేసింది. కార్తీక్‌ త్యాగి 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేదనలో ఉత్తరప్రదేశ్‌ 47.4 ఓవర్లలో 272 పరుగులకు కుప్పకూలింది. ఆర్యన్‌ జుయాల్‌ (159) సెంచరీ వృథా అయింది. రాజ్‌వర్ధన్‌ హంగర్గేకర్‌ 5 వికెట్ల దక్కించుకున్నాడు.

2 ఓ ఓవర్‌లో 43 పరుగులు రాబట్టడం ఇది రెండోసారి. 2018లో న్యూజిలాండ్‌ బ్యాటర్లు జో కార్టర్‌-బెర్ట్‌ హ్యాంప్టన్‌లు ఓ లిస్ట్‌-ఎ మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో 43 పరుగులు సాధించారు. 2013లో జింబాబ్వేకు చెందిన ఎల్టన్‌ చిగుంబర ఢాకా ప్రీమియర్‌ డివిజన్‌ మ్యాచ్‌లో ఒకే ఓవర్లో 39 పరుగులు చేశాడు.

శివ.. 3600 బౌలర్‌

గైక్వాడ్‌ చేతిలో చితగ్గొట్టించుకొన్న ఉత్తరప్రదేశ్‌ లెఫ్టామ్‌ స్పిన్నర్‌ శివకు.. 360 డిగ్రీల బౌలర్‌ అనే పేరుకూడా ఉంది. భారత అండర్‌-19 మాజీ క్రికెటర్‌ అయిన శివకు ప్రయోగాలు చేయడం అంటే ఎంతో ఇష్టం. 2018లో సీకే నాయుడు ట్రోఫీలో కేరళతో మ్యాచ్‌లో రన్నప్‌ సమయంలో వింతగా ఓ ఆత్మ ప్రదక్షిణం చేసి బంతిని వేశాడు. అయితే, అంపైర్లు దాన్ని డెడ్‌బాల్‌గా ప్రకటించారు. బ్యాటర్లు రివర్స్‌ స్వీప్‌లు చేస్తే తప్పుకాదు.. కానీ, బౌలర్‌ కొంచెం భిన్నంగా చేస్తే మాత్రం డెడ్‌బాల్‌గా ప్రకటిస్తారా? అని ఆ సమయంలో శివ ప్రశ్న లేవనెత్తాడు.

గైక్వాడ్‌ చెలరేగాడిలా....

(49వ ఓవర్‌.. బౌలర్‌ శివ సింగ్‌)

తొలి బంతి మిడ్‌ వికెట్‌ మీదుగా 6

రెండో బంతి స్ట్రయిట్‌గా బౌండ్రీ ఆవలకు 6

మూడో బంతి స్క్వేర్‌ లెగ్‌ మీదుగా 6

నాలుగో బంతి లాంగ్‌ ఆఫ్‌ మీదుగా 6

ఐదో బంతి (నోబాల్‌) లాంగ్‌ ఆఫ్‌ మీదుగా 6

ఫ్రీ హిట్‌ లాంగాన్‌ మీదుగా 6

ఆరో బంతి డీప్‌ మిడ్‌వికెట్‌ మీదుగా 6

Updated Date - 2022-11-29T01:16:29+05:30 IST