ఒక హీరోయిన్‌ ఇంటి దగ్గర కుక్కలను చూసుకునే పని చేసిన ఇతను ఇవాళ..

ABN , First Publish Date - 2022-09-25T18:54:59+05:30 IST

ఎత్తు నాలుగడుగులు దాటదు. బక్కపలచటి మనిషి. సినిమా హీరోల వంటి ముఖమూ కాదు. వయసు 57 ఏళ్లు. అయినా అతను..

ఒక హీరోయిన్‌ ఇంటి దగ్గర కుక్కలను చూసుకునే పని చేసిన ఇతను ఇవాళ..

ఎత్తు నాలుగడుగులు దాటదు. బక్కపలచటి మనిషి. సినిమా హీరోల వంటి ముఖమూ కాదు. వయసు 57 ఏళ్లు.  అయినా అతను డ్యాన్సులేస్తాడు. అతను వేసే డ్యాన్సులను జనం వెర్రిగా చూస్తారు. లక్షలాది వీక్షకులతో యూట్యూబ్‌ స్టార్‌గా మారిన పొట్టిమామది శ్రీకాళహస్తి సమీపంలోని భీమవరం. తాత నుంచి వారసత్వంగా కళను మాత్రం కాపాడుకుని, భూములు పోగొట్టుకొన్న పొట్టిమామ అను భీమవరం రవీంద్ర కథ ఇది.


‘‘శ్రీకాళహస్తి మండలం భీమవరం  మా ఊరు. మా తాత భీమవరం నరసయ్య భోగాతాలు ఆడడంలో ప్రసిద్ధుడు. మా నాయన వెంకటకృష్ణయ్యకు 18 ఎకరాల భూమి, ఇల్లుతో పాటు వీధినాటకాలనూ వారసత్వంగా అందించారు. మా నాయన కూడా నాకు నాటక కళతో పాటూ నాలుగున్నర ఎకరాలు మిగిల్చాడు. మా తాత తండ్రులకు నేనూ తగ్గలేదు. నా నాటకాల పిచ్చి చూసి నాలుగు ఎకరాలు అమ్మేసి ఆ డబ్బులు నా చేతిలో పెట్టాడు మా నాయన. ఇంకేముంది శ్రీకాళహస్తి జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివే నేను, వెంటనే మద్రాసు రైలెక్కేశాను. ఏడో తరగతిలో ఉండగానే మా అమ్మ బ్లడ్‌ క్యాన్సర్‌తో చనిపోయింది. పదో తరగతి ఫెయిలైన నేను కొన్ని సినిమా కథలు రాశాను. బలి, మరో రుద్రమదేవి, కలగన్న ఓ అమ్మాయి పేర్లతో రాసిన కథల పుస్తకాలు పట్టుకుని మద్రాసులో రెండు నెలల పాటు షూటింగులు ఎక్కడ జరుగుతుంటే అక్కడ వాలిపోయేవాడిని. షూటింగులు చూస్తూ కలల్లో తేలిపోయే వాడిని. కలలతో పాటూ చేతిలోని డబ్బులూ కరిగిపోయాయి. ఆకలి మాత్రమే కళ్ల ఎదుట నిలిచింది. కడుపు నింపుకోవడానికి మద్రాసులోనే ఒక హీరోయిన్‌ ఇంటి దగ్గర కుక్కలను చూసుకునే పనికి కుదిరా. ఎప్పటికైనా సినిమా వాళ్ల చూపు నా మీద పడుతుందనే ఆశ నెరవేరలేదు. మద్రాసు రైల్వేస్టేషన్‌ ప్లాట్‌ఫాం మీద ఆకలితో పడున్న నన్ను చూసి పోలీసులు నాయుడుపేటకు రైలెక్కించారు. చేతిలో చిల్లిగవ్వ లేదు. రైలు దిగి 50 కిలోమీటర్లు నడుచుకుంటూ భీమవరానికి చేరుకున్నా. నాయన లివర్‌ క్యాన్సర్‌తో కన్నుమూశాడు.


పుట్టిన ఊళ్లో అనాథగా మిగిలిన నాకు వారాల వంతున ఇంటికొకరు అన్నంపెట్టారు. సినిమా నన్ను వెంటాడుతూనే ఉండేది. ఆ తరువాత వెంకటగిరిలో ఓ బారులో సప్లయర్‌గా పనిచేస్తూ మాపల్లె రాముడు, ప్రేమజీవులు, దుర్గ, దేవదూతలు, సింహం శీర్షికలతో 5 సినిమా కథలు రాశా. ఇలా లాభం లేదని సాంఘిక నాటకాల మీదకు మళ్లాను.  చాకలి రంగయ్య నాటకాన్ని రాసి, అందులో రంగమ్మ అనే పాత్రను పోషించా. జనానికి నచ్చింది. అది ఉత్సాహాన్నిచ్చింది. దొరలే దొంగలు, రౌడీ పోలీసు, మరణ పోరాటం, జ్వాలాగ్ని, ప్రేమకోసం, మా పల్లె రాముడు, బ్రహ్మరుద్రులు, ప్రజాపోరాటం.. ఇట్లా 60 నాటకాలు రాశా.  నేను నాటకాలు ఆడుతూ, ఊళ్లలో పిల్లలకు నేర్పిస్తూ దాన్నే ఉపాధిగా మార్చుకున్నా. ఇల్లరికం ఉంటే తన కూతుర్ని ఇస్తానని మా అత్త గంగమ్మ చెప్పడంతో, సుబ్బరత్నను పెళ్లి చేసుకున్నా. ముగ్గురు కొడుకులు పుట్టారు. నాటకాల పిచ్చిని బలవంతంగా అణచుకుని మేకలు మేపుకుంటూ బతుకుతుండగా మేర్లపాకకు చెందిన ప్రజ్వల్‌ అనే యువకుడు నన్ను యూట్యూబ్‌లోకి లాక్కొచ్చాడు. సినిమాలు, నాటకాల్లో రాని పేరు ప్రఖ్యాతులు యూట్యూబ్‌ వీడియోల్లో వస్తున్నాయి. ప్రజ్వల్‌ నావంటి పిచ్చోడే. కాకపోతే టెక్నాలజీ తెలిసిన పిలగాడు. మొబైల్‌ కూడా వాడడం తెలీని నన్ను యూట్యూబ్‌ స్టార్‌ను చేసేశాడు. చిన్న చిన్న స్ర్కిప్ట్‌లు చేశాం. డ్యాన్సులు వేస్తున్నా. 


సినిమా సెలక్షన్స్‌ అనే నాలుగున్నర నిమిషాల కామెడీ స్ర్కిప్ట్‌కు 20 వేల వ్యూస్‌ రావడంతో వరుసగా 33 స్ర్కిప్ట్‌లు చేశాం. ఆ తర్వాత పీఆర్‌ మ్యూజికల్స్‌ అనే పేరుతో మరో చానల్‌ను ప్రారంభించి కవర్‌సాంగ్స్‌ చేయడం మొదలు పెట్టాం.ఇక్కడే నా పేరు పొట్టిమామగా మారింది. నాతో కలిసి డ్యాన్స్‌ చేసేందుకు జోడు దొరకలేదు. జ్యోత్స్న అనే చిన్న పాపతో మొదట చేశా. చిరంజీవి స్నేహం కోసం సినిమాలోని కైకలూరి కన్నేపిల్ల పాట  మూడు మిలియన్ల వ్యూస్‌తో సంచలనం అయింది. ఆ తరువాత కుసుమ అనే అమ్మాయితో చిరంజీవి పాటను చేశా. తిరుపతికి చెందిన డిగ్రీ విద్యార్థిని ఉష ఇటీవల మా బృందంలో కలిసింది. శ్రీకాళహస్తిలో డిగ్రీ చదివే పండు ఠాగూర్‌ సినిమాలోని వానచ్చోవరదచ్చొ పాటకు కలిసింది. ఇలా మేమంతా బృందంగా ఏర్పడి వరుసగా చిరంజీవి పాటలతో వీడియోలు  చేస్తున్నాం. ఇవన్నీ బాగా ట్రెండింగ్‌ అయ్యాయి. దీంతో ఈవెంట్ల అవకాశాలు వస్తున్నాయి.వాటితో పాటూ డబ్బులొస్తున్నాయి. నేను వెంటబడితే వెనక్కిపోయిన సినిమా అవకాశాలు ఇప్పుడు వెతుక్కుంటూ వస్తున్నాయి. నీలకంఠ అనే సినిమాలో రైతుగా ఇటీవల నటించా. ఇంకా రిలీజ్‌ కాలేదు. హీరో రామ్‌చరణ్‌‌తో తెరకెక్కనున్న ఒక సినిమాలో నటించే అవకాశముంది.’’చిరంజీవిని కలవాలన్నదే నా కల

మెగాస్టార్‌ చిరంజీవిని కలవాలన్నది నా కల. ఆశయం. లక్ష్యం. ఆయన పుట్టినరోజునే నా పుట్టిన రోజు. ఈ సందర్భంగా గత నెల ఆయన చేసిన నడక కలిసిన నవరాత్రిని చిత్రీకరించాం.కేవలం 20 రోజుల్లో పదిలక్షలమంది వీక్షించారు. భూములు పోయినా, ఆస్తులు లేకపోయినా, ఇప్పుడు ఆనందంగా అయితే ఉంది. మా తాత, నాయన కూడా ఎక్కడో నన్ను దీవిస్తున్నట్టే ఉంటుంది. 

- పొట్టిమామ

Read more