మీ జీవిత భాగస్వామి మీతో చెప్పేవన్నీ నిజాలా..? అబద్ధాలా..? ఈ 9 సూచనలతో తేల్చేయొచ్చు..!

ABN , First Publish Date - 2022-09-19T15:19:36+05:30 IST

తరచుగా అబద్దాలు చెబుతున్న వారు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అలాంటి వారిని పట్టుకోవడానికి కొన్ని మార్గాలున్నాయి.

మీ జీవిత భాగస్వామి మీతో చెప్పేవన్నీ నిజాలా..? అబద్ధాలా..? ఈ 9 సూచనలతో తేల్చేయొచ్చు..!


వెయ్యి అబద్దాలు ఆడి అయినా ఒక పెళ్ళి చేయచ్చు అంటారు పెద్దవారు. పెళ్ళి అయిపోయాక ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉంటే సమస్యలు ఏవీ రావనీ, కాలం గడుస్తున్న కొద్దీ అంతా సర్దుకుంటుందిలే అని అనుకుంటూ ఉంటారు. కానీ పెళ్ళయిన తరువాత భార్యా భర్తలలో ఎవరైనా అబద్దం చెబితే అవి ఇద్దరి మధ్య బంధానికి చాలా ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి. కొందరు తమ జీవిత భాగస్వామి వద్ద కొన్ని విషయాలు దాచిపెడుతూ ఉంటారు. బయట చేసేది ఒక పని అయితే, ఇంట్లో చెప్పేకారణం వేరే ఉంటుంది. ఇది ఒకటి రెండు సార్లు అయితే పర్వాలేదు. కానీ అదే పద్దతిని ఎక్కువసార్లు కొనసాగిస్తే భాగస్వాములను అనుమానించాల్సి ఉంటుంది. ఒక రకంగా ఇది మోసమే అని చెప్పవచ్చు. ఇలా తరచుగా అబద్దాలు చెబుతున్న వారు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అలాంటి వారిని పట్టుకోవడం వారు చెబుతున్నది అబద్జమని అర్థం చేసుకోవడానికి కొన్ని మార్గాలున్నాయి. 


పొంతనలేని సమాధానాలు పట్టుకోవడం


కొన్నిసార్లు ఇంటికి ఆలస్యంగా వస్తుంటారు. ఎందుకింత ఆలస్యమని అడిగితే వెహికల్ ట్రబులిచ్చిందనో, తెలిసినవాళ్ళు  కనబడితే మాట్లాడుతూ ఆలస్యమయిందనో, ఆఫీసులో పని ఎక్కువ చెప్పారనో కారణాలు చెబుతుంటారు. కానీ అటువైపు జరిగింది వేరుగా ఉంటుంది. ఎవరినో పర్సనల్ గా కలుసుకుని వచ్చి దాన్ని కవర్ చేస్తూ ఇలా అబద్దాలు చెబుతారు. అయితే ఇలాంటి వాళ్ళను పట్టుకోవడానికి ఒక ట్రిక్ ఉంది. మొదట అడిగిన తరువాత ఇక ఆ విషయం గురించి ఎలాంటి చర్చ చేయకుండా సైలెంట్ అయిపోవాలి, ఆ టాపిక్ గురించి ఎలాంటి డిస్కస్ చేయకపోయే సరికి అవతలి వాళ్ళు కూడా హమ్మయ్య అనుకుంటూ బాగా రిలాక్స్ అయిపోతారు. కొంత సమయం గడిచిపోయాక అనుకోకుండా మళ్ళీ ఎందుకింత ఆలస్యమయిందని రెండోసారి ప్రశ్నించాలి. చాలా మంది అలా అడిగినప్పుడు  90శాతం వేరు సమాధానాలు చెప్పేస్తారు. అంటే ఒకే ప్రశ్నకు వేరు వేరు సందర్భాలలో వేరు సమాధానాలు చెబుతారు. ఇలా పొంతన లేని సమాధానాలు చెప్పడం వల్ల వారి మాటల్లో అబద్దముందని సులువుగా కనిపెట్టేయచ్చు.


సరైన స్పందన లేకపోవడం

జీవిత భాగస్వాములంటే అన్ని విషయాలు మనసువిప్పి మాట్లాడుకోవాలి కానీ తప్పించుకుని తిరగకూడదు. అన్యమనస్కంగా ఉండటం, పొడిపొడిగా సమాధానాలు ఇవ్వడం, ఏ విషయాలు షేర్ చేసుకోకుండా ఉండటం, తన మానాన తను ఉంటూ భాగస్వామికి సంబందించిన విషయాలు ఏవీ పట్టించుకోకపోవడం,  ప్రవర్తనలో నిర్లక్ష్య ధోరణి ఉండటం వంటివి గమనిస్తే ఆ జీవిత భాగస్వాములు ఏదో దాస్తున్నారని వారు అబద్దాలు చెబుతున్నారని అర్దం. 


ఎదురు ప్రశ్న

చాలా మంది ఆత్మరక్షణలో ఉన్నవారు ఏదైనా అడిగినపుడు సమాధానం చెప్పకపోగా తిరిగి ఎదురుప్రశ్న వేస్తారు. ఇది వారిలో తప్పించుకునే స్వభావాన్ని, వారు తప్పు చేశారనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఏ విషయం గురించి డిస్కస్ మొదలు పెట్టినా తప్పు అవతలి వారివైపు ఉన్నా చివరికి వచ్చేసరికి మిమ్మల్నే దోషిగా మార్చి నిందించడం, మీరే కారకులుగా పేర్కొనబడటం జరుగుతూ ఉంటుంది. అప్పుడు మీరు బలహీనులేమో అనే సందేహం వస్తూ ఉంటుంది కానీ అది మీ తప్పు కాదు, ఎదుటివారు సమాధానం చెప్పుకోలేక చేసే తిరుగుబాటు.కప్పిపుచ్చుకునే ధోరణి

అడిగేది చిన్న ప్రశ్న అయినా దానికి లైఫ్ పార్ట్నర్ పెద్ద పెద్ద వివరణలు ఇస్తూ ఉంటే తమ తప్పులను, తమ ప్రవర్తనను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తోంటే కచ్చితంగా అబద్ధాలు చెబుతున్నారని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి వివరణల్లో తడబాటు, వారిలో ఆందోళన కూడా వ్యక్తమవుతాయి. 


తిరస్కార ధోరణి

కొందరిలో తిరస్కార ధోరణి ఉంటుంది. తాము ఎక్కడ బయటపడిపోతామోననే వారిలోని భయం వారిని కోపంగా మాట్లాడేలా చేస్తుంది. ఇలా కోపంగా మాట్లాడుతున్నప్పుడు గొడవెందుకులే అనే కారణంతో మాట్లాడే విషయాన్ని ఇవతలి వారు మధ్యలో ఆపేస్తారు. దాంతో జీవిత భాగస్వామికి సమాధానం చెప్పకుండానే ఎస్కేప్ అయిపోతారు. ఏదైనా అడిగితే చాలు వెంటనే కోపం తెచ్చుకుని సమాధానాన్ని దాటవేసే దోరణిని కలిగిన ఉన్న జీవిత భాగస్వాముల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి వారి విషయంలో భవిష్యత్తులో చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిరావచ్చు.


టాపిక్ డైవర్ట్ చేయడం

ఏదైనా విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు దాన్ని డైవర్ట్ చేయడం కొందరికి వెన్నతో పెట్టిన విద్య. అలా డైవర్ట్ చేయడం అంటే విషయాన్ని చర్చించే ఉద్దేశ్యం లేదనే అర్థం. ఆ విషయాన్ని చర్చించే ఉద్దేశం లేకుంటే.. దాన్ని డైవర్ట్ చేయడానికి ఎంతో అందమైన కథలు అల్లడం చేస్తారు. పొగడ్తలు గుప్పించడమో, అవసరం లేని విషయాలను ఆసక్తిగా చెప్పి అట్రాక్ట్ చెయ్యడమో చేస్తుంటారు. వీటి ద్వారా చెప్పాల్సిన విషయాన్ని చాలా సులువుగా చర్చ నుండి తొలగిపోయేలా చెస్తారు.


బాడీ లాంగ్వేజ్

పైకి ఏమీ లేనట్టు మాట్లాడుతున్నా లైఫ్ పార్ట్నర్ శారీరక ప్రవర్తనను గమనించి వారు తప్పు చేశారా ఏదైనా దాస్తున్నారా అనే విషయాన్నితెలుసుకోవచ్చు. చూపులు కంగారుగా ఉండటం, ముఖంలో ఆందోళన, భుజాలు కుదురుగా ఉండకపోవడం, చేతులు పదే పదే నలుపుకోవడం, చెమటలు పట్టడం, కూర్చున్న ప్రదేశంలో కుదురుగా ఉండలేక పోవడం వంటి శారీరక ప్రవర్తనా మార్పుల వల్ల కనిపెట్టవచ్చు.


సెక్యూర్డ్ గా ఉండటం

ప్రతి విషయాన్ని లైఫ్ పార్ట్నర్ కు తెలియకుండా ఉండాలనే ధోరణిలో ఉండేవారు చాలా సీక్రెట్‌ మెయింటెయిన్ చేస్తారు. మొబైల్ ఫోన్ లాక్ చేయడం, ఫోన్ కాల్స్ వచ్చినపుడు దూరంగా వెళ్ళి మాట్లాడటం, మొబైల్, సిస్టం, వ్యక్తిగత విషయాలు దాచే చోటు విషయంలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేసుకోవడం వంటి పనులు చేస్తారు. అలా చేస్తున్నారు అంటే.. ఏదో దాస్తున్నారనే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.


తప్పనిసరిగా మాట్లాడటం

ఏదైనా మాట్లాడుతున్నప్పుడు చిన్నచిన్న పదాలలో సమాధానం ఇవ్వడం, సరదాగా మాట్లాడాలనుకున్నప్పుడు ఆసక్తి చూపించకుండా తన పనిలో తాను నిమగ్నమవడం, మీరు ఏదైనా మాట్లాడటానికి ప్రయత్నిస్తే బిజీగా ఉన్నట్టు చెప్పడం, అలాగే ప్రవర్తించడం వంటివి చేస్తారు. అలాంటి వారు కూడా నిజాలు మాట్లాడాల్సి వస్తుందేమోనన్న జీవిత భాగస్వామికి దూరంగా ఉంటున్నారేమోనని అనుమానించాల్సి ఉంటుంది.


ఇలాంటప్పుడు ఏం చేయాలి??

ఇలా చేస్తున్న లైఫ్ పార్ట్నర్ విషయంలో వారు ఎందుకు అబద్దం చెబుతున్నారు అనే విషయాన్ని నిదానంగా ఆలోచించాలి. 


లైఫ్ పార్ట్నర్ తో మాట్లాడేటప్పుడు ఓపికగా ఉండాలి. ఏ విషయాన్ని వెంటనే డిసైడ్ చెయ్యకూడదు. మొత్తం విన్నతరువాతే మీ అభిప్రాయం కానీ, నిర్ణయం కానీ చెప్పాలి. 


సందర్భం వచ్చినపుడు మాత్రమే ఏ విషయాన్ని అయినా అడగాలి. అలా చేస్తే వారు కూడా పెద్దగా ఇబ్బంది పడరు. 


భాగస్వాములు అబద్దం చెబుతున్నారనే విషయం స్పష్టమయిన తరువాత ఎలాంటి మభ్యపెట్టుకునే పనులు చేయకూడదు.


కొన్ని విషయాలను వాస్తవకోణంలో ఆలోచిస్తే తప్ప పరిస్థితి ఏమిటి అనేది అర్థం కాదు. అలాంటి విషయాలను ఎమోషన్స్ పక్కన పెట్టి మరీ ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. 


బంధం విషయంలో ఏ నిర్ణయాలు అయినా తీసుకోవలసి రావచ్చు. అందుకే ఎవరి సంపాదనా మార్గాలు వారికి ఉండాలి.


మీ లైఫ్ పార్ట్నర్ విషయంలో పైవన్నీ కాకపోయినా కొన్ని కనబడినా, వారి ప్రవర్తనలో తేడాలున్నా, వారికి మీకు మధ్య దూరం కనిపిస్తున్నా ఖచ్చితంగా  మీ జీవితం సమస్యలలో ఉన్నట్టే.... జాగ్రత్త మరి.

Read more