పిచ్చి పట్టిందని 36 సంవత్సరాలు బందించి ఉంచారు.. ఇప్పుడు డాక్టర్లు చెప్పింది విని అందరూ షాక్..!

ABN , First Publish Date - 2022-10-11T18:15:35+05:30 IST

మాసిపోయిన దుస్తులతో.. జడలు కట్టిన జుట్టుతో.. గదిలోనే నరకయాతన అనుభవించింది.

పిచ్చి పట్టిందని 36 సంవత్సరాలు బందించి ఉంచారు.. ఇప్పుడు డాక్టర్లు చెప్పింది విని అందరూ షాక్..!ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 36 ఏళ్లుగా గొలుసులతో కట్టేసి ఓ మహిళను బంధించారు. చీకటి గదిలోనే ఉంచేశారు. కేవలం భోజనం పెట్టే సమయంలో మాత్రమే ఆమె చేతికి కట్టేసిన గొలుసులను విప్పేవాళ్లు. మాసిపోయిన దుస్తులతో.. జడలు కట్టిన జుట్టుతో.. గదిలోనే నరకయాతన అనుభవించింది. పాపం అని చేరదీయకుండా కుటుంబ సభ్యులు కూడా ఆమె పట్ల దారుణంగా వ్యవహరించారు. చివరకు ఆమె గురించి తెలిసి ఓ ఎమ్మెల్యే రంగంలోకి దిగడంతో ఓ షాకింగ్ నిజం బయటపడింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


ఆగ్రాలో స్థానికంగా నివసిస్తున్న సప్నా జైన్ అనే మహిళ వయస్సు 53 సంవత్సరాలు. ఆమెకు పిచ్చి పట్టిందని 36 ఏళ్ల క్రితమే ఓ గదిలో బంధీగా చేశారు. కాళ్ళు చేతులు కట్టేసి ఆమె కుటుంబసభ్యులు బంధించారు. కనీసం ఆసుపత్రికి కూడా తీసుకెళ్లకుండా.. వైద్యం చేయించకుండా కుటుంబ సభ్యులు నిర్లక్ష్యం చేశారు. ఫలితంగా నరకయాతన అనుభవించింది. పిచ్చి పిచ్చి అరుపులు, కేకలతో తనను తాను గాయపరుచుకునేది కూడా. అయితే ఆమె గురించి, ఆమె పరిస్థితి గురించి.. 36 ఏళ్లుగా గదిలోనే బంధీగా మారిన వైనం గురించి హత్రాస్ బీజేపీ ఎమ్మెల్యే అంజులా మహూర్‌కు తెలిసింది. సేవా భారతి అనే ఎన్జీవో సంస్థ సహాయంతో ఆ మహిళను రక్షించారు. 


అసలు ఆమెను ఎందుకిలా బంధించారని వారిని ఎన్జీవో సభ్యులు నిలదీసి అడగగా.. సప్నా జైన్‌కు 17 సంవత్సరాల వయసులో అనారోగ్యంతో ఉన్నప్పుడు మతి చలించిందని, అప్పుడు ఆమెను అదుపు చేయడం కష్టమైందని, ఆ కారణం వల్లనే ఆమెను అలా కట్టేసి బంధించాల్సి వచ్చిందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. అదే సమయంలో సప్నా తనని తాను హింసించుకోవడం, ఏడవడం, గట్టిగా అరవడం వంటి పనులు చేయడం వలన ఆమెకు భోజనం పెట్టే సమయంలో తప్ప మరెప్పుడూ కట్లు విప్పేవారం కాదని కూడా వివరించారు. మానసిక రోగి పట్ల కుటుంబ సభ్యుల నిర్లక్ష్యం పట్ల ఎన్జీవో సభ్యులు తీవ్రంగా ఆగ్రహించారు. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు.


చీకటి గదిలో ఒంటరిగా 36 సంవత్సరాల నుండి ఉండటం వల్ల సప్నా మానసిక పరిస్థితి దారుణంగా తయారయ్యింది. శరీరమంతా మురికి పట్టిపోయి, ఎంతో శారీరక బలహీనతతో ఉన్న ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యం చేస్తున్న డాక్టర్లు ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. చికిత్సను కొనసాగిస్తే సప్నా కొన్ని వారాల్లో లేదా కొన్ని నెలల్లో కోలుకుంటుందని, తిరిగి మాములయ్యే అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు తేల్చిచెప్పారు. ఈ విషయం తెలిసిన కొందరు ఆ వైద్యమేదో అప్పుడే చేయించి ఉంటే 36 సంవత్సరాల ఆమె జీవితం అలా చీకటిలో మగ్గిపోయేది కాదు కదా అని వాపోతున్నారు. 36 సంవత్సరాల క్రితమే ఆమె కుటుంబ సభ్యులు ఆమెకు వైద్యం చేయించడానికి ఆగ్రా చుట్టుప్రక్కల ఎంతో మంది డాక్టర్లను కలిసినా ఖర్చు ఎక్కువ అవుతోందని భయపడి వెనక్కు తగ్గారు. చీకటి గదికే ఆమెను పరిమితం చేశారు. ఏది ఏమైనా ఆమెకు సరైన సమయంలో సరైన వైధ్యం అంది ఉంటే ఆమె జీవితం ఇప్పుడు  వేరేలా ఉండేదేమో.

Read more