ED Raids: ఈడీ దాడుల్లో దొరికిన వేల కోట్లను ఏం చేస్తారు..? బంగారం, డబ్బును ఎక్కడ దాస్తారు..?

ABN , First Publish Date - 2022-07-29T22:37:47+05:30 IST

వరుస దాడులతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement directorate) మళ్లీ వార్తల్లో నిలుస్తోంది.

ED Raids: ఈడీ దాడుల్లో దొరికిన వేల కోట్లను ఏం చేస్తారు..? బంగారం, డబ్బును ఎక్కడ దాస్తారు..?

వరుస దాడులతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement directorate) మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. బెంగాల్ మాజీ మంత్రి పార్థ ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ ఇంటి నుంచి వారం రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా నగదు, 5 కిలోల బంగారాన్ని ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈడీ రైడ్ (ED Raids on Arpita) తర్వాత అర్పిత ఇంట్లో దొరికిన నోట్ల కట్టల చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కుప్పలా పడి ఉన్న నోట్ల కట్టలను చూస్తుంటే.. అంత డబ్బును స్వాధీనం చేసుకున్న ఈడీ దానిని ఏం చేస్తుందనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. స్వాధీనం చేసుకున్న డబ్బును సీబీఐ, ఈడీ వంటి సంస్థలు ఏం చేస్తాయనేది ఆసక్తికర ప్రశ్న. 


ఇది కూడా చదవండి..

MP Salary: లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు సస్పెన్షన్‌కు గురయితే.. ఆ సమయంలో వారికి జీతం ఇస్తారా..?


మనీ లాండరింగ్, ఆదాయపు పన్ను ఎగవేత లేదా ఇతర నేర కార్యకలాపాల్లో పాల్గొన్న వారి చర, స్థిరాస్తులను స్వాధీనం చేసుకునే అధికారం, విచారణ నిర్వహించే అధికారం ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను శాఖలకు ఉంటుంది. స్వాధీనం చేసుకున్న డబ్బును తమ కస్టడీలోకి తీసుకుంటాయి. ఆపై కోర్టు ఆదేశం మేరకు.. డబ్బు నిందితులకు తిరిగి ఇచ్చేస్తారు లేదా ప్రభుత్వానికి అప్పగిస్తారు. అయితే ఈ మొత్తం ప్రక్రియ వెనుక చాలా పెద్ద కథ ఉంటుంది. 


* దాడులు చేసి స్వాధీనం చేసుకున్న అధికారులు డబ్బు వివరాలు నమోదు చేసుకుని దానిని సీజ్ చేస్తారు. అనంతరం కోర్టులో సమర్పిస్తారు. 


*అనంతరం ఆ డబ్బును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కేంద్ర ప్రభుత్వ ఖాతాలో జమ చేస్తాయి.


*కొన్నిసార్లు కొంత డబ్బును ఉంచుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు, అంతర్గత ఆర్డర్ ద్వారా కేసు విచారణ పూర్తయ్యే వరకు దర్యాప్తు సంస్థ దానిని తన వద్దే ఉంచుకుంటుంది.


* ఈవీ ఏదైనా ఆస్తిని అటాచ్ చేసినప్పుడు.. ఆ ఆస్తిని కొనడం లేదా విక్రయించడం లేదా ఉపయోగించడం సాధ్యం కాదు. అయితే ఇల్లు, వాణిజ్య ఆస్తిని జోడించినప్పుడు వాటి వినియోగానికి మినహాయింపు కూడా ఉంది.


* PMLA సెక్షన్ కింద, ఈడీ గరిష్టంగా 180 రోజులు అంటే 6 నెలల వరకు ఆస్తిని అటాచ్ చేయవచ్చు. అప్పటికి ఈడీ కోర్టులో ఆస్తి అటాచ్‌మెంట్‌ను చట్టబద్ధం చేయలేకపోతే, 180 రోజుల తర్వాత ఆస్తి విడుదలవుతుంది. 


*ఈడీ చర్యపై ఉన్నత న్యాయస్థానాలలో అప్పీల్ చేయడానికి నిందితుడికి 45 రోజుల సమయం లభిస్తుంది.


*బంగారం, వెండి ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు జప్తు చేసి ప్రభుత్వ గోదాములో నిక్షిప్తం చేస్తారు


* విచారణ తర్వాత కోర్టు జప్తునకు ఆదేశిస్తే, ఆస్తి మొత్తం ప్రభుత్వానికి చెందుతుంది. జప్తును కోర్టులో ఈడీ సమర్థించుకోలేకపోతే, ఆస్తిని సంబంధిత వ్యక్తికి తిరిగి ఇచ్చేస్తారు. కొంత జరిమానా విధించడం ద్వారా ఆస్తిని తిరిగి ఇవ్వడానికి చాలాసార్లు కోర్టు అంగీకరిస్తుంది. 

Updated Date - 2022-07-29T22:37:47+05:30 IST