world suicide prevention day : చచ్చి ఏం సాధిస్తాం? ఒత్తిళ్ళను ఇలా అధిగమిద్దాం..

ABN , First Publish Date - 2022-09-10T21:07:48+05:30 IST

చనిపోయి సమస్యకు పరిష్కారం వెతుక్కోవడం కన్నా బ్రతికి జవాబు చెప్పే ఆలోచన పెరగాలి.

world suicide prevention day : చచ్చి ఏం సాధిస్తాం? ఒత్తిళ్ళను ఇలా అధిగమిద్దాం..

ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట బలవన్మరణం జరుగుతూనే ఉంది. ప్రతి సంవత్సరం ఈ జాబితా పెరుగుతూనే ఉంది. ఆత్మహత్యల నిరోధక దినోత్సవాలు వస్తూనే ఉన్నాయి. పెరుగుతున్న ఆత్మహత్యలను తగ్గించే ప్రయత్నాలు ఎంతవరకూ చేస్తున్నాం. ఇప్పుడిదే ప్రశ్న. 


ఆమె ఎమ్మెస్సీ బీఈడీ చదివింది. ఇటీవల టెట్‌ రాసింది. దీనికి సంబంధించి ఇటీవల విడుదల చేసిన ‘కీ’ ప్రకారం తక్కువ మార్కులు వస్తాయని భావించింది. మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకుంది. పాతపట్నంలో ఓ యువతి విషాదాంతమిది. 


తాజా గణాంకాలు ప్రకారం ఏటా పది లక్షల మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పదివేల మందిలో ఒకరు మాత్రమే "ఎందుకు ఆత్మహత్య చేసుకోవడం" అని ఆలోచిస్తున్నారు. ఈ ధోరణిలో మార్పు రావాల్సి ఉంది. చనిపోయి సమస్యకు పరిష్కారం వెతుక్కోవడం కన్నా బ్రతికి జవాబు చెప్పే ఆలోచన పెరగాలి. చనిపోయేందుకు కొందరికి తీవ్రమైన పరిస్థితులు కారణమైతే, ఇంకొందరు మామూలు కారణాలకే బలవంతంగా చనిపోతున్నారు. కావాలనుకున్న ప్రతీది మన జీవితాల్లోకి రాదు. మనకు కావలసింది లేదని, ఉన్నది నచ్చలేదని, రకరకాల కారణాలతో డిప్రెషన్ కు గురై ఆత్మహత్యను పరిష్కారంగా ఎంచుకుంటున్నారు. పట్టించుకోవాల్సిన వారిని పట్టించుకోకపోవడం, అనవసరమైనవి పట్టించుకోవడం వల్ల సమస్యలు వచ్చి పడతాయి.ఆత్మహత్యలకు కారణాలు.. 


1. అనుబంధాలను కోల్పోవడం: ప్రేమ విఫలం కావడం, కోరుకున్నది దక్కకపోవడం, అత్యాశ, పిరికితనం.


2. కుటుంబంలో కలహాలు: కుటుంబంలోని చిన్న మాట పట్టింపులు, ధ్వేషాలు, తగాదాలు

 

3. వేధింపులు: వరకట్నపు వేధింపులు, కార్యాలయాల్లో వేధింపులు.. 


4. అనారోగ్యం: అనారోగ్య కారణాలతో రోజులు గడపలేక విసుగు, విరక్తి.

 

5. అప్పులు: అధిక వడ్డీలకు రుణాలు, వడ్డీలు కట్టలేక, బాధలకు తట్టుకోలేక బలవన్మరణాలు పరిష్కారంగ ఎంచుకుంటున్నారు. 


ఈ పై కారణాలతో అప్పటి పరిస్థితులకు తలొగ్గి బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ప్రతి ఆత్మహత్య మరణం వారి చుట్టూ ఉన్న వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ విషయంలో తక్కువ మార్పులు వచ్చాయని, తల్లి తిట్టిందని, ప్రేమ విఫలమైందని, చిన్న చిన్న కారణాలతో చనిపోవడం ఇప్పటి యువతరం ఎంచుకుంటున్న మార్గం. పరిస్థితులు..


పోలిక: ఎదుటివారితో పోల్చుకోవడం


తృప్తి లేకపోవడం: ఉన్నదానిలో తృప్తి లేకపోవడం


ఒంటరితనం: అందరూ ఉన్నా ఒంటరితనం అనుభవించడం.. ఇవన్నీ డిప్రెషన్ లోకి తీసుకువెళతాయి.మన వంతుగా ఏం చేద్దాం?

ఎంతో చదువుకుని విజ్ఞావంతులైన వారు కూడా చిన్న కారణాలకే ఆత్మహత్య వైపు ప్రయాణించడం నిజంగా శోచనీయం. ఇందుకు బాధ్యత ఎవరు వహించాలి. సమాజంలో సభ్యుడిగా, యువతగా, తల్లిదండ్రులుగా, స్నేహితుడిగా, సహోద్యోగిగా, ఎంతో జీవించిన అనుభవం ఉన్న వ్యక్తిగా ఆత్మహత్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వారికి మద్దతుగా నిలుద్దాం. వారిలో అవగాహన కల్పిద్దాం. ఆత్మహత్యల్ని ఇలా నివారిద్దాం..

వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే (WSPD)ని 2003లో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO)తో కలిసి ఈ సంస్థను స్థాపించింది. ప్రతి సంవత్సరం సెప్టెంబరు 10వ తేదీన ఈ సమస్యపై దృష్టి సారిస్తుంది., "Creating hope Through Action" అనేది 2021 - 2023 నుండి ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం థీమ్. ఈ థీమ్ ఆత్మహత్యకు ప్రత్యామ్నాయాన్ని వెతుకుతూ మనందరిలో ఆత్మవిశ్వాసం పెంచడంలో తన పాత్రను పోషిస్తుంది. పరిష్కారాలు..


స్నేహితులు: మనసులోని బాధను స్నేహితులతో పంచుకోవడం ఉల్లాసంగా ఉంచుతుంది.


ఆత్మీయులు: ఆత్మీయులు, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడం డిప్రెషన్ ను దూరం చేస్తుంది.


దైవం.. దైవారాధన శక్తిని, శాంతిని ఇస్తుంది.


పుస్తకాలు: పుస్తకాలు చదివే అలవాటు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. మెదడుకు ఆనందాన్ని, చురుకుదనం ఇస్తుంది.


మ్యూజిక్: మంచి సంగీతం మనసును ఆహ్లాద పరుస్తుంది. హుషారును ఇస్తుంది.


వ్యాపకాలు: ప్రకృతిలో సమయాన్ని గడపడం బలాన్ని ఇస్తుంది.


ఆత్మహత్యలు పెరిగిపోతుండటంపై ఆందోళనలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కిరణ్ పేరుతో ఓ టోల్ ఫ్రీ నంబర్ KIRAN' (1800-599-0019 ని ఏర్పాటు చేసింది. ఒత్తిడికి గురవుతున్నవారికి ఆన్లైన్ ద్వారా కౌన్సిలింగ్ ఇస్తూ, సమస్యలకు పరిష్కారాలను చూపిస్తుంది. తద్వారా ఆత్మహత్యలను తగ్గించే ప్రయత్నం చేస్తుంది. దేశ వ్యాప్తంగా అనేక NGO  లు కూడా ఆత్మహత్యల నివారణకు విశేషంగా కృషిచేస్తున్నాయి. 


-శ్రీశాంతి మెహెర్

Read more