ఈ యువతి నవ్వుల మాటున ఎన్ని కష్టాలో.. 15 ఏళ్లకే పెళ్లి.. 21 ఏళ్లకే విడాకులు.. సినిమాల్లో రిస్కీ సీన్లలో హీరోయిన్లకు డూప్‌గా..

ABN , First Publish Date - 2022-09-30T15:34:58+05:30 IST

అందరు ఆడపిల్లలకు జీవితం సాఫీగా జరుగుతుందా?? అందరికీ ఇలాగే జరిగితే గీతా టాండన్ జీవితం ఇలా ఉండేది కాదేమో.....

ఈ యువతి నవ్వుల మాటున ఎన్ని కష్టాలో.. 15 ఏళ్లకే పెళ్లి.. 21 ఏళ్లకే విడాకులు.. సినిమాల్లో రిస్కీ సీన్లలో హీరోయిన్లకు డూప్‌గా..


ఆడపిల్లల జీవితం గురించి ఆలోచన ఎలా ఉంటుంది. తల్లిదండ్రులు చదివిస్తారు, అన్ని అవసరాలు తీరుస్తారు, తరువాత మంచి అబ్బాయిని చూసి పెళ్ళి చేస్తారు. పెళ్ళయ్యాక భర్త, పిల్లలతో ఆడపిల్లలు సంతోషంగా ఉంటారు. ఇదీ సగటు ఆడపిల్లకానీ, సమాజంలో వ్యక్తులు కానీ ఆలోచించే విధానం. కానీ అందరు ఆడపిల్లలకు ఇలాగే జరుగుతుందా?? అందరికీ ఇలాగే జరిగితే గీతా టాండన్ జీవితం ఇలా ఉండేది కాదేమో.....


9ఏళ్ళకే తల్లి చనిపోయింది. 15 ఏళ్ళకే పెళ్ళి జరిగింది. 19 ఏళ్ళ వయసుకే ఇద్దరు పిల్లల తల్లి అయ్యింది. 21 ఏళ్ళకు భర్త నుండి విడిపోయింది. తల్లిదండ్రులు బాధ్యతగా ఉంటే సగటు ఆడపిల్ల డిగ్రీ పట్టా పుచ్చుకునే వయసుకే జీవితంలో ఎన్నో ముఖ్యమైన సంఘటనలు జరిగిపోయాయి గీతా టాండన్ జీవితంలో. ఎవరు ఈ గీత?? చేతుల్లోనుండి జీవితమంతా జారిపోయినా తిరిగి తనను తాను ఎలా నిలబెట్టుకుంది?? 


గీత తండ్రి రాజస్థాన్ లోని కోటా ప్రాంతానికి చెందినవాడు. అతడు అక్కడి నుండి ముంబైకి  షిఫ్ట్ అయిపోయాడు.  1994లో అతని భార్య చనిపోయింది. అప్పటికి గీత వయసు 9 సంవత్సరాలు, ఆ వయసు నుండే ఆమె జీవితం కూడా మొదలయ్యింది. ఆమె తల్లి బతికి ఉన్నంత వరకు అందరి జీవితాలు బాగుండేవి. తల్లి తరఫు బంధువులు గీత కుటుంబ సభ్యులతో బాగుండేవారు. కానీ తల్లి చనిపోయాక ఇద్దరు అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళను పట్టించుకునేవారు లేకుండా పోయారు. 


పని కోసం గీత తండ్రి ఇంటి నుండి వెళ్ళిపోగానే గీతనే తనకు వచ్చినట్టు వండేది. ఆమెకు కాస్త వయసు పెరిగి అనుభవం వచ్చేసరికి ఎంత పని చేస్తే అంత ఆహారం దొరుకుతుందనే విషయం అర్థమయ్యింది. అందుకే బాగా పని చేసేది. ఆమెకు 14 సంవత్సరాలు నిండి 15ఏళ్లు వచ్చేసరికి చుట్టుప్రక్కల ఉన్నవాళ్ళు అందరూ అమ్మాయికి వయసు వచ్చింది పెళ్ళి చేయమని గీత తండ్రికి చెప్పడం మొదలుపెట్టారు.  


పెళ్ళి అనే విషయం గీతకు కానీ, ఆమె తండ్రికి కానీ ఏమాత్రం ఇష్టం లేకపోయినా కూతురికి పెళ్ళి చేసేస్తే ఆమె అయినా భర్త దగ్గర సంతోషంగా ఉంటుందని అనుకున్నాడు. గీత కూడా అలానే అనుకుంది. తండ్రి చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుంది. పెళ్ళయ్యాక భర్త ప్రతిరోజూ కొట్టేవాడు. దాంతో పెళ్ళయ్యాక దొరుకుతుందనుకున్న సంతోషం కలగానే మిగిలిపోయింది. అంతలోనే గర్భవతి కావడం ఆమెలో మళ్ళీ ఆశ పుట్టేలా చేసింది. పిల్లలు పుడితే అందరూ మారిపోతారులే అనుకుంది. కానీ అది కూడా జరగలేదు. 19 సంవత్సరాల వయసుకు ఇద్దరు పిల్లలు అయ్యారు, భర్త ఏమీ సంపాదించడు. తాగడం ఇంటికొచ్చి గీతను చావగొట్టడం ఇదే పని అతనికి. ఈ బాధలు పడలేక చాలా సార్లు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది గీత. కానీ ఆ ప్రయత్నం చెయ్యాలని అనుకున్నప్పుడల్లా పిల్లలు గుర్తొచ్చి ఆగిపోయేది. ‘మా అమ్మ లేనందుకు మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు, ఇప్పుడు నేను చనిపోతే నా పిల్లల పరిస్థితి నాలాగే అవుతుంది’ అని ఆలోచించి ఆత్మహత్య ప్రయత్నాలను విరమించుకుంది.


కొన్ని రోజులు వాటన్నిటిని భరించాక కనీసం పిల్లల ఆకలి తీర్చడానికి అయినా ఏదో ఒక పని చేయాలని, ఇంట్లోనే ఉంటే అది కుదరదని అర్థం చేసుకుని ఇంటి నుండి అడుగు బయట పెట్టింది. ఉద్యోగం కోసం కాళ్ళరిగేలా తిరిగినా ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. చదువు లేకపోతే ఉద్యోగం అనే మాట కలే అనే విషయం తొందరగానే అర్థమయ్యింది గీతకు. కానీ ఏదో ఒకటి చెయ్యాలి అనే కసి అమెను వదల్లేదు. ప్రతి రోజూ దాబా హోటల్లో ఉదయం 250, సాయంత్రం 250 చపాతీలు చేసే పని దొరికింది. ఏదో ఒకటి అనుకుని సంతోషంగా ఆ పని చేసింది. తరువాత స్పా లో కొన్నాళ్ళు పనిచేసింది. ఇలా దొరికిన ప్రతి పనిని చేసుకుంటూ వెళ్ళింది. ఒక రోజు షాపు యజమాని భర్త వదిలేశాక ఇక ఎవరూ అడ్డుచెప్పేవాళ్ళు లేనపుడు ఆడవాళ్ళు ఏ పని చేస్తే ఏంటి అన్నట్టు మాట్లాడాడు. కానీ ఇంటి నుండి అడుగు బయటపెట్టి సులువుగా డబ్బు సంపాదించాలనే మహిళలు తప్పుదారి ఎన్నుకుంటారని, అలా చేయవచ్చు అనే ఊహ కూడా ఆమె మనసులోకి రానివ్వలేదు. ఇలా సాగుతున్న గీత ప్రయాణంలో అనుకోని మలుపులా ఒక అవకాశం వచ్చింది. ఒక షూటింగ్‌కు కొందరు సైడ్ ఆర్టిస్ట్‌లు అవసరమయ్యారు. కేవలం కొద్దిసేపు అలా నిలబడి కనిపించడమే కావడంతో తనకు ఏమీ తెలియకపోయినా చేసేసింది గీత. దానికి ఆమెకు 400 రుపాయల రెమ్యునేషన్ ఇచ్చారు. అప్పుడే అక్కడున్న ఒక వ్యక్తి గీతతో నీ బాడీ పర్సనాలిటీ బాగుంది. అబ్బాయిల లాంటి ఫిజిక్  ఉంది. సినిమాల్లో సంట్స్ చేసే పని ఉంటుంది. దాన్ని ఎంచుకో నీకు పని, డబ్బు రెండూ దొరుకుతాయని సలహా ఇచ్చాడు. స్టంట్స్ చేయడం, ఫంక్షన్లలో డాన్స్ చేయడం, షూటింగ్స్‌లో అలా కనిపించి మాయమయ్యే పాత్రలు చేసే వారందరూ ఒక కమ్యూనిటీగా ఏర్పడ్డారు. గీత వాళ్ళలో జాయిన్ అయిన తరువాత స్టంట్స్ చేయడాన్ని తన కెరీర్‌గా ఎంచుకుంది.


 

సినిమాల్లో హీరోహీరోయిన్లకు కొన్ని పోరాట సన్నివేశాలు పెట్టి ఉంటారు డైరెక్టర్లు. అయితే వాటిని చెయ్యడం కష్టం కాబట్టి అటువంటి సన్నివేశాల్లో హీరోలకు డూప్‌ను పెడతారు. అలాగే హీరోయిన్లకు కూడా డూప్స్‌ను పెడతారు. గీత ఈ ఫీల్డ్‌నే ఎంచుకుంది. ఈ రంగంలో ఆడవాళ్ళు తక్కువ ఉండటంతో అదే తనకు సరైన అవకాశమని గీత భావించింది. స్టంట్స్‌ చేయడానికి కావలసినట్టు శరీరాన్ని ఫిట్‌గా మార్చుకుంది. 


పెద్ద పెద్ద మంటల్లో నుండి పరిగెత్తుకుంటూ రావడం, ఎత్తుల నుండి, బిల్డింగ్‌ల మీద నుండి దూకడం, బైక్‌ల మీద ఫీట్లు చేయడం, ఒక వాహనం నుండి మరొక వాహనంపైకి జంప్ చేయడం, ఇంకా ఫైటింగ్ సీన్లు తదితర వాటిలో హీరోయిన్లకు బదులుగా యాక్ట్ చేయడం ప్రారంభించింది. ఇలా చేస్తున్నప్పుడు చాలాసార్లు శరీరానికి మంటలు అంటుకునేవి. చర్మం కాలిపోయేది అయినా తనకు అందులోనే భవిష్యత్తు కనిపించడంతో అలాగే కొనసాగింది. మూడుసార్లు వెన్నుపూసకు సర్జరీ జరిగినా ఈమె ఆ ఫీల్డ్‌ను వదల్లేదు. ప్రమాదాలతో ఆడుకోవడాన్నే  వృత్తిగా మార్చుకున్న గీతా టాండన్  ప్రస్తుతం హిందీ సినిమాల్లోనూ, సిరీస్‌లలోనూ, సీరియలల్లోనూ పనిచేస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా హిందీలో అక్షయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రసారమయ్యే ఖత్రోంకే ఖిలాడీ అనే ప్రొగ్రామ్ 5వ సీజన్‌లో గీత కంటెస్ట్‌గా పాల్గొంది.


చచ్చిపోదామనుకున్న స్థాయినుండి ప్రమాదాలకు సవాల్ విసురుతూ సాగుతున్న గీతా టాండన్‌కు నేరుగా ఏదైనా సినిమా అవకాశం వస్తే తప్పక చేస్తానని చెప్పింది. ఇక జీవితం అయిపోయిందని బాధపడేవారికి గీత జీవితం గొప్ప ప్రేరణ కలిగిస్తుంది కదా!!.

Read more