యూనిఫాంలో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ల షార్ట్ వీడియో... వైరల్ కావడంతో ఏం జరిగిందంటే...

ABN , First Publish Date - 2022-09-10T17:22:45+05:30 IST

ఇటీవలి కాలంలో సినిమా పాటలతో చిన్నచిన్న వీడియోలు రూపొందించే క్రేజ్...

యూనిఫాంలో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ల షార్ట్ వీడియో... వైరల్ కావడంతో ఏం జరిగిందంటే...

ఇటీవలి కాలంలో సినిమా పాటలతో చిన్నచిన్న వీడియోలు రూపొందించే క్రేజ్ జనాల్లో విపరీతంగా పెరిగిపోయింది. ఇది ఎంతవరకూ వెళ్లిందంటే చివరికి తాము యూనిఫాంలో, అందునా డ్యూటీలో ఉన్నామనే విషయాన్ని కూడా మరిచిపోయి వీడియోలు చేస్తున్నారు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు. తాజాగా యూపీలోని మొరాదాబాద్ డివిజన్‌కు చెందిన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఇటువంటి వీడియో చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఫిర్యాదు అందుకున్న ఏడీజీ వారిని సస్పెండ్ చేశారు. యూనిఫాం ధరించిన పోలీసులు, ఉద్యోగులు, అధికారులు ఎవరైసరే ఫోటోలు లేదా వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయవద్దని బరేలీ జోన్‌కు చెందిన ఏడీజీ రాజ్‌కుమార్ ఆదేశించారు. అలా చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 


మొరాదాబాద్ డివిజన్‌కు చెందిన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు 15 సెకన్ల నిడివి కలిగిన రెండు వీడియోలు రూపొందించి, సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసి సంచలనం సృష్టించారు. ఈ విషయం ఏడీజీ హెడ్‌క్వార్టర్స్‌‌కు తెలియడంతో ఏడీజీ రాజ్‌కుమార్ ఆ మహిళా కానిస్టేబుళ్లిద్దరినీ సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యూనిఫాం ధరించిన ఏ పోలీసు అలాంటి వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయరాదని బరేలీ-మొరాదాబాద్ జోన్‌లోని అన్ని ఎస్‌ఎస్‌పిలకు ఆదేశాలు జారీ చేశారు. యూనిఫాం మాత్రమే కాదు.. ప్రభుత్వ ఆయుధంతో కూడా ఏ పోలీసూ వీడియో తీయకూడదని ఆయా విభాగాల్లోని అన్ని పోలీస్ స్టేషన్లకు సర్క్యులర్ జారీ చేశారు. గతంలో అప్‌లోడ్ చేసిన ఫోటోలు, వీడియోలను తొలగించాలని కోరారు. 

Updated Date - 2022-09-10T17:22:45+05:30 IST