తారలే స్ఫూర్తి! పెళ్లిళ్ల సీజన్ డిమాండ్లు ఇవీ..

ABN , First Publish Date - 2022-08-21T16:26:55+05:30 IST

సినీ తారల అలంకరణ నుంచి స్ఫూర్తి పొందే అలవాటు ముందు నుంచీ ఉన్నదే! అది ఒకప్పడు చీరలు, జడలకే పరిమితమై ఉండేది. కానీ నేటితరం అమ్మాయిలు పెళ్లి నగల ఎంపికలో కూడా వారినే అనుసరిస్తున్నారు. మరీ ముఖ్యంగా తలకు అలంక

తారలే స్ఫూర్తి! పెళ్లిళ్ల సీజన్ డిమాండ్లు ఇవీ..

సినీ తారల అలంకరణ నుంచి స్ఫూర్తి పొందే అలవాటు ముందు నుంచీ ఉన్నదే! అది ఒకప్పడు చీరలు, జడలకే పరిమితమై ఉండేది. కానీ నేటితరం అమ్మాయిలు పెళ్లి నగల ఎంపికలో కూడా వారినే అనుసరిస్తున్నారు. మరీ ముఖ్యంగా తలకు అలంకరించుకునే హెయిర్‌ యాక్సెసరీస్‌ పరంగా, బాలీవుడ్‌ భామల ఫ్యాషన్‌ ట్రెండ్‌కు యువతులు ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం వధువు అలంకరణలో మాథా పట్టీ, మాంగ్‌ టిక్కా మొదలైన శిరోజాభరణాల ట్రెండ్‌ బాగా నడుస్తోంది. వాటిపై ఓ లుక్కేద్దాం... 


ఒకప్పుడు వధువు కోసం కొనే నగల్లో నెక్లెస్‌లు, చేతి గాజులు, ఉంగరాలు, పాపిట బిళ్లలూ... ఇలాంటి నగలకే ఎక్కువ డిమాండ్‌ ఉండేది. కానీ ఇప్పుడు తలకు అలంకరించుకునే రకరకాల ఆభరణాల మీద కూడా మగువలు మనసు పారేసుకుంటున్నారు. కేవలం పాపటి బిళ్లలతో సరిపెట్టుకోకుండా, పోల్కీ పిన్స్‌, వజ్రాలు పొదిగిన హెడ్‌ బ్యాండ్స్‌, మాథా పట్టీలకు పెద్ద పీట వేస్తున్నారు. ఇలాంటి ఆభరణాల ఎంపికలో ఆధునిక పెళ్లి కూతుళ్లు అలియా భట్‌, కత్రినా కైౖఫ్‌, సోనమ్‌ కపూర్‌ మొదలైన బాలీవుడ్‌ తారలను స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. మెడలో ధరించే నెక్లెస్‌, చేతులకు ధరించే గాజులతో పాటు తలకు అలంకరించుకునే ఆభరణాల మీద కూడా ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ప్రస్తుతం కాక్‌టెయిల్‌ పార్టీల్లో కూడా మాథా పట్టీ, పస్సా, టియారా లాంటి హెయిర్‌ యాక్సెసరీస్‌లతో మెరిసిపోతున్న యువతుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. 


పెళ్లిళ్ల సీజన్‌ డిమాండ్లు ఇవే...

తలకు అలంకరించుకునే ఆభరణాల్లో మేలు రాళ్లు పొదిగిన సైడ్‌ క్లిప్పులు, జడావూ బ్యాండ్లకు డిమాండ్‌ పెరుగుతోంది. అలాగే బంగారం, కుందన్‌ తరహా హెయిర్‌ బ్రూచ్‌, టియారా, షీష్‌ ఫూల్‌, బోర్లా లాంటి నగలకూ ఆదరణ అంతకంతకూ ఎక్కువవుతోంది. అలాగే నగల్లోని రాళ్ల ఎంపికలో కూడా కొట్టొచ్చినట్టు కనిపించే ముదురు రంగు రాళ్ల కంటే, న్యూట్రల్‌ కలర్స్‌తో కూడిన మేలుజాతి రాళ్లనే నేటి యువతులు ఎంచుకుంటున్నారు. నగల తయారీ కోసం పచ్చగా మెరిసిపోయే బంగారానికి బదులుగా ఫ్యాషన్‌గా కనిపించే ప్లాటినాన్ని ఇష్టపడుతున్నారు. అటు ఆధునికంగా, ఇటు సంప్రదాయంగా రెండు రకాల వస్త్రధారణకూ సూటయ్యే జ్యువెలరీ కోసం ఆచి తూచి ఎంపిక చేసుకుంటున్నారు. ‘టూ ఇన్‌ వన్‌’ వ్యవహారం...

బంగారం ధర రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. ఆడవారికి బంగారాన్ని మించిన ఇష్టం ఏముంటుంది? కాబట్టి వారిని నిరాశపరచకుండా మార్కెట్లోకి ఒకే నగను రెండు విధాలుగా అలంకరించుకునే ట్రెండ్‌ పుట్టుకొచ్చింది. ఈ ట్రెండ్‌ను తమకు అనుకూలంగా మలుచుకుంటున్న నేటి మోడర్న్‌ పెళ్లికూతుళ్లు, అటు నెక్లెస్‌గా, ఇటు పాపిట బిళ్లగా రెండు విధాలా అలంకరించుకునే ‘టూ ఇన్‌ వన్‌’ జ్యువెలరీ వైపు మొగ్గు చూపుతున్నారు. పోల్కీ, జడావూ, వజ్రాలు, కెంపుల హెయిర్‌ జ్యువెలరీ కోసం రెండు విధాలుగా ఉపయోగించుకునే ట్రెండ్‌ను ఎంచుకుంటున్నారు. వాళ్ల ఇష్టాలకు తగ్గట్టే... తల మీద అలంకరించుకునే మాథాపట్టీనే మెడలోకి చోకర్‌గా, చేతికి బ్రేస్‌లెట్‌గా ధరించే ‘టూ ఇన్‌ వన్‌’ తరహా నగలు ఇప్పుడు రూపొందుతున్నాయి. అలాగే చోకర్లను మాథాపట్టీగా, బ్రేస్‌లెట్‌గా ఉపయోగించుకునే నగలూ తయారవుతున్నాయి. స్టేట్‌మెంట్‌ నెక్లెస్‌లుగా ఉపయోగించుకోగలిగే మాథాపట్టీలు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. బ్రేస్‌లెట్లుగా ధరించగలిగే మాథా పట్టీలు, పోల్కీ చోకర్‌ నెక్లెస్‌లకు డిమాండ్‌ పెరుగుతోంది. 


తారలే స్ఫూర్తి...

సోనమ్‌ కపూర్‌, దీపికా పదుకొనే, కత్రినా కైఫ్‌, అలియా భట్‌... ఇటీవలి కాలంలో పెళ్లి పీటలెక్కిన ఈ బాలీవుడ్‌ భామలు, తమదైన స్టైల్‌లో వినూత్నమైన శిరోజాభరణాలను ఽధరించి కొత్త ట్రెండ్‌కు తెర లేపారు. అలాగే కేవలం పెళ్లి రోజునే కాకుండా, మిగతా వేడుకల్లో ధరించే వీలుండే ఆభరణాల ట్రెండ్‌కు కూడా వీళ్లే శ్రీకారం చుట్టారు. ఈ తారల జ్యువెలరీ ట్రెండ్‌ను స్ఫూర్తిగా తీసుకున్న నేటి పెళ్లి కూతుళ్లు, ఆభరణాలను డిజైన్‌ చేయించుకునే సమయంలో, పెళ్లినాడు ఆ తారలు ధరించిన శిరోజ ఆభరణాలనే రిఫరెన్స్‌గా తీసుకుంటున్నారు. మార్కెట్లోకి కూడా వారి బ్రాండ్‌ మాథాపట్టీలు, మాంగ్‌ టిక్కాలు, హెడ్‌ బ్యాండ్లు వెల్లువెత్తుతున్నాయి. పెళ్లిలో తలకు సింపుల్‌ హెడ్‌బ్యాండ్‌తో మెరిసిపోయిన అలియా భట్‌, మాథాపట్టీతో అదరగొట్టేసిన దీపికా పదుకొనే, మాంగ్‌ టిక్కాలో వెలిగిపోయిన సోనమ్‌ కపూర్‌లు... ఇలాంటి శిరోజాభరణాలతో ఓపెన్‌ హెయిర్‌తో సైతం ఆకర్షణీయంగా కనిపించవచ్చని నిరూపించారు. చాలామంది యువతులు ఇప్పుడు ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. పెళ్లిళ్ల సీజన్‌లో ఈ తరహా డిజైన్లకు గిరాకీ ఎక్కువవుతోంది. అంటే వధువు అలంకరణలో సరికొత్త ఆభరణాలు సందడి చేస్తున్నాయన్నమాట. వధువు తలపై వయ్యారంగా మెరిసిపోతున్న ఈ జ్యువెలరీకి ఆన్‌లైన్‌లో కూడా అధిక డిమాండ్‌ ఏర్పడింది. పెళ్లిరోజంటే ఎవరికైనా ప్రత్యేకమే కదా!  ఎవరి స్టైల్‌ వారిది

పెళ్లి నగల్లో ప్రత్యేకంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. అలాగే సినీ తారలు కూడా! అందుకోసం అపురూపమైన పెళ్లి రోజు నాడు, అప్పటి వరకూ వాడుకలో ఉన్న డిజైన్లను పక్కకు నెట్టి, తమదైన స్టైల్‌లో శిరోజాభరణాలను తయారు చేయించి, సింగారించుకున్నారీ బాలీవుడ్‌ భామలు. ఆ ఆభరణాలు ఇవే!

అలియా భట్‌: ఓపెన్‌ హెయిర్‌ లుక్‌ కోసం హెడ్‌ బ్యాండ్‌ ధరించింది.

సోనమ్‌ కపూర్‌: భారీ జడావూ టీకాతో పాటు, పలు వరుసల ముత్యాల మాథా పట్టీ ధరించింది. 

కత్రినా కైఫ్‌: ఒకటి తల పైన, మరొకటి నుదుటి దగ్గర అతికినట్టుండే డబుల్‌ లేయర్‌ మాథా పట్టీ ధరించింది.

దీపికా పదుకొనే: మువ్వలతో కూడిన సింగిల్‌ లేయర్‌ మాథాపట్టీ ధరించింది.


పస్సా, టియారా, షీష్‌ ఫూల్‌...

సాధారణంగా పెళ్లి ఆభరణాలు అనగానే ఇంతకుముందు నెక్లెస్‌, గాజులు, కమ్మలు వంటివి గుర్తొచ్చేవి. వాటిలోనే సరికొత్త డిజైన్ల కోసం అన్వేషించేవాళ్లు. కానీ ఇప్పుడు మార్కెట్లో సరికొత్త పదాలతో ఆభరణాలు పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా తలపై ధరించే నగలకు కొదవలేదు. ముఖ సౌందర్యంలో ఇవి కూడా భాగమవుతున్నాయి. ‘‘అమ్మాయిలు డ్రెస్సింగ్‌కే కాదు శిరోజాల సౌందర్యానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. తలపై ధరించేందుకు మాథాపట్టీ, పస్సా, టియారా, షీష్‌ ఫూల్‌, మాంగ్‌ టిక్కా, బోర్లా వంటి ఆభరణాలకు డిమాండ్‌ పెరుగుతోంది. ఎవరి అభిరుచికి తగ్గట్టుగా వారు వీటిని ఎంచుకుంటున్నారు’’ అని ఒక జ్యువెలరీ డిజైనర్‌ అంటున్నారు. గత ఏడాది కాలంగా ప్రతీ వెడ్డింగ్‌ సీజన్‌లో ఈ ట్రెండ్‌ ఊపందుకుంటోంది.  


Read more