సాయంత్రం వేళ.. సొసైటీ గేటు మూసివేసేందుకు ప్రయత్నించిన ఇద్దరు సెక్యూరిటీ గార్డులు... ఇంతలో ఊహించని విధంగా...

ABN , First Publish Date - 2022-08-01T17:51:32+05:30 IST

ఢిల్లీకి ఆనుకునివున్న నోయిడాలో ఊహించని...

సాయంత్రం వేళ.. సొసైటీ గేటు మూసివేసేందుకు ప్రయత్నించిన ఇద్దరు సెక్యూరిటీ గార్డులు... ఇంతలో ఊహించని విధంగా...

ఢిల్లీకి ఆనుకునివున్న నోయిడాలో ఊహించని రీతిలో ప్రమాదం జరిగింది. నోయిడాలోని సెక్టార్-78లో గల సిక్కా కార్మిక్ సొసైటీ మెయిన్ స్లైడింగ్ గేట్‌ను మూసి వేస్తున్న సమయంలో ఆ గేటు సెక్యూరిటీ గార్డుపై పడడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స  కోసం బాధితుడిని ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చేర్చించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ప్రమాదానికి బిల్డర్‌ నిర్లక్ష్యమే కారణమని సొసైటీవాసులు ఆరోపిస్తున్నారు. 


సొసైటీ గేటు పునాది సక్రమంగా వేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వారు చెబుతున్నారు. సిక్కా కార్మిక్ సొసైటీ మెయిన్ స్లైడింగ్ గేట్ పడిపోవడంతో గాయపడిన 28 ఏళ్ల సెక్యూరిటీ గార్డు రామ్‌హిత్ యాదవ్ మరణించగా మరో గార్డు సచిన్ కాలికి గాయమైంది. సొసైటీలోని కమర్షియల్‌ ఏరియాలోని గేట్‌ను బిల్డర్‌ మూసి ఉంచారని కొత్వాలి ఇన్‌ఛార్జ్‌ శరద్‌కాంత్‌ శర్మ తెలిపారు. ఈ గేటు వద్ద సెక్యూరిటీ గార్డులు రామ్‌హిత్, సచిన్ ఉన్నారు. ఆదివారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో గేటు తెరిచేందుకు ప్రయత్నిస్తుండగా, అది ఛానల్‌ నుంచి బయటకు వచ్చి రామ్‌హిత్‌పై పడింది. స్థానికులు గాయపడిన సెక్యూరిటీ గార్డును సెక్టార్-35లోని సురభి ఆస్పత్రికి, అక్కడి నుంచి సెక్టార్-30లోని జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లగా, అక్కడి వైద్యులు రామ్‌హిత్‌ను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ గార్డు మరణించాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన మరో సెక్యూరిటీ గార్డు చికిత్స పొందుతున్నాడు.  సొసైటీ నివాసి స్వాతి తెలిపిన వివరాల ప్రకారం గతంలో ఈ గేటు పడిపోయిందని, అప్పుడు ఒక వాహనం పాడైందని తెలిపారు. ఈ విషయమై పలుమార్లు ఫిర్యాదు చేసినా బిల్డర్ పట్టించుకోలేదని తెలిపారు. 

Read more