‘నీకు ఇప్పటికే ఐదుగురు ఆడపిల్లలు... ఈ ఆరో బిడ్డను ఎలా పెంచుతావు?’... అంటూ ఆ వైద్యుడు చేసిన నిర్వాకమిదే...

ABN , First Publish Date - 2022-09-09T15:55:04+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో ఓ ఆశ్చర్యకర ఉదంతం...

‘నీకు ఇప్పటికే ఐదుగురు ఆడపిల్లలు... ఈ ఆరో బిడ్డను ఎలా పెంచుతావు?’... అంటూ ఆ వైద్యుడు చేసిన నిర్వాకమిదే...

ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో ఓ ఆశ్చర్యకర ఉదంతం వెలుగు చూసింది. ఈ ప్రాంతంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి చెందిన వైద్యుడు నిరుపేద దంపతుల నుంచి ప్రసవానికి అయ్యే ఖర్చు తీసుకోనని చెబుతూ, వారి శిశువును ఒక ముస్లిం దంపతులకు అప్పగించాడు. విషయం తెలుసుకున్న స్థానిక హిందూ సంస్థకు చెందిన సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగి, సదరు వైద్యుడి దిష్టిబొమ్మను తగులబెట్టడమే కాకుండా అతడిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన వైద్య ఆరోగ్య శాఖ ఆసుపత్రికి సీల్ వేసి, విచారణకు ఆదేశించింది. వివరాల్లోకి వెళితే నిగోహి పోలీస్ స్టేషన్ పరిధిలోని నవజీవన్ ఆస్పత్రిలో ఓ నిరుపేద మహిళ ఆడపిల్లకు జన్మనిచ్చింది. అయితే పేదరికం కారణంగా ఆమె ఆసుపత్రి బిల్లును చెల్లించలేకపోయింది. అయితే డాక్టర్ అశోక్ రాథోడ్ ఆ నవజాత శిశువును ముస్లిం దంపతులకు అప్పగించాడు. ఈ సందర్భంగా ఆ శిశువు తండ్రి రమాకాంత్‌ మాట్లాడుతూ.. ‘మీకు ఇప్పటికే ఐదుగురు ఆడపిల్లలు ఉన్నారని, ఇప్పుడు పుట్టిన ఈ ఆడబిడ్డను ఎలా పెంచుతావని డాక్టర్‌ ప్రశ్నించారన్నారు. పైగా ఈ డెలివరీ ఖర్చు కూడా నువ్వు ఇవ్వలేవంటూ, తమ బిడ్డను తీసుకెళ్లాడని’ తెలిపారు. విషయం తెలుసుకున్న హిందూ సంస్థ నాయకుడు రాజేష్ అవస్థి తమ కార్యకర్తలతోపాటు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. నిరుపేద హిందూ దంపతులకు పుట్టిన ఆడపిల్లను డాక్టర్ అశోక్ రాథోడ్ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన దంపతులకు భారీ మొత్తానికి అమ్మేశారని హిందూ సంస్థ నాయకుడు రాజేష్ అవస్థి ఆరోపించారు. ఉన్నతాధికారులు ఆ డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో వైద్యారోగ్యశాఖ అధికారులు ఆస్పత్రికి సీల్‌ వేశారు. డాక్టర్‌ పరారయ్యడని పోలీసులు తెలిపారు. 

Read more