Telangana Hindi: రేవంత్ హిందీపై సీతారామన్ సెటైర్లు.. ‘తెలంగాణ హిందీ’ అసలు కథ ఇదీ!

ABN , First Publish Date - 2022-12-12T22:56:11+05:30 IST

భారత్‌లో ఎక్కువమంది మాట్లాడే భాష హిందీ(Hindi). గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అధికారిక భాషలు ఒకటి ఇంగ్లీష్ (English) కాగా రెండవది హిందీయే. ఇంకా చెప్పాలంటే.. కేంద్ర ప్రభుత్వ శాసన విభాగమైన పార్లమెంట్‌లోనూ (Parliament) ఎక్కువగా వినిపించేది ఈ భాషే.

Telangana Hindi: రేవంత్ హిందీపై సీతారామన్ సెటైర్లు.. ‘తెలంగాణ హిందీ’ అసలు కథ ఇదీ!

భారత్‌లో ఎక్కువమంది మాట్లాడే భాష హిందీ(Hindi). గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అధికారిక భాషలు ఒకటి ఇంగ్లీష్ (English) కాగా రెండవది హిందీయే. ఇంకా చెప్పాలంటే.. కేంద్ర ప్రభుత్వ శాసన విభాగమైన పార్లమెంట్‌లోనూ (Parliament) ఎక్కువగా వినిపించేది ఈ భాషే. దేశంలో ఇంతటి ప్రాధాన్యతగల బాషగా హిందీ కొనసాగుతున్నప్పటికీ దక్షిణాది రాష్ట్రాల్లో జనాదరణ పూర్తి భిన్నంగా ఉంటుంది. మాతృబాషలే వ్యవహారిక, అధికారిక బాషలుగా చెలామణీ అవుతున్నాయి. హిందీ మాట్లాడేవారు ఉంటారు కానీ ఆ సంఖ్య చాలా తక్కువ. ఉత్తర, దక్షిణ భారతదేశాలనే భావనకు చిచ్చుపెట్టింది కూడా ఈ బాషే. హిందీ ఎందుకు మాట్లాడరని ఉత్తర భారతీయులు ప్రశ్నిస్తుంటే.. ‘ఎందుకు మాట్లాడాలి.. బలవంతంగా రుద్దొద్దు’ అని దక్షిణ భారతీయులు ఎప్పటి నుంచో వాదులాడుకుంటూనే ఉన్నారు. పార్లమెంట్‌ ఉభయ సభల్లోనూ ఈ ఒరవడి ప్రస్పుటంగా కనిపిస్తుంటుంది. ఉత్తరాది, మధ్య, తూర్పు, పశ్చిమ భారత రాష్ట్రాలకు చెందిన ఎంపీలు హిందీలో మాట్లాడడం సర్వసాధారణం.. కాగా దక్షిణాది రాష్ట్రాల ప్రజాప్రతినిధులు ఎక్కువగా ఇంగ్లీష్‌లో తమ వాణిని వినిపిస్తుంటారు. ఈ రెండు బాషాలూ కాకుండా స్థానిక భాషల్లో ప్రసంగించిన నేతలు లేకపోలేదు. అయితే పార్లమెంట్‌లో ఇతర దక్షిణాది రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ ప్రజానిధులే ఎక్కువగా హిందీలో మాట్లాడుతుంటారు. పలువురు తెలంగాణ ఎంపీలు హిందీలో అదరగొట్టిన సందర్భాలున్నాయి. అనర్గళంగా హిందీ మాట్లాడి ఆశ్చర్యపరిచారు. అయితే తెలంగాణ నుంచి వచ్చిన సభ్యులకు హిందీ సరిగా రాదంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో మంగళవారం చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.

రూపాయి క్షీణతపై రేవంత్ రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. ‘‘ తెలంగాణ నుంచి వచ్చిన సభ్యులకు హిందీ సరిగా రాదు (కమ్ జోర్ హై). నాకు కూడా సరిగా హిందీ రాదు (మేరా హిందీ భీ కమ్ జోర్ హై); సరిగా లేని హిందీ ప్రశ్నకి, సరిగా రాని హిందీలోనే జవాబు చెబుతా’’ అని అన్నారు. దీనికి రేవంత్ రెడ్డి ప్రతిస్పందిస్తూ.. తాను శూద్రుడినని, స్వచ్ఛమైన హిందీ మాట్లాడేది బ్రాహ్మణవాదులేనని సీతారామన్‌పై వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు. హిందీ చుట్టూ లోక్‌సభలో చోటుచేసుకున్న ఈ పరిణామం ‘తెలంగాణ నేతల హిందీ నైపుణ్యాల’పై చర్చకు దారితీసింది. నిజానికి ఇతర దక్షిణాది నేతలతో పోల్చితే తెలంగాణ ప్రజాప్రతినిధులకు హిందీపై కాస్త పట్టు ఎక్కువనే చెప్పాలి. గతంలో పలువురి నేతల హిందీ ప్రసంగాలే ఇందుకు నిదర్శనం. తెలంగాణ మహిళైన ప్రస్తుత ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పార్లమెంట్‌లో పలు చర్చల్లో హిందీలో అనర్గళంగా మాట్లాడి అందరి ప్రశంసలు పొందారు. చట్టసభ్యులందరినీ ఆకట్టుకున్నారు. కవితలా హిందీ మాట్లాడినవారు చాలామందే ఉన్నారు. అయినప్పటికీ తెలంగాణ సభ్యులకు హిందీ సరిగా రాదంటూ సీతారామన్ వ్యాఖ్యానించడం తెలంగాణ నేతల బాషా నైపుణ్యాలను అవమానించడమే అవుతుందనే వాదనలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు నేరుగా సమాధానం ఇవ్వకుండా భాషపై మాట్లాడారని వేలెత్తిచూపుతున్నారు. తెలంగాణే కాదు.. తెలుగు నేతల హిందీని కూడా అవహేళన చేయడమే అవుతుందని విమర్శిస్తున్నారు.

మరోవైపు సీతారామన్‌కు మద్దతుగా నిలుస్తున్నవారు కూడా ఉన్నారు. తెలంగాణ హిందీలో ఉర్దూ కలుస్తుంది కాబట్టి వారికి అసలైన హిందీ రాదనేది ఆమె అంతరార్థం అయ్యుండొచ్చనే సమర్థిస్తున్నారు. దీనిని ఒక వివాదంగా చూడాల్సిన అవసరంలేదని చెబుతున్నారు. ఏది ఏమైనా లోక్‌సభలో రేవంత్ రెడ్డి - నిర్మలా సీతారామన్ మధ్య చోటుచేసుకున్న పరిణామం ‘తెలంగాణ హిందీ’పై వివాదానికి దారితీసేలా కనిపిస్తోంది.

Updated Date - 2022-12-12T22:56:48+05:30 IST