‘నీలో సందేహాలు తీరాలంటే ఏడాది తరువాత రా’ అన్నాడు బుద్ధుడు... తరువాత జరిగిన అద్భుతం ఇదే!

ABN , First Publish Date - 2022-10-08T16:33:56+05:30 IST

బుద్ధుడు ప్రతిరోజూ తన శిష్యులకు మంచి విషయాలను బోధించేవాడు.

‘నీలో సందేహాలు తీరాలంటే ఏడాది తరువాత రా’ అన్నాడు బుద్ధుడు... తరువాత జరిగిన అద్భుతం ఇదే!

బుద్ధుడు ప్రతిరోజూ తన శిష్యులకు మంచి విషయాలను బోధించేవాడు. బుద్ధుని ప్రసంగాలను వినడానికి శిష్యులతో పాటు పెద్ద సంఖ్యలో ఇతరులు కూడా వచ్చేవారు. ఒకసారి బుద్ధుడు ఉపన్యసిస్తుండగా ఒక వ్యక్తి అతని దగ్గరకు వచ్చి ‘తథాగతా... నా మనసులో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, దయచేసి వాటికి సమాధానం ఇవ్వండి. తద్వారా నా మనస్సు ప్రశాంతత చెందుతుందని’ అన్నాడు. దీనికి బుద్ధుడు సమాధానమిస్తూ... ‘మీ ప్రశ్నలకు నేను ఖచ్చితంగా సమాధానం ఇస్తాను. 


అయితే మీరు ఒక సంవత్సరం పాటు మౌనం పాటించాలని’ అన్నాడు. దీనికి వెంటనే ఆ వ్యక్తి ‘ఒక సంవత్సరం తర్వాత మీరు ఖచ్చితంగా నా ప్రశ్నలకు సమాధానం ఇస్తారు కాదా?’ అని అడిగాడు. వెంటనే బుద్ధుడు మాట్లాడుతూ ‘ఒక సంవత్సరం తర్వాత మీకున్న అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి’ అని అన్నాడు. బుద్ధుని మాటలు విన్న ఆ వ్యక్తి మౌనవ్రతం పాటించాలని నిర్ణయించుకున్నాడు. ఫలితంగా అతని మనసు ఏకాగ్రత చెందడం ప్రారంభించింది. ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. దీంతో అతని మనసు కూడా ప్రశాంతంగా మారింది. మెల్లగా అతనికున్న ప్రశ్నలన్నీ సమసిపోసాగాయి. ఈ విధంగా ఒక సంవత్సరం గడిచిపోయింది. సమయం ముగిసిన తరువాత ఆ వ్యక్తి బుద్ధుని దగ్గరకు వచ్చాడు. ఆ వ్యక్తితో బుద్ధుడు ఇలా అన్నాడు ‘ఇప్పుడు మీరు మీ ప్రశ్నలను అడిగి, మీ ఉత్సుకతను చల్లార్చుకోండి’. వెంటనే అతను మాట్లాడుతూ ‘ఒక సంవత్సరం క్రితం నా మనసులో చాలా ప్రశ్నలు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ ప్రశ్నలన్నీ సమసిసోయాయని అన్నాడు. వెంటనే బుద్ధుడు మాట్లాడుతూ కలత చెందిన మనసులో అనేక ప్రశ్నలు తలెత్తుతూనే ఉంటాయని, దీనివల్ల ప్రశ్నలకు సమాధానాలు దొరకవని అన్నాడు. కొంత కాలం పాటు మౌనం పాటించడం ద్వారా, మన భ్రమలు తొలగిపోతాయని, అన్ని ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయని తెలిపాడు. ఎప్పుడైతే మనస్సు ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు అన్ని ప్రశ్నలూ సమసిపోతాయని బుద్ధుడు బోధించాడు. 

Updated Date - 2022-10-08T16:33:56+05:30 IST