నేడు రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్: ద్రౌపది ముర్ము స్వస్థలంలో మిన్నంటుతున్న సంబరాలు

ABN , First Publish Date - 2022-07-21T13:13:28+05:30 IST

నేడు భారతదేశం 15వ రాష్ట్రపతిని ఎన్నుకోనుంది.

నేడు రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్: ద్రౌపది ముర్ము స్వస్థలంలో మిన్నంటుతున్న సంబరాలు

నేడు భారతదేశం 15వ రాష్ట్రపతిని ఎన్నుకోనుంది. ఈ నేపధ్యంలో ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము స్వస్థలమైన ఒడిశాలోని రాయంగ్‌పూర్‌లో వేడుకలు ప్రారంభమయ్యాయి. యశ్వంత్ సిన్హాపై పోటీలో ముర్ము విజయం సాధించాలని ఆమె స్వస్థలానికి చెందిన వారంతా కోరుకుంటున్నారు. ఫలితాలు వెలువడిన తర్వాత స్వీట్లు పంపిణీ చేసేందుకు రాయంగ్‌పూర్‌  గ్రామ ప్రజలు ఏర్పాట్లు చేశారు. విజయోత్సవ ఊరేగింపు, గిరిజన నృత్యాలకు సన్నాహాలు చేశారు.


1. ఉదయం 11 గంటలకు పార్లమెంటులో కౌంటింగ్ ప్రారంభంకానుంది. కౌంటింగ్ ముగిసిన వెంటనే ఫలితాలు వెల్లడి కానున్నాయి. జూలై 18న రాష్ట్రపతి ఎన్నికలకు ఓటింగ్ జరిగింది.


2. పార్లమెంట్ హౌస్‌లో ఓటు వేయడానికి ఎన్నికల సంఘం 727 మంది ఎంపీలకు, తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు అనుమతినిచ్చింది. మొత్తం 736 మంది ఓటర్లలో 728 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 98.91 శాతం పోలింగ్‌ నమోదైంది.


3. ఫలితాలు వెలువడిన వెంటనే ముర్ము స్వస్థలంలో బీజేపీ నేతలు వేడుకలు చేసేందుకు సిద్ధం అయ్యారు. "తాము 20 వేల లడ్డూలను సిద్ధం చేస్తున్నాం. ఈ ప్రాంతంలో రాష్ట్రపతి అభ్యర్థి ముర్ముకు అభినందనలు తెలియజేస్తూ 100 బ్యానర్లు ఏర్పాటు చేశాం" అని స్థానిక బిజెపి నేత తపన్ మహంత తెలిపారు.


4. ముర్ము చదువుకున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బిశ్వేశ్వర్ మొహంతి ఆమెను గుర్తుచేసుకుంటూ.. ముర్ము తెలివైన విద్యార్థి అని, ప్రజలకు సేవ చేయాలని భావించేవారని అన్నారు. 1968 నుండి 1970 మధ్యకాలంలో ద్రౌపది ముర్ము పాఠశాలలో చదువుతున్నసమయంలో తాను ప్రధానోపాధ్యాయునిగా పనిచేశానని తెలిపారు. ద్రౌపది ముర్ము ఈ స్థాయికి ఎదగడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. ముర్ము తెలివైన విద్యార్థిని అని, ఒకసారి విద్యార్థులను... భవిష్యత్తులో ఏమవుతారని ప్రశ్నించగా, విద్యార్థులంతా వివిధ వృత్తుల గురించి ప్రస్తావించారని, ముర్ముని ఇదే ప్రశ్న అడిగినప్పుడు తాను ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నానని చెప్పారన్నారు.


5. ద్రౌపది ముర్ము అత్త సరస్వతి ముర్ము మాట్లాడుతూ ద్రౌపది ముర్ము ఒక మహిళగా ఏమి సాధించవచ్చో నిరూపించారన్నారు "ముర్ము తన జీవితాంతం చాలా కష్టపడ్డారు. ఇప్పుడు ఆ పోరాటాలకు అద్భుత ఫలితం అందుకుంటున్నారు. ముర్ము నిరాడంబరమైన స్వభావం కలిగి ఉంటారు. మా కాలంలో, అమ్మాయిలను చదువుకుని ఏం చేస్తావని అడిగేవారు. అలాంటివారికి ద్రౌపది ముర్ము సరైన సమాధానం చెప్పారని అన్నారు. 


6. ముర్ము గతంలో జార్ఖండ్ గవర్నర్‌గా ఒడిశాలో మంత్రిగా పనిచేశారు. ముర్ము ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే ఆమె భారతదేశానికి మొదటి గిరిజన రాష్ట్రపతి కావడంతో పాటు దేశానికి రెండవ మహిళా రాష్ట్రపతి అయిన ఘనత సాధిస్తారు.


7. ఇదిలావుండగా అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా యశ్వంత్ సిన్హా పనిచేశారు. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు, ఆయనకు కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్ మద్దతు పలికాయి.


8. నేడు జరిగే ఓట్ల లెక్కింపు అనంతరం బీజేపీ మెగా 'అభినందన యాత్ర'కు ప్రణాళిక సిద్ధం చేసింది. ద్రౌపది ముర్ము ఎన్నికైతే నిర్వహించే మార్చ్‌కు బిజెపి చీఫ్ జెపి నడ్డా నాయకత్వం వహిస్తారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ముర్ము విజయం సాధిస్తే సంబరాలు చేసుకునేందుకు పంత్ మార్గ్‌లోని ఢిల్లీ బీజేపీ కార్యాలయం నుంచి రోడ్‌షో ప్రారంభం కానుందని పార్టీ నేతలు వెల్లడించారు. 

Updated Date - 2022-07-21T13:13:28+05:30 IST