కళ్ల ముందే తండ్రిని కొట్టిన పోలీసు అధికారి.. 20 ఏళ్ల తర్వాత అనుకున్నది సాధించిన కొడుకు..!

ABN , First Publish Date - 2022-11-21T12:53:17+05:30 IST

తండ్రిని పోలీసు కొట్టిన దెబ్బలకు సమాధానంగా అతనిప్పుడు ...

కళ్ల ముందే తండ్రిని కొట్టిన పోలీసు అధికారి.. 20 ఏళ్ల తర్వాత అనుకున్నది సాధించిన కొడుకు..!

ఢిల్లీ నగరంలో చాందినీ చౌక్ ప్రాంతం. అక్కడున్న తండ్రికొడుకుల మధ్య వాతావరణం చాలా గంభీరంగానూ, నిశ్శబ్దంగానూ ఉంది. 'మనమేమీ తప్పు చేయడం లేదుగా ఎందుకు వాళ్ళు అలా కొడతారు..' అని తండ్రిని ప్రశ్నిద్దామనుకున్నాడు ఆ అబ్బాయి. కానీ కొడుకు మనసును అర్థం చేసుకున్నాడేమో.. ఆ తండ్రి కొడుకుతో ‘వాళ్ళు పోలీసులు.. ఏ నిర్ణయమైనా వారిది కాదు, వారికి పైన కోర్టులు, ఆ కోర్టులలో జడ్జిలు ఉంటారు. వాళ్ళు చెప్పే తీర్పు ప్రకారమే పోలీసులు పని చేయాలి. వెళదాం పదా..’ అంటూ తను అమ్ముతున్న వస్తువులను తీసుకుని కొడుకుతో పాటు ఇంటికి చేరుకున్నాడా కష్టజీవి. తండ్రి మాటలు ఆ అబ్బాయి మనసులో గాఢంగా నిలిచిపోయాయి. తండ్రిని పోలీసు కొట్టిన దెబ్బలకు సమాధానంగా అతనిప్పుడు తీర్పు చెప్పే న్యాయమూర్తి స్థానానికి ఎంపికయ్యాడు. కేవలం సినిమాలలో మాత్రమే తండ్రి అవమానానికి ప్రతీకారంగా కష్టపడి ఉన్నత పదవులు పొందే హీరోలు కనబడతారు. కానీ నిజ జీవితంలో అది నిజంగా జరిగింది. తండ్రికి జరిగిన అవమానాన్ని గుర్తుంచుకుని కష్టపడి చదివి.. న్యాయమూర్తిగా ఎంపికయ్యాడు. ఆయనే కమలేష్.. ఇంతకూ ఎవరీ కమలేష్..? ఆయన కథ ఏంటి..?

వలస వెళ్ళిన కుటుంబం..

కమలేష్ తండ్రిది పెద్ద కుటుంబం.. పది మంది తోడబుట్టిన వాళ్లు.. వారి కుటుంబాలు.. అందరూ కలిసే ఉండేవారు. పెద్ద కుటుంబం కావడంతో పూట గడవడమే కష్టం అయ్యేది. అందుకే తన భార్యా పిల్లలను తీసుకుని దేశరాజధాని ఢిల్లీకి వలస వెళ్ళాడు. అక్కడ ఎర్రకోట వెనుక ఉన్న మురికివాడలో కుటుంబంతో కలసి నివసిస్తూ ఉండేవాడు. ఆ తరువాత ఓసారి పోలీసులు వచ్చి ఆ ప్రాంతంలో నివసిస్తున్న అందరినీ ఖాళీ చేయించారు. దాంతో వారి మకాం మారింది, కమలేష్ తండ్రి ఇల్లు గడవడం కోసం రిక్షా లాగడం, చోలే బతూరె అమ్మడం, కూలి పని చేయడం ఇలా అన్నిరకాల పనులూ చేసేవాడు.

ధృడ నిర్ణయం..

ఒకసారి చాందినీ చౌక్ లో అతడు చేతి వృత్తుల వస్తువులు అమ్ముతుండగా వాటిని తొలగించమని ఒక పోలీసు చెప్పాడు. దాని గురించి కమలేష్ తండ్రికి, పోలీసుకు మధ్య కాసింత వాదన కూడా జరిగింది. చివరికి ఆ పోలీసు కమలేష్ తండ్రి మీద చెయ్యి చేసుకున్నాడు. అప్పుడు కమలేష్ తండ్రి ప్రక్కనే ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. ఆ తరువాత తండ్రి మాటల్లో పోలీసు కంటే న్యాయమూర్తులు శక్తిమంతమైన వారని గ్రహంచాడు. తండ్రి మాటలనే మనసులో ఉంచుకుని కష్టపడి చదివాడు. 2017 సంవత్సరంలో మొదలైన ఇతని ప్రయత్నం పలుమార్లు విఫలం అయినా ఎక్కడా వెనకడుగు వేయలేదు. చివరకు 2022 సంవత్సరంలో బీహార్ జ్యుడీషియల్ రిజల్ట్ లో 64వ ర్యాంకు సాధించి న్యాయమూర్తి హోదాకు ఎంపికయ్యాడు. ఆనాడు తండ్రికి జరిగిన అవమానం.. ఆ సమయంలో తన తండ్రి చెప్పిన మాటలే తన విజయానికి కారణమని కమలేష్ చెబుతున్నారు.

Updated Date - 2022-11-21T12:56:36+05:30 IST