PETA: మహిళలూ.. మగాళ్లకు పడకసుఖం ఇవ్వకండి, ఎండగట్టండి..

ABN , First Publish Date - 2022-09-25T22:32:13+05:30 IST

పర్యావరణ పరిరక్షణ, జంతహక్కుల కోసం పోరాడే ప్రముఖ సంస్థ పెటా(PETA) తాజాగా ఎవ్వరూ ఊహించలేని ప్రకటన చేసింది. మాంసాహారం(రెడ్ మీట్) అధికంగా తినే పురుషులను శృంగారానికి దూరం చేసి వారిలో మార్పు తీసుకురావాలని మహిళలకు సూచించింది.

PETA: మహిళలూ.. మగాళ్లకు పడకసుఖం ఇవ్వకండి, ఎండగట్టండి..

ఇంటర్నెట్ డెస్క్: పర్యావరణ పరిరక్షణ, జంతువుల హక్కుల కోసం పోరాడే ప్రముఖ సంస్థ పెటా(PETA) తాజాగా ఎవ్వరూ ఊహించలేని ప్రకటన చేసింది. మాంసాహారం(రెడ్ మీట్) అధికంగా తినే పురుషులను శృంగారానికి దూరం చేసి వారిలో మార్పు తీసుకురావాలని మహిళలకు సూచించింది. జర్మనీ(Germany) మహిళలను ఉద్దేశించి ఈ ప్రకటన చేసింది. పర్యావరణంపై ఇటీవల జరిగిన ఓ అధ్యయనం ప్రకారం.. మాంసాహారం తినే పురుషులు.. మహిళల కంటే అధికంగా కర్బన ఉద్గారాల విడుదలకు కారణమవుతున్నారట. ఈ నేపథ్యంలోనే పెటా (పీలుల్స్ ఫర్ ఎథికల్ ట్రీట్‌మెంట్ టూవర్డ్స్ యానిమల్స్) ఇలాంటి స్టేట్‌మెంట్ విడుదల చేసింది. మాంసాహారం అధికంగా తినే మగాళ్లను పడకసుఖానికి దూరం చేసి ప్రపంచాన్ని కాపాడాలని సూచించింది. పూరుషాధిక్యం ప్రదర్శించే మగాళ్ల విషయంలోనూ ఇదే పద్ధతి(Sex Strike) అవలంభిస్తే.. వారికీ బుద్ధి వస్తుందని చెప్పుకొచ్చింది.


మాంసాహారంతో పర్యావరణానికి కలిగే నష్టంపై జరిగిన అధ్యయనం ఒకటి PLOS ONE జర్నల్‌లో ఇటీవల ప్రచురితమైంది. ఈ అధ్యయనాన్ని పెటా తన ప్రకటనలో ఊటంకించింది. ఈ అధ్యయనం ప్రకారం..  మాంసాహారం అధికంగా తినే పురుషులు.. మహిళల కంటే 41 శాతం ఎక్కువగా గ్రీన్‌హౌస్ వాయువుల విడుదలకు కారణమవుతారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ పురుషులపై ఓ సెటైర్ వేసింది. ‘‘ఇలాంటి వాళ్లను మనం చూస్తూనే ఉంటాం. చేతిలో బీర్ బాటిళ్లతో తమ శరీర దారుఢ్యాన్ని ప్రదర్శిస్తుంటారు. బార్బిక్యూల పేరుతో మాంసాహారం వండుతూ స్టైల్ కొడుతుంటారు. తాము మగాళ్లం, మొనగాళ్లం అన్నట్టు ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి వాళ్లు సాటి జీవాలకే కాకుండా.. పర్యావరణానికి కూడా హాని చేస్తుంటారు.’’ అని వ్యాఖ్యానించింది. కాగా.. పెటా ప్రకటనపై ఆ సంస్థ ప్రతినిధి డా. కేరిస్ బెన్నెట్ స్పందించారు. పర్యావరణాన్ని పరిరక్షించాలన్న తమ సందేశాన్ని ప్రజల్లోకి వేగంగా తీసుకెళ్లేందుకు ఇలాంటి ఐడియా వేశామని చెప్పారు.  అయితే.. పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న మాంసాహారంపై ట్యాక్స్ విధించాలని కూడా పెటా ఎప్పటినుంచో కోరుతోంది.


మాంసాహారానికి, పర్యావరణానికి సంబంధం ఇదే.. 

మంసాహారం(రెడ్ మీట్ - Red Meat) కోసం మేకలు, గొర్రెలు, ఇతర పశువులను పెంచుతారన్న విషయం తెలిసిందే. అయితే.. ఈ జంతువులు ఆహారాన్ని జీర్ణం చేసుకునేటప్పుడు త్రేన్పుల రూపంలో మిథేన్ అనే ప్రమాదకర గ్రీన్‌హౌస్ వాయువును(Greenhouse gases) విడుదల చేస్తాయి. అంతేకాకుండా.. పశువుల వ్యర్థాల నుంచి కూడా మీథేన్ విడుదల అవుతుంది. ఇక పశుగ్రాసం పెంచేందుకు అనేక రకాల రసాయనాల వినియోగం కూడా కాలుష్యానికి దారితీస్తుంది. అంతేకాకుండా.. పశువుల పెంపకం కోసం ఇతర వనరుల వినియోగం కూడా పెరిగి కర్బన ఉద్గారాల విడుదల అధికమవుతుంది. ఫలితంగా.. పర్యావరణానికి హాని జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే.. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు మాంసాహారం పూర్తిగా మానేయాలా అంటే.. కానేకాదంటారు నిపుణులు. ఎవరి పరిధిలో వారు నాన్‌వెజ్ ఫుడ్, ఇతర డైరీ ఉత్పత్తులను నిజాయితీతో వీలైనంత తక్కువగా తింటే సరిపోతుందని అంటున్నారు. 

Updated Date - 2022-09-25T22:32:13+05:30 IST