-
-
Home » Prathyekam » parents are working for rs 250 on the daughter for whom the administration is building the road dnm spl-MRGS-Prathyekam
-
క్రీడాకారిణి పేరిట రోడ్డు నిర్మిస్తున్న ప్రభుత్వం... ఆ పనుల్లో కూలీలుగా అదే క్రీడాకారిణి తల్లిదండ్రులు...
ABN , First Publish Date - 2022-10-11T17:23:18+05:30 IST
ఫిఫా అండర్-17 మహిళల ప్రపంచకప్‌లో భారత జట్టుకు...

ఫిఫా అండర్-17 మహిళల ప్రపంచకప్‌లో భారత జట్టుకు నాయకత్వం వహించిన జార్ఖండ్ యువతి అష్టమ్ ఒరాన్ తల్లిదండ్రులు తమ కుమార్తె పేరిట నిర్మిస్తున్న రోడ్డు పనుల్లో కూలీలుగా మారారు. రోజు కూలీ కింద వారు రూ.250 చొప్పున తీసుకున్నారు. జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లా బనారిగోర టోలి గ్రామంలోని అష్టమ్ ఇంటి వరకు ఈ రహదారిని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా గుమ్లా డిప్యూటీ కమిషనర్ సుశాంత్ గౌరవ్ మాట్లాడుతూ అష్టమ్ తల్లిదండ్రులు ఆ రోడ్డు నిర్మాణంలో కూలి పనులు చేస్తున్న సంగతి తనకు తెలియదన్నారు.
అష్టమ్ తండ్రి హీరా ఓరాన్ మాట్లాడుతూ కూలి పని చేయకపోతే కుటుంబాన్ని ఎలా పోషించగలనని ప్రశ్నించారు. అష్టమ్ తల్లి తారాదేవి మాట్లాడుతూ తమ కుమార్తె భారత్‌కు కెప్టెన్‌గా మారిందని అన్నారు. మొదటి నుండి పోరాటపటిమ గల తమ కుమార్తె ఏదైనా సాధిస్తుందని అన్నారు. తమ కూతురిని ఎన్నో కష్టాలు పడి పెంచాం అని అన్నారు. కాగా అష్టమ్ ఇల్లు మట్టితో నిర్మితమైవుంది. వీరి కుటుంబంలో అష్టమ్ అక్క సుమీనా ఓరాన్ జాతీయ స్థాయి డిస్కస్ త్రో అథ్లెట్. చెల్లెలు అల్కా ఇంద్వార్ అండర్ 16 ఫుట్‌బాల్ జట్టు క్రీడాకారిణి. తమ్ముడు చదువుకుంటున్నాడు. వీరి తండ్రి వృత్తి రీత్యా రైతు. వీరి కుటుంబానికి ఎకరం భూమి ఉంది. గుమ్లా డీసీ సుశాంత్ గౌరవ్ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం అష్టమ్ సాధించిన విజయానికి సూచికగా వారి ఇంటివరకూ రోడ్డు నిర్మాణం చేపట్టిందన్నారు. రానున్న రోజుల్లో ఇక్కఢ ఒక స్టేడియం కూడా నిర్మించనున్నామని తెలిపారు.