ఆన్‌లైన్‌లో డ్రోన్ కెమేరాకు ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి.. పార్సిల్ వచ్చాక ఓపెన్ చూసి షాక్.. లోపల ఏమున్నాయంటే..

ABN , First Publish Date - 2022-09-28T22:56:57+05:30 IST

ఈ-కామర్స్ సైట్లు అందుబాటులోకి వచ్చాక ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ షాపింగ్ విపరీతంగా పెరిగిపోయింది.

ఆన్‌లైన్‌లో డ్రోన్ కెమేరాకు ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి.. పార్సిల్ వచ్చాక ఓపెన్ చూసి షాక్.. లోపల ఏమున్నాయంటే..

ఈ-కామర్స్ సైట్లు అందుబాటులోకి వచ్చాక ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ షాపింగ్ విపరీతంగా పెరిగిపోయింది. ఎలాంటి మోసం లేకుండా నాణ్యమైన వస్తువులు డిస్కౌంట్ ధరలతో ఇంటి ముందుకే వస్తుండడంతో చాలా మంది ఆన్‌లైన్ షాపింగ్‌కే మొగ్గు చూపుతున్నారు. అయితే అప్పుడప్పుడు వినియోగాదారులు మోసపోతున్న సంఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి. తాజాగా డ్రోన్ కెమేరా (drone camera) కోసం అర్డర్ చేసిన వ్యక్తికి పార్సిల్‌లో బంగాళాదుంపలు (potatoes) వచ్చాయి. దీంతో ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 


దసరా సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్లన్నీ ఆఫర్‌లను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో బీహార్ (Bihar)లోని నలందకు చెందిన చైతన్య కుమార్ అనే వ్యక్తి మీషో (Meesho) వెబ్‌సైట్ ద్వారా డ్రోన్ కెమెరా కోసం ఆర్డర్ పెట్టాడు. రూ. 84,999 విలువ గల డ్రోన్ కెమెరాను రూ. 10,212కే అందిస్తున్నట్టు సదరు వెబ్‌సైట్ ప్రకటించింది. దీంతో అతను వెంటనే డ్రోన్ కెమెరాను ఆర్డర్ పెట్టాడు. కొన్ని రోజుల తర్వాత వచ్చిన పార్సిల్‌ను చూసి ఆ వ్యక్తి  షాకయ్యాడు. పార్సిల్ లోపల కేజీ బంగాళా దుంపలు ఉండటాన్ని చూసి నోరెళ్లబెట్టాడు.


తనకు జరిగిన మోసం గురించి చైతన్య కుమార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కంపెనీకి మెయిల్ చేశాడు. అలాగే స్థానిక పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్వాపరాలు పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

Updated Date - 2022-09-28T22:56:57+05:30 IST