MBA Graduate Quits Job: చదివింది ఎంబీఏ.. చేసేది జామతోట సాగు.. ఈయన ఏడాదికి ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-09-28T15:40:24+05:30 IST

ఉద్యోగం వదిలేసి మరీ జామ పండ్ల సాగు చేపట్టి కోటి రూపాయల దాకా సంపాదించారు. అదేంటీ.. జామ పండ్ల సాగుతో అంత సంపాదన ఎలా సాధ్యం.. అని ఆశ్చర్యపోతున్నారా..?

MBA Graduate Quits Job: చదివింది ఎంబీఏ.. చేసేది జామతోట సాగు.. ఈయన ఏడాదికి ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే..ఒకప్పుడు వ్యవసాయం, పంటలు, పశువుల పెంపకం వంటి వాటిని మొరటు పనులుగా, నిరక్షరాస్యులు మాత్రమే చేసే వృత్తులుగా పరిగణించేవారు. ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. ఎంబీఏలు, ఎంటెక్‌లు చదివిన గ్రాడ్యయేట్లు కూడా ఇప్పుడు పొలాల్లోకి దిగుతున్నారు. కర్షకుడిగా మారి హలం పడుతున్నారు. ఉద్యోగాలు కూడా వదిలేసి మరీ వ్యవసాయం చేస్తున్నారు. లక్షల జీతం వస్తున్నా వదిలేసి.. అమెరికా వంటి అగ్రదేశాల్లో ఉద్యోగాలకు కూడా గుడ్ బై చెప్పి మరీ సొంతూరికి వచ్చి సాగుపనులు చేస్తున్నారు. విజేతలుగా నిలుస్తున్నారు. అలాంటి వాళ్లల్లో ఒకరే ఉత్తరాఖండ్ కు చెందిన ఎం.బి.ఏ గ్రాడ్యుయేట్ రాజీవ్ భాస్కర్. ఉద్యోగం వదిలేసి మరీ జామ పండ్ల సాగు చేపట్టి కోటి రూపాయల దాకా సంపాదించారు. అదేంటీ.. జామ పండ్ల సాగుతో అంత సంపాదన ఎలా సాధ్యం.. అని ఆశ్చర్యపోతున్నారా..? ఇంతకీ అతడేం చేశాడో.. ఎలా సంపాదించాడో.. అతడి జర్నీ ఏంటో ఈ కథనంలో తెలుసుకోండి. 


వ్యవసాయం వైపునకు ఎలాగంటే..

నైనిటాల్ లో జన్మించిన రాజీవ్ తన ఎడ్యుకేషన్ లో భాగంగా బిఎస్సీ అగ్రికల్చర్ చేసాడు. కానీ అతనికి వ్యవసాయం చేయాలనే ఆసక్తి అసలు ఉండేది కాదు. రాయ్ పూర్ లో సీడ్స్ కంపెనీలో పనిచేసేటపుడు కూడా వ్యవసాయం వైపునకు రావాలని అనుకోలేదు. వి.యన్.ఆర్ సీడ్స్ అనే కంపెనీలో పనిచేసిన నాలుగు నెలల అనుభవం తనని పంట చేలలోకి తీసుకెళుతుందని రాజీవ్ ఎప్పుడూ అనుకోకపోవడం కొసమెరుపు. రాజీవ్ వి.యన్.ఆర్ సీడ్స్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఎంతోమంది రైతులతో మాట్లాడేవాడు. విత్తనాల గురించి, వాటిని విత్తవలసిన సమయం గురించి, పంటల గురించి  వారితో మాట్లాడుతూనే అతడు కూడా అవగాహనను పెంచుకున్నాడు. 


కంపెనీలో పనిచేసేటప్పుడే డిస్టెన్స్ లో ఎం.బి.ఏ చేశాడు. రైతులతో పంటల గురించి మాట్లాడుతున్నప్పుడు అతడికి మెల్లిగా వ్యవసాయంపై ఆసక్తి పెరిగింది. 2017 లో అతను కొంతకాలం వ్యవసాయం చేయాలని అనుకుంటున్నట్లు తను పనిచేసే కంపెనీలో చెప్పాడు. అయితే కొంతకాలం చెయ్యాలనుకున్న అతను పూర్తిగా వ్యవసాయం వైపునకు వెళ్ళిపోతాడని కంపెనీ వాళ్లే కాదు అతడు కూడా ఊహించలేదు. రాజీవ్ తనకున్న ఆసక్తి వల్ల థాయ్ జామపళ్ళ సాగును వేరే రైతుకు సంబంధించిన పొలంలో మొదలుపెట్టాడు. అయితే ఆ పొలం వ్యక్తి తన జామ తోటను సరిగా చూసుకోలేక అయిదు ఎకరాల పొలాన్ని రాజీవ్ చేతుల్లో పెట్టాడు. ఆ జామ తోట మీద మెల్లిగా దృష్టి సారించిన రాజీవ్ ఉద్యోగాన్ని వదిలి పూర్తిగా జామ పళ్ళ సాగుకే పరిమితమైపోయాడు. 
థాయ్ జామపండ్ల సాగు..

పేరుకు తగ్గట్టుగానే థాయ్ జామపండ్లు థాయ్‌లాండ్ దేశానికి చెందినవి. ఇవి మంచి నాణ్యత కలిగి పరిమాణంలో పెద్దగా, లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. రుచిలో కూడా మరీ తీపి కాకుండా తక్కువ తీపిని కలిగి ఉంటాయి. వీటికి భారతదేశం అంతటా మంచి డిమాండ్ ఉంది. మరీ ముఖ్యంగా 25 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నిల్వచేస్తే 15 రోజుల వరకు తాజాగా ఉండటం ఈ పండ్ల ప్రత్యేకత. ఇవి నాటిన  రెండు నుండి మూడు సంవత్సరాల తరువాత పండ్లు కాయడం మొదలవుతంది. ఒకో మొక్క నుండి దాదాపు 10కిలోల దిగుబడి వస్తుంది. ఇది నెమ్మదిగా 25 కిలోలకు పెరుగుతుంది. రాజీవ్ మాత్రం ఒకో మొక్క నుండి సుమారు 40 కిలోల దిగుబడి సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.


వీటి ధర ఎలా ఉంటుంది

ఇవి ఒక కిలో జామపళ్ళు సీజన్‌ను బట్టి 40 నుండి 100 రుపాయల ధర ఉంటాయి. 


Residue-free farming అంటే..

Residue-free farming పూర్తిగా సేంద్రీయం కాదు. అలాగని పూర్తిగా రసాయనాలతో కూడినది కాదు. కానీ ఎక్కువ భాగం సేంద్రీయ తరహాలో, తక్కువ భాగం రసాయనాలను కలిగి ఉంటుంది. ఇందులో ఉపయోగించే రసాయనాలు మనిషి ఆరోగ్యానికి హాని కలిగించని మోతాదులో ఉంటాయి. 


ఎలాంటి మందులు, ఎంత వ్యవధిలో వాడతారు

ఈ Residue-free farming లో వినియోగించే పురుగుల మందులు చాలా తక్కువ PHI కలిగి ఉంటుంది. అంత ఎక్కువ హానికరం కాదని తెలియజేసే ఆకుపచ్చ లేబుల్స్ వీటి మీద ఉంటాయి. ఇలాంటి రసాయన మందులు వాటి అవశేషాలను ఎక్కువసేపు పంటల మీద ఉంచవు, ఎక్కువ మొత్తంలో ఎక్కువ ప్రభావం ఉన్న రసాయన మందులు మొక్కలు, చెట్ల మీద ఎక్కువ ప్రభావం చూపి ఆకులు, వేర్లు, కాండం లలోకి చొచ్చుకునిపోవడం వల్ల కాయలు, విత్తనాలు, ధాన్యాల మీద వాటి అవశేషాలు ప్రభావం చూపిస్తాయి. కానీ ఈ Residue-free farming వల్ల పంటలు రసాయనాలమయం అయిపోవు. ఎలాంటి తెగుళ్ళ బారిన పడవు. రాజీవ్ అయితే పురుగు మందులను 3 నుండి 5 రోజుల విరామం తీసుకుంటూ ఒకదాని తరువాత ఒకటి ఉపయోగించాడు. దీనివల్ల ఏ రసాయనం జామ మొక్కలకు కానీ, పువ్వులు పండ్లకు కానీ ఎలాంటి హాని కలిగించలేదు. అంతే కాదు రసాయనాలు ఉపయోగించిన 15 రోజుల తరువాతే అతను తన జామ తోట విషయంలో పూర్తి పనులు చేపడతాడు. మట్టిలో పోషకాలను, ఆరోగ్యకరమైన సూక్ష్మజీవులను పెంచుకోవడానికి బయో పెస్టిసైడ్స్ ఉపయోగించాడు. వీటి వల్ల పంటకు ఎలాంటి నష్టం ఉండదు. నీటిలో కరిగే ఎరువులను సరైన సమయానికి వాడటం, నీటి వృధా అరికట్టడానికి బిందు సేద్యం ఉపయోగించడం ఇతను పాటించిన మరికొన్ని ఆరోగ్యకరమైన పద్దతులు. 


ముందడుగు.. వైఫల్యం

రాజీవ్ సాగు చేసిన జామ తోట మొదటిసారిగా  2017లో అక్టోబర్, నవంబర్ మాసాల్లో దిగుబడి ఇచ్చింది. ఈ దిగుబడిలో దాదాపు ఇరవై లక్షల ఆదాయం పొందాడు. ఆ ఆత్మవిశ్వాసంతోనే కూరగాయల సాగు కోసం ఢిల్లీలో మొహాలీ విమానాశ్రయానికి దగ్గరలో 15 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఆ భూమిలో Residue-free farming  చేపట్టాడు. అయితే కూరగాయల వ్యవసాయం అంత ఆశాజనకమైన ఫలితాన్ని ఇవ్వలేదు. కూరగాయల మార్కెటింగ్ లో రాజీవ్ విఫలమయ్యాడు. ఈ నష్టాల కారణంగా కూరగాయల సాగుకు స్వస్తి చెప్పాడు. ఇలా వైఫల్యం రాజీవ్ అకౌంట్ లో చేరిపోయింది.భాగస్వామ్యంతో భవిష్యత్తు

కూరగాయల సాగులో నష్టం ఎదురైన తరువాత రాజీవ్ మరొక ముగ్గరు వ్యక్తులతో కలసి మళ్ళీ థాయ్ జామపళ్ళ సాగు వైపే దృష్టి పెట్టాడు. 2019లో పంజాబ్ లోని రూపనగర్ లో 55 ఎకరాల భూమిని లీజుకు తీసుకున్నారు. వీరందరూ కలసి 25 ఎకరాలలో థాయ్ జామ చెట్లు నాటారు. వాటిని చూసుకుంటూనే రాజీవ్ పంచకులులో తను వేరే రైతు నుండి తీసుకుని సాగుచేస్తున్న 5 ఎకరాలను కొనసాగించాడు. అయితే 2021లో ఆ రైతు తన భూమిని అమ్మివేయాలని అనుకోవడం, రాజీవ్ కు పంజాబ్ లో తోటను చూసుకోవాల్సి రావడంతో పాతపొలాన్ని వదిలేసుకున్నాడు.మార్కెటింగ్ పోటీకి మంచి మార్గం

సాధారణంగా థాయ్ జామపళ్ళను సంవత్సరంలో రెండుసార్లు పండిస్తారు. ఒకటి వర్షాకాలంలో, రెండు శీతాకాలంలో. అయితే మార్కెట్ లో పోటీ ఎక్కువగా ఉన్న కారణం వల్ల రాజీవ్ కేవలం ఒకసారి మాత్రమే, అది కూడా వర్షాకాలంలోనే పండిస్తున్నారు. మిగిలిన సమయంలో మొక్కలకు విశ్రాంతి ఇస్తారు. ఢిల్లీలోని మార్కెట్ లో 10 కిలోల బాక్స్ లను అమ్ముతారు, వారం రోజుల లోపు డబ్బు చేతికి అందుతుంది. 


ప్రస్తతం రాజీవ్ పరిస్థతి ఎలా ఉందంటే..

ఇతను తన దగ్గర 14మందికి పని కల్పించగలుగుతున్నాడు. ఒక ఎకరాకు సగటున 6 లక్షల ఆదాయాన్ని పొందుతున్నాడు. ఇతనికి అగ్రికల్చర్ మీద సరైన అవగాహన ఉండటం వల్ల ఎంతో కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకోగలుగుతున్నాడు. పైగా మార్కెటింగ్ విషయంలో కూడా తెలివి ఉపయోగించాడు.


థాయ్ జామ సాగు గురించి రాజీవ్ మాట

థాయ్ జామ సాగు అంత సులువేమీ కాదు. ఏమాత్రం సరైన అవగాహన లేకపోయినా సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతకంటే ముఖ్యంగా మార్కెటింగ్ విషయంలో కూడా తెలివిగా ఉండాలి. లాభనష్టాలను భరించగలగాలి. అన్ని జాగ్రత్తలు తీసుకుంటే సగటు లాభం పొందవచ్చు. 30 సంవత్సరాల వయసు కలిగిన రాజీవ్ 25 ఎకరాలలో 12,000 జామ చెట్లతో  ప్రస్తుతం మంచి ఆదాయాన్ని పొందుతున్నాడు. అయితే అదెప్పుడూ స్థిరంగా ఉండదు. ఈ సంవత్సరం ఉన్నట్టు తరువాత సంవత్సరం ఉండచ్చు, ఉండకపోవచ్చు. లాభనష్టాలు ఏ రైతు చేతుల్లోనూ ఉండవు.

Read more