ఆ ఇంటిలో 3 నెలల 10 రోజులు ఒంటరిగా ఉన్నాడు... అందుకు ఎంత ప్రతిఫలం అందుకున్నాడో తెలిస్తే...

ABN , First Publish Date - 2022-09-29T13:50:59+05:30 IST

ప్రముఖ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ కొత్త ఛాలెంజ్ చర్చనీయాంశంగా మారింది.

ఆ ఇంటిలో 3 నెలల 10 రోజులు ఒంటరిగా ఉన్నాడు... అందుకు ఎంత ప్రతిఫలం అందుకున్నాడో తెలిస్తే...

ప్రముఖ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ కొత్త ఛాలెంజ్ చర్చనీయాంశంగా మారింది. ఈ ఛాలెంజ్‌ని పూర్తి చేసిన వ్యక్తికి సంబంధించిన వీడియోను మిస్టర్ బీస్ట్ షేర్ చేశాడు. ఈ వీడియోకు ఇప్పటి వరకు దాదాపు 2 కోట్ల 70 లక్షల వీక్షణలు దక్కాయి. ఇక్కడ విశేషమేమిటంటే ఈ ఛాలెంజ్ పూర్తి చేసిన వ్యక్తికి మిస్టర్ బీస్ట్ దాదాపు రూ. 4 కోట్లు ప్రైజ్ మనీగా ఇచ్చాడు. మిస్టర్ బీస్ట్‌కి యూట్యూబ్‌లో 105 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు. మిస్టర్ బీస్ట్ ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన సవాళ్లను విసురుతుంటాడు. ఛాలెంజ్‌లో గెలుపొందిన వారికి భారీగా డబ్బు కూడా అందజేస్తాడు. తాజా ఎపిసోడ్‌లో మరో కొత్త ఛాలెంజ్‌ని విసిరాడు. నిర్జన ప్రదేశంలో ఒక వృత్తం రూపొందించి, ఆ సర్కిల్ లోపల తాత్కాలిక ఇల్లు ఏర్పాటు చేశాడు. ఇంటి లోపల నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలు, దుస్తులు ఇతర వస్తువులు అందుబాటులో ఉంచాడు. ఈ సర్కిల్ లోపలి ఇంటిలో ఒక వ్యక్తి 100 రోజులు ఒంటరిగా గడపవలసి ఉంటుంది. ఈ టాస్క్ పూర్తి చేసినవారికి మిస్టర్ బీస్ట్ రూ.4 కోట్ల రివార్డు ప్రకటించాడు. బీస్ట్ సబ్ స్క్రైబర్లలో ఒకరు ఈ టాస్క్ పూర్తి చేసి బహుమతిని గెలుచుకోవడానికి ముందుకు వచ్చాడు. అతని పేరు షాన్. అతను ఫ్యామిలీకి వీడ్కోలు పలికిన తర్వాత టాస్క్ మొదలైంది. అతని యాక్టివిటీని రికార్డ్ చేయడానికి ఇంట్లోని వివిధ చోట్ల కెమెరాలు కూడా అమర్చారు. షాన్ ఆ ఇంట్లో 100 రోజులు గడపవలసి వచ్చింది. ఆహారం తయారు చేయడం నుంచి బాత్‌రూమ్‌ శుభ్రం చేయడం వరకు అన్నీ అతనే చేసుకోవలసి ఉంటుంది. టాస్క్ సమయంలో బీస్ట్ అతనికి ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు సృష్టించాడు. కొన్నిసార్లు మిస్టర్ బీస్ట్ కొంత డబ్బు ఇస్తానని చెబుతూ, టాస్క్‌ను వదిలేయమని కోరడం కనిపిస్తుంది. కానీ షాన్ 100 రోజులు పూర్తి చేసి, ప్రైజ్ మనీని దక్కించుకున్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాన్‌ను అభినందనలతో  ముంచెత్తుతున్నారు.

Read more