Viral Video: చికెన్ వింగ్స్ ఆర్డర్ చేసిన కస్టమర్.. తీసుకొస్తూ ఆకలేస్తే తినేసిన డెలివరీ బాయ్: ఎముకలు మాత్రమే డెలివరీ

ABN , First Publish Date - 2022-09-09T03:25:07+05:30 IST

ఫుడ్ డెలివరీ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత మన జీవితాలు మరింత సౌకర్యవంతంగా మారాయని చెప్పడంలో

Viral Video: చికెన్ వింగ్స్ ఆర్డర్ చేసిన కస్టమర్.. తీసుకొస్తూ ఆకలేస్తే తినేసిన డెలివరీ బాయ్: ఎముకలు మాత్రమే డెలివరీ

న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత మన జీవితాలు మరింత సౌకర్యవంతంగా మారాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎక్కడున్నా, ఎప్పుడైనా, అర్ధరాత్రి.. అపరాత్రి అని తేడాలేకుండా కావాల్సిన ఆహారాన్ని హాయిగా ఇంటికే తెప్పించుకునే వీలుచిక్కింది. ఇక, రుచి అంటారా? కొన్నిసార్లు అద్భుతంగా ఉంటే, మరికొన్ని సార్లు పెదవి విరిచేలా ఉంటుంది. అయితే, ఆకలి తీరడం ముఖ్యం కాబట్టి అవేమీ పట్టించుకోవాల్సిన పనిలేదు. అయితే, కొన్నిసార్లు ఆర్డర్ చేసిన దానికి బదులుగా మరోటి రావడం వంటివి కూడా జరిగిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అయితే, ఇది మాత్రం పూర్తి భిన్నమైనది. ఫుడ్ డెలివరీ బాయ్ తెచ్చిన ప్యాక్‌ను ఆవురావురుమంటూ విప్పిన డామియెన్ శాండర్స్‌కు వింత అనుభవం ఎదురైంది. ప్యాక్ విప్పి షాకైన అతడు తన అనుభవాన్ని అందరితో పంచుకోవాలని భావించి ఇన్‌స్టాలో షేర్ చేశాడు. 


ఆ పోస్టు ప్రకారం.. డామియన్ ఓ రెస్టారెంట్ నుంచి చికెన్ వింగ్స్, కూల్‌డ్రింక్ ఆర్డర్ చేశాడు. కాసేపటి తర్వాత డెలివరీ బాయ్ వచ్చి ప్యాకెట్ అందించి వెళ్లాడు. అప్పటికే ఆకలితో నకనకలాడుతున్న డామియన్ ప్యాకెట్ విప్పి చూసి నిర్ఘాంతపోయాడు. అందుతో అతడు ఆర్డర్ చేసిన చికెన్ వింగ్స్‌కు బదులుగా మొత్తం తినేయగా మిగిలిన బోన్స్ కనిపించడంతో విస్తుపోయాడు. అక్కడితో అయిపోలేదు. అందులో ఓ లెటర్ కూడా ఉండడంతో ఆశ్చర్యంగా విప్పి చదివాడు.


తనకు బాగా ఆకలి వేయడంతో వేరే దారి లేక ప్యాకెట్‌ను విప్పి తినేశానని, తనను క్షమించాలని డెలివరీ బాయ్ ఆ లేఖలో రాసుకొచ్చాడు. నా కోసం మీరే డబ్బులు చెల్లించారని అనుకోమని, ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని రాశాడు. అంతేకాదు, ఆ జాబ్‌‌ను తాను వదిలేస్తున్నట్టు కూడా అందులో పేర్కొన్నాడు. ఏం చేయాలో పాలుపోని డామియెన్ దానిని వీడియో తీసి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. 


నెటిజన్లు స్పందన మిశ్రమంగా ఉంది. కొందరు ‘పోనీలెద్దు.. ఆకలేసి తినేసి ఉంటాడు’ అని కామెంట్ చేస్తే.. తిన్నాడు సరే ఎముకలు ఇవ్వడం ఏంటని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూల్‌డ్రింక్ బాటిల్‌ మాత్రం ముట్టుకోకపోవడంపై కనీసం ఇదైనా తెచ్చిచ్చాడు నయం అని జోకులు పేలుస్తున్నారు. కాగా, 2018లో జొమాటో డెలివరీ బాయ్ ఒకరు కస్టమర్ ఫుడ్ తినేశాడు. ఆ తర్వాత అతడిని కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించింది. అయితే, ఇది తీవ్ర విమర్శలకు దారితీసింది. సమయంతో పనిలేకుండా కొద్ది పాటి వేతనం కోసం పనిచేస్తుంటే ఇలా తీసేస్తారా? అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. నిజానికి డెలివరీ బాయ్స్‌పై చాలా ఒత్తిడి ఉంటుంది. సమయానికి డెలివరీ చేయాలన్న తొందరలో కొన్ని సార్లు ప్రమాదంలో పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. 



Read more