Kargil: సాహస మహిళల హిమాలయ యాత్ర

ABN , First Publish Date - 2022-07-25T14:01:55+05:30 IST

యాభై ఏళ్లు పైబడిన 12 మంది సాహస మహిళలు(Adventure womens) హిమాలయ యాత్ర(Himalayan Expedition)...

Kargil: సాహస మహిళల హిమాలయ యాత్ర

కార్గిల్ (జమ్మూకశ్మీర్): యాభై ఏళ్లు పైబడిన 12 మంది సాహస మహిళలు(Adventure womens) హిమాలయ యాత్ర(Himalayan Expedition) పూర్తి చేశారు. పర్వతారోహకురాలు,పద్మభూషణ్ బచేంద్రి పాల్ (Bachendri Pal)నేతృత్వంలో మహిళల ట్రాన్స్ హిమాలయన్ యాత్ర ద్రాస్ కార్గిల్‌కు (Kargil) చేరుకుంది.50 ఏళ్లు పైబడిన 12 మంది మహిళలు ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పర్వతారోహణ యాత్రను పూర్తి చేసి అందరి అభినందనలు అందుకున్నారు. ఈ బృందానికి ప్రముఖ పర్వతారోహకురాలు,ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ బచేంద్రి పాల్ నాయకత్వం వహించారు.అరుణాచల్ ప్రదేశ్‌లోని పాంగ్-సౌ పాస్ నుంచి ప్రారంభం అయిన ఈ సాహస యాత్ర ఐదు నెలల అనంతరం కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నం వద్ద ముగిసింది.యాత్ర ముగింపు సందర్భంగా సాహస మహిళలు కార్గిల్ యుద్ధ అమరవీరులకు నివాళులర్పించారు.


ఫిట్ ఇండియా కార్యక్రమంతో ప్రేరణ పొందాం...

 ‘‘ఈ యాత్ర యొక్క లక్ష్యం ఫిట్‌గా ఉండాల్సిన అవసరాన్ని హైలైట్ చేయడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని గడపడానికి వయస్సు అడ్డంకి కాదు’’ అని బచేంద్రిపాల్ చెప్పారు.భారత ఆర్మీ అడ్వెంచర్ వింగ్ నుంచి నిరంతరం తమకు మద్దతు లభించడం వల్లనే తమ బృందం యాత్రను పూర్తి చేయగలిగిందని బచేంద్రిపాల్ వివరించారు. ‘‘నేను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(narendra mody) ప్రారంభించిన ఫిట్ ఇండియా(fit india) కార్యక్రమం నుంచి ప్రేరణ పొందాను,నేను సాహస యాత్ర గురించి కలలు కన్నాను, ఈ యాత్రలోని 12 మంది సభ్యులను సంప్రదించాను. అందరూ 50 ఏళ్లు పైబడిన వారేనని, ఆ తర్వాత మేం ప్రభుత్వాన్ని ఆశ్రయించగా వారు కూడా మాకు మద్దతుగా నిలిచారు. మా బృందంలో భారతదేశం అంతటా రిటైర్డ్ ప్రొఫెషనల్స్, తల్లులు, అమ్మమ్మలు, గృహిణులు ఉన్నారు’’ అని బచేంద్రిపాల్ చెప్పారు.ఫిట్ ఇండియా బ్యానర్ కింద యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ సహకారంతో టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్ ఈ సాహసయాత్రను స్పాన్సర్ చేసిందని బచేంద్రిపాల్ వివరించారు.50వేల కిలోమీటర్ల దూరం హిమాలయ యాత్ర

ఈ మహిళా బృందం 50,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, ఐదు నెలల సుదీర్ఘ యాత్రలో 37 పాస్‌లను దాటి ద్రాస్ కార్గిల్ చేరుకుంది. ‘‘1999వ సంవత్సరంలో జరిగిన కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుల అత్యున్నత త్యాగాలను స్మరించుకునేందుకు ఈ సాహస యాత్రను చేశాం.ఈ యాత్ర మా అందరికీ గర్వకారణం. మేం మార్చి 12 వతేదీన అరుణాచల్ ప్రదేశ్ నుంచి యాత్ర ప్రారంభించాం, తూర్పు నుంచి పశ్చిమానికి హిమాలయాలను దాటాం, అరుణాచల్ నుంచి లడఖ్ వరకు 4,977 కిలోమీటర్లకు పైగా కవర్ చేసి 37 పర్వత మార్గాలను దాటాం... అరుణాచల్ ప్రదేశ్ నుంచి అసోం మీదుగా పశ్చిమ బెంగాల్, సిక్కిం, నేపాల్, కుమావోన్, గర్వాల్, హిమాచల్ ప్రదేశ్, స్పితి, లేహ్ మార్గంలో యాత్ర చేశాం. మేం కార్గిల్ యుద్ధంలో అమరవీరులకు మా నివాళులు అర్పించడానికి ఇక్కడ కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నం వద్ద ఉన్నాం’’ అని బచేంద్రి పాల్ జట్టు తమ సాహసయాత్ర ప్రయాణాన్ని పంచుకుంది.

Read more