ఈ పిల్లాడు నచ్చాడు.. తీసుకెళ్లాను.. తప్పేంటన్న కిడ్నాపర్..!

ABN , First Publish Date - 2022-11-24T14:52:37+05:30 IST

ఇంటి బయట ఆడుకుంటున్న పిల్లాడు నిమిషాలలోనే అదృశ్యమయ్యాడు

ఈ పిల్లాడు నచ్చాడు.. తీసుకెళ్లాను.. తప్పేంటన్న కిడ్నాపర్..!

ఇంటి బయట అల్లరి చేస్తూ ఆడుకుంటున్నాడు రెండేళ్ళ పిల్లాడు. కొడుకు అల్లరి చూసి మురిసిపోతోంది ఆ తల్లి. ఏదో అత్యవసరమై లోపలికి వెళ్ళింది. ఆమె బయటకు వచ్చేసరికి ఇంటి బయట ఆడుకుంటూ ఉండాల్సిన పిల్లవాడు కనిపించలేదు. ఓ పిల్లాడి మిస్సింగ్ కేస్ చాలా నాటకీయకంగా సాగింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...

ఆగ్రా లో 2సంవత్సరాల పిల్లవాడి కేసు వైరల్ అయ్యింది. ఇంటి బయట ఆడుకుంటున్న పిల్లాడు నిమిషాలలోనే అదృశ్యమయ్యాడు. పిల్లాడి తల్లిదండ్రులు, బంధువులు ఇంట్లో, చుట్టుప్రక్కలా అంతా వెతికారు కానీ ఎక్కడా బాబు జాడ లేదు. తల్లిదండ్రులు బోరుమని ఏడుస్తుండగా ఒక వ్యక్తి పిల్లాడికి చాక్లెట్లు ఇచ్చి ఎత్తుకెళ్ళాడని స్థానికుడు చెప్పాడు. వారు వెంటనే ఇంటి బయట ఉన్న సిసి కెమెరాలు పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తి పిల్లాడికి చాక్లెట్లు ఇవ్వడం, పిల్లాడిని ఆటోలో తీసుకుని వెళ్ళడం గమనించారు. దాని ఆధారంగా బాబు తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. సిసి కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసులు పిల్లాడికోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. కిడ్నాపర్ పిల్లాడిని తీసుకుని వెళ్ళిన ఆటో రైల్వే స్టేషన్ వైపు వెళ్లిందని తెలుసుకుని అటువైపు వెళ్ళి వెతికారు.

బాబు తల్లిదండ్రులు, బంధువులు పిల్లాడి కోసం రైల్వే స్టేషన్ ప్రాంతంలో వెతకగా ఓ వ్యక్తి ఫుల్లుగా మధ్యం సేవించి వారికి కనిపించాడు. అతడే కిడ్నాపర్ అని అనుకుని అతన్ని కొట్టి బాబు గురించి అడగగా నాకేమీ తెలియదని ఆ వ్యక్తి చెప్పడంతో అతడిని పోలీసులకు అప్పగించారు. అయితే సిసి కెమెరా స్పష్టంగా లేకపోవడం వల్ల వాళ్ళు వేరే వ్యక్తిని కిడ్నాపర్ గా పొరబడ్డారని తెలిసింది. అతన్ని వదిలేసిన తరువాత పిల్లాడిని వెతకడానికి పోలీసులకు సిసి కెమెరా ఫుటేజ్ తప్ప వేరే ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఆ కేసు గురించి అన్ని పట్టణాల పోలిస్ స్టేషన్ లను అప్రమత్తం చేశారు. వారి ప్రయత్నం ఫలించి పిల్లాడు మధుర లో, కిడ్నాపర్ చెల్లిలి ఇంట్లో ఉన్నట్టు తెలిసింది. అక్కడికి వెళ్ళి పిల్లాడిని స్వాధీనం చేసుకున్నారు. సదరు మహిళను విచారించగా మొహసిన్ అనే ఆ వ్యక్తి కొన్ని రోజుల క్రిందటి వరకు ఆ ఇంట్లో ఉండేవాడని అతను ఆ పిల్లాడిని తీసుకొచ్చి ఆ మహిళకు ఇచ్చి ఈ పిల్లాడు నా కొడుకు నీ దగ్గర ఓ రెండురోజుల పాటు ఉంచుకో నేను మళ్లీ వచ్చి తీసుకెళ్తాను అని చెప్పాడని పోలీసులకు తెలిపింది.

ఆ తరువాత పోలీసులు మొహసిన్ అనే ఆ కిడ్నాపర్ ను అరెస్ట్ చేసి విచారించగా పిల్లాడంటే నాకు ఇష్టం అందుకే కిడ్నాప్ చేశాను అనే సమాధానం ఇచ్చాడు. పోలీసులు ఎన్ని విధాలుగా అడిగినా కేసును తప్పుదోవ పట్టించే సమాధానాలు ఇస్తున్నాడట. కిడ్నాప్ కేసులో కేవలం మొహసిన్ మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది ప్రమేయం ఉండి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పిల్లలను బిచ్చగాళ్ళుగా మార్చి వాళ్ళ ద్వారా డబ్బు సంపాదించే గ్యాంగ్ లు చాలా ఉంటాయని దానికి సంబంధించిన వారు ఏమైనా ఇలా చేశారా అన్న కోణంలో విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఏది ఏమైనా పిల్లాడు క్షేమంగా తల్లిదండ్రులను చేరడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు జరుగుతోంది.

Updated Date - 2022-11-24T14:52:37+05:30 IST

Read more