Discounts in December: డిసెంబర్‌లో కార్ల ధరలు ఎందుకు తగ్గుతాయి? ఈ నెలలో కారు కొంటే లాభమా? నష్టమా?

ABN , First Publish Date - 2022-12-13T15:46:39+05:30 IST

మరి కొద్ది రోజుల్లో 2022వ సంవత్సరం పూర్తి కాబోతోంది. రాబోయే సంవత్సరంలో కొత్త వాహనాలతో సందడి చేసేందుకు ఆటోమొబైల్ మార్కెట్ సిద్ధమవుతోంది. జనవరి నుంచి కార్ల ధరలన్నీ పెరగబోతున్నట్టు ఇటీవలె వార్తలు వచ్చాయి. కాగా, చివరి నెల అయిన డిసెంబరులో ఆటోమొబైల్ కంపెనీలు భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి.

Discounts in December: డిసెంబర్‌లో కార్ల ధరలు ఎందుకు తగ్గుతాయి? ఈ నెలలో కారు కొంటే లాభమా? నష్టమా?

మరి కొద్ది రోజుల్లో 2022వ సంవత్సరం పూర్తి కాబోతోంది. రాబోయే సంవత్సరంలో కొత్త వాహనాలతో సందడి చేసేందుకు ఆటోమొబైల్ మార్కెట్ సిద్ధమవుతోంది. జనవరి నుంచి కార్ల ధరలన్నీ పెరగబోతున్నట్టు ఇటీవలె వార్తలు వచ్చాయి. కాగా, ఈ ఏడాది చివరి నెల అయిన డిసెంబరులో ఆటోమొబైల్ కంపెనీలు భారీ డిస్కౌంట్లను (Huge Discounts on Cars) ఆఫర్ చేస్తున్నాయి. ఆ తగ్గింపు.. నగదు, ఎక్స్చేంజ్ లేదా యాక్సెసరీల రూపంలో ఉంటుంది. మొత్తం మీద ఎలా చూసుకున్న వివిధ కంపెనీలు తమ వాహనాలపై డిసెంబర్ నెలలో రూ.50 వేల నుంచి రూ.3 లక్షల వరకు డిస్కౌంట్ ప్రకటించాయి. కార్ల కంపెనీలు (Automobile Companies) డిసెంబర్‌లో ఎందుకు డిస్కౌంట్లను అందిస్తాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

ఆటో డీలర్లు డిసెంబర్‌లో (Discounts in December) కార్లపై భారీ డిస్కౌంట్ ఇవ్వడానికి ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయి..

1) కంపెనీలు తమ పాత వాహనాలను ఏడాది ముగిసేలోపు ఎలాగైనా విక్రయించాలనుకుంటాయి. 2022లో తయారు చేసిన కార్లను 2023లో వినియోగదారులకు విక్రయించడం కష్టం. అప్పుడు మరింత ఎక్కువ తగ్గింపు ఆఫర్ చేయాల్సి ఉంటుంది. ఏడాది మారిపోతే అది పాత కారు కిందే లెక్క. అటువంటి పరిస్థితిలో కంపెనీలతో పాటు ఆటో డీలర్లు కూడా పాత స్టాక్‌ను క్లియర్ చేస్తారు. అందుకోసం భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తారు.

2) ముఖ్యంగా ఈ ఏడాది డిసెంబర్‌లో భారీ డిస్కౌంట్లు ఇవ్వడానికి మరో పెద్ద కారణం BS6 ఫేజ్ 2. ఏప్రిల్ నుంచి అన్ని కంపెనీలు BS6 ఫేజ్ 2 వాహనాలను మాత్రమే విక్రయించాలని కేంద్రం నిబంధన విధించింది. దాంతో కంపెనీలు BS6 ఫేజ్ 1 వాహనాలను వీలైనంత త్వరగా విక్రయించాలనుకుంటున్నాయి. లేకపోతే కంపెనీ భారీ నష్టాలను చవిచూడాల్సి ఉంటుంది.

వినియోగదారులకు లాభమా? నష్టమా?

డిసెంబర్‌లో కారు కొనడం వల్ల వినియోగదారులు భారీ డిస్కౌంట్లు పొందవచ్చు. ప్రస్తుతం కంపెనీలు రూ.3 లక్షల వరకు తగ్గింపును అందిస్తున్నాయి. కాబట్టి ఆ మేరకు లాభపడినట్టే. అయితే కొత్త సంవత్సరంలో మరిన్ని కొత్త ఫీచర్లతో, కొత్త టెక్నాలజీతో అదే మోడల్ కారు మార్కెట్లోకి వస్తే మీరు కాస్త నిరాశపడవచ్చు. అలాగే మీరు మీ కారును విక్రయించేటపుడు పాత మోడల్ కాబట్టి తక్కువ ధరకే అమ్మాల్సి ఉంటుంది.

Updated Date - 2022-12-13T15:46:41+05:30 IST