40 రోజుల పాటు స్నానం బంద్.. చెప్పులు కూడా వేసుకోరు.. మగాళ్లు చీరలు కట్టుకునే ఈ వింత ఆచారం ఎక్కడంటే..

ABN , First Publish Date - 2022-09-21T21:33:28+05:30 IST

ఈ విశాల ప్రపంచంలో ఒక్కో దేశం ఒక్కో సాంప్రదాయం, ఆచారాన్ని పాటిస్తుంది.

40 రోజుల పాటు స్నానం బంద్.. చెప్పులు కూడా వేసుకోరు.. మగాళ్లు చీరలు కట్టుకునే ఈ వింత ఆచారం ఎక్కడంటే..

ఈ విశాల ప్రపంచంలో ఒక్కో దేశం ఒక్కో సాంప్రదాయం, ఆచారాన్ని పాటిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఒక్క దేశంలోనే రకరకాల ఆచారాలు అమలవుతూ ఉంటాయి. భారతదేశం (India) విభిన్న సంస్కృతులు, ఆచారాలకు నెలవు. ఒక్కో రాష్ట్ర ప్రజలు తమ సాంప్రదాయం ప్రకారం పండుగలు, ఉత్సవాలు చేసుకుంటారు. రాజస్థాన్‌ (Rajasthan)లోని రాజసమంద్, కుంభాల్‌గర్ ప్రాంత ప్రజలు చేసుకునే నృత్య ఉత్సవం (Dance Festival) చాలా విచిత్రంగా ఉంటుంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో 40 రోజుల పాటు జరుపుకునే ఈ పండగలో కేవలం పురుషులు మాత్రమే పాల్గొంటారు. అలా పాల్గొనే పురుషులు కఠిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. 


మేవార్‌లోని అనేక గ్రామాలలో ఈ ప్రత్యేకమైన నృత్యోత్సవం జరుగుతుంది. గిరిజన సమాజానికి చెందిన ఈ నృత్యోత్సవాన్ని గవారి నృత్యం (Gavari Nritya) అంటారు. ఈ పండుగ జరిగే గ్రామాల్లోని ప్రజలు, దేశవిదేశాల్లో ఎక్కడ ఉన్నా వ్యాపార, ఉద్యోగాలకు సెలవులు పెట్టి ఈ కార్యక్రమంలో భాగమవుతారు. ఈ డ్యాన్స్ ఫెస్టివల్‌లో పాల్గొనే పురుషులు పసుపు, పిండి, ఆకుల రసంతో చేసిన రంగును ఉపయోగిస్తారు. వీరు ఒకసారి మేకప్ వేసుకుంటే, మళ్లీ నలభై రోజుల వరకు తీయకూడదు. అలాగే వారు ఆ 40 రోజులు చెప్పులు ధరించరు. వారి ఉపయోగించే సామగ్రిని నేలపై ఉంచరు. ఇక, వారెవరూ 40 రోజుల పాటు స్నానం కూడా చేయరు.


ఈ ఫెస్టివల్‌లో ఆడ, మగ అనే తేడా లేకుండా అన్ని పాత్రలనూ పురుషులే పోషిస్తారు. ఆడవాళ్ళలా మేకప్ వేసుకుని, చీర కట్టుకుని, గజ్జెలు వేసుకుని చిందులేస్తారు. ఈ గవారి నృత్యం శివపార్వతుల కథను వివరిస్తుంది. భాదోమాసంలో శివుని సమేతంగా పార్వతీ దేవి భూలోక సందర్శనకు వస్తుందని ఆ తెగలో ఒక నమ్మకం. ఈ ఉత్సవంలో పాల్గొనే పురుషులు ఉడికించిన ఆహారం తప్ప వేరేదీ తీసుకోరు. ఇక, వారి కుటుంబ సభ్యులు 40 రోజుల పాటు ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు. 

Read more