పుస్తకాల్ని పూజిస్తారక్కడ!

ABN , First Publish Date - 2022-07-31T15:57:46+05:30 IST

ఇంగ్లాండ్‌, వేల్స్‌, స్కాట్లాండ్‌, ఉత్తర ఐర్లాండ్‌లను కలిపి యునైటెడ్‌ కింగ్‌డమ్‌ అనీ, బ్రిటన్‌ అనీ పిలుస్తారు. స్కాట్లాండ్‌ రాజధాని అయిన ఎడింబర్గ్‌ నగరం మిగిలిన అన్ని బ్రిటీషు నగరాలకంటే భిన్నంగా వుంటుంది. 15వ శతాబ్దం నుంచి వుండే పాత ఎడింబర్గ్‌ నగరమూ, 17వ శతాబ్దం నుంచి వుండే కొత్త ఎడింబ

పుస్తకాల్ని పూజిస్తారక్కడ!

ఇంగ్లాండ్‌, వేల్స్‌, స్కాట్లాండ్‌, ఉత్తర ఐర్లాండ్‌లను కలిపి యునైటెడ్‌ కింగ్‌డమ్‌ అనీ, బ్రిటన్‌ అనీ పిలుస్తారు. స్కాట్లాండ్‌ రాజధాని అయిన ఎడింబర్గ్‌ నగరం మిగిలిన అన్ని బ్రిటీషు నగరాలకంటే భిన్నంగా వుంటుంది. 15వ శతాబ్దం నుంచి వుండే పాత ఎడింబర్గ్‌ నగరమూ, 17వ శతాబ్దం నుంచి వుండే కొత్త ఎడింబర్గ్‌ నగరమూ ‘యునెస్కో వరల్డ్‌ హెరిటేజ్‌’ ప్రాంతాల్లో వొకటిగా గుర్తించబడ్డాయి. ఆ నగర విశేషాలే ఇవి...


ఏడుకొండలపైన వ్యాపించిన విశాలమైన ఎడింబర్గ్‌ నగరం మొత్తం పెద్ద మ్యూజియంలా వుంటుంది. లెక్కపెట్టలేనన్ని చారిత్రక ప్రదేశాలూ, కట్టడాలూ వుండే ఈ నగరంలో వాటికి తలమానికంగా కనబడే కట్టడమొకటుంది. దాని పేరు ‘స్కాట్‌ మాన్యుమెంట్‌’.


రచయితకు గొప్ప గౌరవం...

ఎడింబర్గ్‌ నగరానికి గుండెకాయలా, నగరం మధ్యలో, కాజిల్‌రాక్‌ అనే పెద్ద గుట్టపైన, ఎడింబర్గ్‌ కోట ఉంటుంది. దానికి ఆనుకుని, గుట్టకింద సాగే ప్రధాన రహదారి పేరు ప్రిన్సెస్‌ స్ట్రీట్‌. ఆ వీధికి నట్టనడుమ, రెండు వందల అడుగుల యెత్తుండే కిరీటపు ఆకారపు పెద్దకట్టడం పేరు ‘స్కాట్‌ మాన్యుమెంట్‌’. సర్‌ వాల్టర్‌ స్కాట్‌ అనే సుప్రసిద్ధ చారిత్రక నవలా రచయిత జ్ఞాపక చిహ్నంగా కట్టిన కట్టడమది. దాన్ని చూసినప్పుడు నాకు ఆశ్చర్యం కలగడానికి కారణాలు రెండు: ఒక రచయితను అంతగొప్పగా గౌరవించడం మొదటిది. స్కాట్‌ను గురించి నాకంత వరకూ సమగ్ర మైన పరిచయం లేకపోవడడం రెండవది.


స్కాట్లాండ్‌ హైలాండ్స్‌ను వొకప్పుడు ఆటవిక సముదాయమనీ, బందిపోట్ల రాజ్యమనీ, మతమూర్ఖుల నిలయమనీ భావించిన వాళ్ళు స్కాట్‌ రాసిన వేవర్లీ నవలలు చదివాక తమ అభిప్రాయాలు తప్పని తెలుసుకున్నారు. ఎడింబర్గ్‌ రాయల్‌ సొసైటీ అధ్యక్షుడిగా కూడా పనిచేసిన స్కాట్‌... స్కాట్లాండ్‌దే అయిన విశిష్టమైన సంస్కృతినీ, నాగరికతనూ ప్రపంచమంతా గుర్తించి గౌరవించేలా చేశాడు. అందుకే స్కాట్లాండ్‌ ప్రజలంతా యిప్పటికీ ఆయనను గొప్పగా ఆరాధిస్తారు. అంతేకాదు, తరువాతి కాలంలో బాల్జాక్‌, డాస్కోవిస్కీ, ప్లూబార్ట్‌, టాల్‌స్టాయ్‌, అలెగ్జాండర్‌ డ్యూమా, పుష్కిన్‌ వంటి మహా రచయితలకు స్కాట్‌ రాసిన చారిత్రిక నవలలు స్ఫూర్తిదాయకమయ్యాయి.


1832లో స్కాట్‌ చనిపోయిన తరువాత ఆయన పేరుతో జ్ఞాపక మందిరానికి స్కాట్లాండ్‌ ప్రభుత్వం ప్రణాళికలు మొదలు పెట్టింది. భవన డిజైనర్లకు పోటీ పెట్టింది. జార్జ్‌ మెక్‌ కెంఫ్‌ అనే వాస్తుశిల్పి నమూనాను ఎన్నుకుని, ఎడింబర్గ్‌ కోట నేపథ్యంలో వుండేలా, ప్రిన్సెస్‌ స్ట్రీట్‌ పక్కన నిర్మాణాన్ని ప్రారంభించింది. 1840లో మొదలైన యీ పెద్దమందిర నిర్మాణం 1844లో పూర్తయింది.200 అడుగుల 6 అంగుళాల పొడవుండే యీ గోపురం ఒక రచయిత జ్ఞాపక చిహ్నాంగా తయారైన ఎత్తయిన నిర్మాణాల్లో రెండవదని అంటారు (హవానాలో జోస్‌ మార్టి అనే రచయిత స్మారక మందిరం ప్రపంచంలో ఎత్తయినది. దాని ఎత్తు 358 అడుగులు).



నవలల్లోని పాత్రలే బొమ్మలుగా...

ఈ పెద్ద జ్ఞాపక మందిరం పైకి వొంపులు తిరిగిన మెట్లదారి పైన వెళ్తే, రకరకాల అంతస్థుల్లో నిలబడి నగరాన్నంతా చూడొచ్చు. కొవిడ్‌ వల్ల మేము ఆ వూర్లో వున్న మూడు నెలల్లో దాని పైకి వెళ్లే దారుల్ని మూసేశారు. యీ పెద్ద మందిరంలో క్విల్‌ అనే కలం పట్టుకుని రాసుకునే పనిని కాసేపు ఆపి విశ్రాంతి తీసుకుంటున్న భంగిమలో స్కాట్‌ చలువ రాతి విగ్రహముంది. పక్కనే ఆయన పెంపుడు కుక్క ‘మైదా’ పడుకుని వుంటుంది.


మందిరం పైన మొదటి అంతస్థు దగ్గర రాబర్ట్‌ బర్న్స్‌, లార్డ్‌ బైరన్‌, టొబియాస్‌ స్మాలెట్‌ లాంటి రచయితలు, రాణీమేరీ, జేమ్స్‌ల్లాంటి రాజవంశీకుల తలలు వరసగా 16 కనబడతాయి. జ్ఞాపక మందిరపు మిగిలిన అంతస్థుల్లో, అనేక చోట్లలో స్కాట్‌ నవలల్లోని 64 పాత్రల బొమ్మల్ని అందంగా అమర్చారు. వొక రచయిత చిత్రించిన పాత్రలకు ఇలాంటి గౌరవం లభించడం మరెక్కడా కనిపించదు.


ఎడింబర్గ్‌ నగరానికి బస్సులో గంట ప్రయాణం దూరంలో వుండే గ్లాస్గో నగరంలో జార్జ్‌స్క్వేర్‌లో చుట్టూ వుండే పెద్ద విగ్రహాల మధ్యలో 80 అడుగుల ఎత్తున్న పెద్ద స్థంభం పై నుండే స్కాట్‌ విగ్రహం... కింది నుంచి చూసినప్పుడు కూడా మనిషంత పొడుగ్గా కనబడుతుంది. ఎడింబర్గ్‌లో వుండే ఏ పుస్తకాల షాపుకెళ్ళినా స్కాట్‌ రచనల కొత్త ముద్రణల ప్రతులు తాజా ముఖచిత్రాలతో మెరిసిపోతూ కనబడతాయి. ప్రిన్సెస్‌ స్ట్రీట్‌లో స్కాట్‌ మాన్యుమెంట్‌కు ఎదురుగా ఆయన పేరుతో స్కాట్లాండ్‌కు చెందిన అనేక వస్తువుల్నీ, సంగీతవాయిద్యాలనూ, దుస్తులనూ అమ్మే దుకాణమొకటుంది. దానిపైన ఉండే స్కాట్‌ రెస్టారెంట్‌లో కాఫీ తాగడాన్ని అక్కడి వాళ్ళు గొప్పగా భావిస్తారు.



నవల పేరే రైల్వేస్టేషన్‌కు...

స్కాట్‌ మాన్యుమెంట్‌కు రెండు మూడు వందల అడుగుల దూరంలో వుండే ఎడింబర్గ్‌ రైల్వ్‌స్టేషన్‌ పేరు వేవర్లీ. ‘వేవర్లీ’ అన్నది స్కాట్‌ రాసిన చారిత్రక నవల పేరు. ఆ తరువాత ఆయన తన నవలలకు ‘వేవర్లీ రచయిత రాసిన నవల’ అనే ప్రత్యేకంగా పేరు పెట్టుకున్నాడు. తరువాత అదే జీవితాల గురించి అవే పాత్రలతో ఆయన రాసిన నవలలను ‘వేవర్లీ నవలలు’ అని పేర్కొంటారు. ఎడింబర్గ్‌వాసులు ఆ పేరునే తమ రైల్వేస్టేషన్‌కు పెట్టుకుని మురిసిపోయారు.


ప్రజలే చందాలు వేసుకుని...

స్కాట్లాండ్‌లో స్కాట్‌ తర్వాత అంతటి గౌరవం పొందిన మరో సాహిత్యకారుడు రాబర్ట్‌బర్న్స్‌. 18వ శతాబ్దపువాడైన బర్న్స్‌ ఇంగ్లీషు రొమాంటిక్‌ యుగానికి ఆధ్యుడు. ఆయనను ఇప్పటికీ స్కాట్లాండ్‌ వాళ్ళు తమ జాతీయ కవిగా ఆరాధిస్తారు. బర్న్స్‌ తన మాతృభాష అయిన ‘గాలిక్‌’లో కవితలు, పాటలు రాశాడు. అయితే ఆయన ఇంగ్లీష్‌కే చెందిన స్కాట్లాండ్‌ మాండలికాన్ని ఇంగ్లీషు వాళ్ళకు అర్థమయ్యేలా రాశాడు. బర్న్స్‌ తన స్కాట్లాండ్‌ దేశపు జానపద గీతాల్ని సేకరించి వాటికి ప్రాచుర్యాన్ని తెచ్చాడు. దాదాపు అదే పద్ధతిలో ఆయన రాసిన పాటల్ని ఇప్పటికీ అక్కడి గాయకులు ఆనందంగా పాడు కుంటారు. ఎడింబర్గ్‌లోని రెజింట్‌ రోడ్డులో, పాత అసెంబ్లీ భవనానికెదురుగా బర్న్స్‌ స్థూపముంది. ఆయన పుట్టిన వూరు అల్లోవేలో జార్జిస్వేర్‌లో మొదట బర్న్స్‌ విగ్రహం లేదట! ఆ వూరి ప్రజలంతా చందాలేసుకుని ఆ విగ్రహాన్నక్కడ ప్రతిష్టించుకున్నారని అక్కడి గైడు చెప్పాడు.


ఎడింబర్గ్‌ కోటకు దగ్గరలో వుండే ‘సెయింట్‌ గైల్స్‌ కెతిడ్రల్‌’ అనే పెద్ద చర్చిలో ప్రముఖ నవలా రచయిత ఆర్‌.ఎల్‌.స్టీవెన్‌సన్‌ స్మారక చిహ్నముంది. పడకపైన ఆనుకుని నడుము వరకు శాలువా కప్పుకుని రాసుకుంటున్న భంగిమలో వుండే స్టీవెన్‌సన్‌ బొమ్మ నాలుగో డైమన్షన్‌ కూడా వుండే ఫోటోలో సజీవంగా తయారైంది. ఆయన రాసిన ట్రెజర్‌ ఐలాండ్‌, డాక్టర్‌ జెకిల్‌ అండ్‌ మిస్టర్‌ హైడ్‌ నవలలు తెలుగువాళ్ళకెంతో యిష్టమైనవి.



రచయితల జ్ఞాపకాలు అనేకం

ఎడింబర్గ్‌లో ప్రసిద్ధమైన రైటర్స్‌ మ్యూజియంను కొవిడ్‌ వల్ల మూసేశారు. అయితే నేను తిరిగి రావడాని పదిహేను రోజుల ముందు దాన్ని తెరిచారు. ఎడింబర్గ్‌ కోట దగ్గరిలో, రాయల్‌మైను ఆనుకుని లాన్‌ మార్కెట్‌లో పెద్ద మూడంతస్థుల భవనంలో ఉన్న రైటర్స్‌ మ్యూజియంలో స్కాట్‌, బర్న్స్‌, స్టీవెన్‌సన్‌ల జీవితాలకు చెందిన అనేక వస్తువుల్ని జాగ్రత్త చేశారు. 


1622లో కట్టిన ఈ భవనం ఎడింబర్గ్‌లోని చాలా పురాతన భవనాల్లాగే, ఇప్పటికీ దృఢంగా, చెక్కుచెదరకుండా వుంది. ఇందులో బర్న్స్‌ రాతబల్ల, స్కాట్‌ నవలల్ని మొదట్లో అచ్చువేసిన అచ్చుయంత్రం, స్కాట్‌ చిన్నతనంలో ఆడుకున్న బొమ్మ గుర్రం, స్టీవెన్‌సన్‌ బూట్లూ, ఆయన వుంగరమూ వున్నాయి. ఆ ముగ్గురు రచయితల లిఖిత గ్రంథాలూ, ఛాయాచిత్రాలతో పాటూ స్కాట్‌ వేవర్లీ నవల తొలి ముద్రణ ప్రతీ, స్టీవెన్‌సన్‌ సంతకం చేసిపెట్టుకున్న పుస్తకాలూ, బర్న్స్‌ ప్రూఫులు దిద్దినప్పుడు కూర్చున కుర్చీ, స్టీవెన్‌సన్‌ దుస్తులూ ఆ మ్యూజియంలో వున్నాయి.


ఈ ముగ్గురు రచయితలే కాకుండా ఎడింబర్గ్‌ దగ్గరిలోని ఊర్లలో ఆర్థర్‌ కానన్‌దైల్‌, తామస్‌ కార్లయిల్‌, ఆర్‌.ఎం.బాలంటైన్‌ లాంటి ప్రసిద్ధ రచయితలెందరో పుట్టి పెరిగారు. వాళ్ల ఇండ్లూ, వస్తువులూ ఆయా ఊర్లలోని మ్యూజియాల్లో జాగ్రత్త చేశారు. నేటి ప్రసిద్ధ రచయిత్రి ఆర్‌.కె.రౌలింగ్‌ది కూడా ఎడింబర్గే! ఆమె తొలి నవల రాసిన రాయల్‌ మైలోని పబ్బును కూడా అక్కడి గైడ్లు దర్శనీయస్థలంగా చూపిస్తారు.


అంతా పుస్తక ప్రియులే...

ఎడింబర్గ్‌ నగరంలో ప్రతిచోటా చాలా పుస్తకాల అంగళ్ళున్నాయి. చిన్నచిన్న అంగళ్ళలో కూడా కనీసం రెండుమూడు అరల్లో పుస్తకాలుంటాయి. ప్రతిచోటా పుస్తకాల్ని అందరూ విరివిగా కొంటుంటారు. బాగా రద్దీగా వుండే వీధుల్లోనూ, బస్సుల్లోనూ కూడా చాలామంది పుస్తకాల్ని దీక్షగా చదువుతూ కనబడతారు. తాము చదివేసిన పుస్తకాల్ని చాలామంది బస్టాపుల దగ్గర వదిలేసి వెళ్తారు. కావాల్సినవాళ్ళు వాటిని తీసుకెళ్ళి చదువుకుంటారు. అక్కడి ఫెస్టివ్‌ థియేటర్‌లో షేక్స్‌పియర్‌ డ్రామా ‘మిడ్‌ సమ్మర్‌ నైట్స్‌ డ్రీమ్‌’ ఓపెరాను చూడ్డానికెళ్ళినప్పుడు, టికెట్లు తనిఖీ చేస్తున్న యువతి ముందు వోపెరా పుస్తకాల గుట్ట కనిపించింది. వోపెరా ప్రారంభమయ్యేసరికి ఆ పుస్తకాలన్నీ ‘హాట్‌కేకు’ల్లా అమ్ముడైపోయాయి.


ఎడింబర్గ్‌ విశ్వవిద్యాలయ గ్రంథాలయ ముఖద్వారం దగ్గర పబ్‌ ఒకటి కనబడగానే ఆశ్చర్యపోయాను. ఆ పబ్‌లోని రెండు అంతస్థుల గోడల పొడవునా అరల్లో పుస్తకాలే వున్నాయి. అక్కడ కూర్చున్న విద్యార్థులందరూ పుస్తకాలు తిరగేస్తూ, లాప్‌టాపుల్లో పనిచేసుకుంటూ మద్యం రుచి చూస్తున్నారు. ఎడింబర్గ్‌ ప్రజలంతా (ఆ మాటకొస్తే స్కాట్లాండ్‌ వాసులందరూ) తాము తయారుచేసే వీస్కీ, జిన్‌, వోడ్కాలనెంతో గౌరవిస్తారు. అక్కడి వాతావరణానికి అవసరమైనంతగా కాస్త పుచ్చుకుంటారు. వాళ్లు తాగుతారుగానీ తాగుబోతులు కారు. పుస్తకాల్ని, రచయితల్నీ కనీసంగానయినా గౌరవించక పోయినప్పుడు, ఆ మనిషి మానసిక ఆరోగ్యం చెడి తీరుతుంది. ఇప్పటి తెలుగువాళ్ళకు ఎడింబర్గ్‌ నగరం చేస్తున్న హెచ్చరిక యిదే!


ఎడింబర్గ్‌ విశ్వవిద్యాలయ గ్రంథాలయ ముఖద్వారం దగ్గర పబ్‌ ఒకటి కనబడగానే ఆశ్చర్యపోయాను. ఆ పబ్‌లోని రెండు అంతస్థుల గోడల పొడవునా అరల్లో పుస్తకాలే వున్నాయి. అక్కడ కూర్చున్న విద్యార్థులందరూ పుస్తకాలు తిరగేస్తూ, లాప్‌టాపుల్లో పనిచేసుకుంటూ మద్యం రుచి చూస్తున్నారు.


పుస్తకాల్ని, రచయితల్నీ కనీసంగానయినా గౌరవించక పోయినప్పుడు, ఆ మనిషి మానసిక ఆరోగ్యం చెడి తీరుతుంది. ఇప్పటి తెలుగువాళ్ళకు ఎడింబర్గ్‌ నగరం చేస్తున్న హెచ్చరిక ఇదే!

Updated Date - 2022-07-31T15:57:46+05:30 IST