Employee fired: ఏడేళ్లలో మొదటిసారి జరిగిన తప్పు.. భారీ మూల్యం చెల్లించుకున్న ఉద్యోగి..!

ABN , First Publish Date - 2022-08-05T15:00:23+05:30 IST

అతడు సమయపాలన పాటించే ఉద్యోగి. గత ఏడేళ్లలో ఒక్కసారి కూడా డ్యూటీకి ఆలస్యంగా రాలేదు. అలాంటి వ్యక్తి ఓ రోజు ఏకంగా 20 నిమిషాలు లేటుగా కార్యాలయానికి వచ్చాడు. ఆ పొరపాటే చివరకు అనూహ్య పరిణామానికి దారితీసింది.

Employee fired: ఏడేళ్లలో మొదటిసారి  జరిగిన తప్పు.. భారీ మూల్యం చెల్లించుకున్న ఉద్యోగి..!

ఇంటర్నెట్ డెస్క్: అతడు సమయపాలన పాటించే ఉద్యోగి. గత ఏడేళ్లలో ఒక్కసారి కూడా డ్యూటీకి ఆలస్యంగా రాలేదు. అలాంటి వ్యక్తి ఓ రోజు ఏకంగా 20 నిమిషాలు లేటుగా కార్యాలయానికి వచ్చాడు. ఆ పొరపాటే చివరకు అనూహ్య పరిణామానికి దారితీసింది. యజమాన్యం ఆ ఉద్యోగిని(Employee) విధుల నుంచి తొలగించింది(Fired). ప్రముఖ ఆన్‌లైన్ చర్చావేదిక రెడిట్‌లో(Reddit) ఈ ఉదంతం ప్రస్తుతం వైరల్ అవుతోంది.


ఇది ఏ కంపెనీలో జరిగిందనే దానిపై స్పష్టత లేదు. అయితే.. బాధితుడి సహోద్యోగి ఈ విషయాన్ని ఆన్‌లైన్‌లో షేర్ చేశారు. అంతేకాకుండా.. బాధితుడికి మద్దతుగా తామందరం ఇకపై నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నట్టు తెలిపారు. అతడిని మళ్లీ ఉద్యోగంలోకి తీసుకునే వరకూ ప్రతి రోజూ తాము కార్యాలయానికి ఆలస్యంగా వస్తామని చెప్పారు. ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతున్న ఈ పోస్ట్‌పై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇప్పటికే ఈ పోస్ట్‌కు  దాదాపు 79 వేల లైకులు వచ్చాయి. అకస్మాత్తుగా ఉద్యోగం పోవడంతో అతడిని ఆర్థిక కష్టాలు చుట్టుముట్టి ఉంటాయని కొందరు వాపోయారు. 


అయితే.. కొందరు మాత్రం ఈ ఘటనపై పలు అనుమానాలను వ్యక్తం చేశారు. అతడిని ఎలాగైన తొలగించాలనే ఉద్దేశ్యంతోనే యాజమాన్యం ఇలా చేసి ఉంటుందని కొందరు కామెంట్ చేశారు. కేవలం 20 నిమిషాలు ఆలస్యమైనందుకే ఉద్యోగం పోయి ఉంటుందని తాము భావించట్లేదని అభిప్రాయపడ్డారు. మరికొందరేమో తమ ఉద్యోగ జీవితంలో ఎదురైన పరిస్థితులను వివరించారు. మంచుతుఫాను కారణంగా తాను ఓమారు ఆఫీసుకు లేటుగా రావాల్సి వచ్చిందని ఓ నెటిజన్ చెప్పారు. ఫలితంగా..బాస్ తనపై మండిపడ్డాడని ఆయన చెప్పుకొచ్చారు. అంతకుముందు ఐదేళ్లలో ఒక్కసారి కూడా తాను ఆఫీసుకు ఆలస్యం వచ్చింది లేదని వివరించాడు. అయినా కూడా.. బాస్‌‌తో తిట్లు తప్పలేదని వాపోయారు. తన ఆలస్యం గురించి వార్షిక సమీక్షా నివేదికలో బాస్ ప్రస్తావించాడని బాధపడ్డారు. అయితే.. ఉద్యోగం కోల్పోయిన వ్యక్తికి మద్దతుగా ఇతర ఉద్యోగులు నిలవడం ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది. 

Updated Date - 2022-08-05T15:00:23+05:30 IST