పావురాలకు ప్రేమాలయం

ABN , First Publish Date - 2022-04-24T18:43:23+05:30 IST

మన దేశంలో పావురాలకు కొరత ఏముంది? గుళ్లు, గోపురాలు, మసీదులు ఎక్కడ చూసినా అవే కనిపిస్తాయి.. కానీ విదేశీ పావురాలను చూడాలంటే మాత్రం కృష్ణా జిల్లాలోని మానికొండకు వెళ్లాల్సిందే! ఎందుకంటే అక్కడ 115 రకాల అరుదైన జాతుల పావురాలను పోషిస్తున్నాడు చెరుకువాడ శ్రీనివాసరావు...

పావురాలకు ప్రేమాలయం

మన దేశంలో పావురాలకు కొరత ఏముంది? గుళ్లు, గోపురాలు, మసీదులు ఎక్కడ చూసినా అవే కనిపిస్తాయి.. కానీ విదేశీ పావురాలను చూడాలంటే మాత్రం కృష్ణా జిల్లాలోని మానికొండకు వెళ్లాల్సిందే! ఎందుకంటే అక్కడ 115 రకాల అరుదైన జాతుల పావురాలను పోషిస్తున్నాడు చెరుకువాడ శ్రీనివాసరావు..

 

విజయవాడ నుంచి వయా కంకిపాడు మీదుగా గుడివాడ వెళ్లే ప్రధాన మార్గంలో మానికొండ వద్ద రోడ్డు పక్కన ఉంటుంది వెంకటేశ్వర ఆలయం. అది దాటి కొంచెం ముందుకు వెళితే పచ్చని చెట్లు, పొలాల మధ్య నిర్మించిన మూడంతస్థుల భవనం కనిపిస్తుంది. లోపలికి అడుగుపెట్టగానే ఎవరికైనా వింత అనుభూతి కలుగుతుంది. ప్రతి అంతస్థులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరలు.. అందులో దేశ విదేశాల్లోని అరుదైన జాతులకు చెందిన కపోతాలు సందడిచేస్తూ అలరిస్తాయి. ప్రతి గదిలో లైట్లు, ఫ్యాన్లతో పాటు మ్యూజిక్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేసి పావురాలకు శ్రావ్యమైన సంగీతాన్ని వినిపిస్తూ వాటికి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిం చారు పావురాల ప్రేమికుడు చెరుకువాడ శ్రీనివాసరావు. ఆయనకు ఆ పక్షులంటే వల్ల మాలిన ప్రేమ. భవనంలోని పావురాల క్షేమానికి అత్యంత సురక్షిత ఏర్పాట్లు చేశాడు. పక్షుల ప్రాణాలకు హాని కలిగించే శత్రు ప్రాణులు భవనంలోకి చొరబడకుండా ఇనుప కంచెతో రక్షణ వలయం ఏర్పాటు చేశాడు. కపోతాల పోషణ, సంరక్షణ కోసం శ్రీనివాసరావు కుటుంబ సభ్యులందరూఅండగా నిలిచి ప్రోత్సాహాన్ని అందిస్తుండటం విశేషం.


పదిహేను రకాల గింజలు..

పావురాలను చాలామంది పెంచు కుంటున్నారు కదా! ఇందులో వింతేముంది? అని ఎవరికైనా సందేహం వస్తుంది. కానీ శ్రీనివాసరావు పెంచుతున్నది సాధారణ పావురాలు కాదు. దేశ విదేశాలకు చెందిన వాటిని పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసి మరీ సాకుతున్నారు. ఆయనకిది పావురాల ప్రేమాలయం. మొదటి, రెండవ అంతస్థుల్లో ఎన్నో వ్యయప్రయాసల కోర్చి జర్మనీ, బ్రిటన్‌, అమెరికా, దుబాయ్‌, బంగ్లాదేశ్‌, బెల్జియం, సింగపూర్‌, పాకిస్థాన్‌, హంగేరి, చైనా తదితర దేశాల నుంచీ పావురాలను కొన్నాడీయన. క్యాప్జినో, ఓరియంట్స్‌, ఇంగ్లీష్‌నన్స్‌, ముకీస్‌, బార్లెస్‌, లాహోర్స్‌, అమెరికన్‌ ప్యాంకెయిన్స్‌, ఇంగ్లీష్‌ ప్యాంకెయిన్స్‌, జాకోబిన్స్‌, హంగేరియన్స్‌, షేక్‌ షర్లీ, బెల్జియం హోమర్స్‌, ఫ్రెంచ్‌ మొదీనా ఫాసర్‌... ఇలా సుమారు 115 రకాల అరుదైన జాతుల పావురాలను సేకరించాడీయన. మరో ఐదు రకాల దేశీయ పావురాలు కూడా ఉన్నాయిక్కడ. తలనిండా జూలు ఉన్నవి, బూట్ల మాదిరి కాళ్లున్నవి, కాళ్ల నిండా ఈకలు ఉన్నవి, విభిన్న రంగులున్న కళ్లున్నవి... ఇలా విలక్షణమైన పావురాలన్నింటినీ చూడొచ్చిక్కడ.


నెలకు యాభై వేల ఖర్చు..

సాధారణ దేశీ పావురాలను పోషించడం కష్టం కాదు కానీ.. విదేశీ కపోతాలను సంరక్షించడం సులభం కాదు. వాటిని చాలా సున్నితంగా పసిపిల్లల్లా చూసుకుంటే కానీ బతకవు. ఆరోగ్యంగా ఎదిగేందుకు కావాల్సిన విటమిన్లు, ప్రొటీన్లు, కాల్షియం, ఖనిజాలు కలగలిసిన పదిహేను రకాల గింజలను నిత్యం ఆహారంగా ఇస్తున్నారు. వీటిల్లో గోధుమలు, కోడిగుడ్డు పెంకులు, పెసలు, ఉలవలు, పచ్చ, తెల్లజొన్నలు, శనగలు, వేరుశనగ గుళ్లు, బఠానీ, సోయా, సన్‌ఫ్లవర్‌ సీడ్స్‌, ఇటుకరాళ్లు, గులకరాళ్లు, గవ్వలషెల్స్‌ వంటి బలవర్ధకమైన పౌష్టికాహార మిశ్రమాన్ని వాడుతున్నారు. కపోతాలకు సుస్తీ చేస్తే సమయానికి తగిన మందులు అందించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు యజమాని కుమార్తె దాసరి రవళి. పావురాల పిల్లలకు ఆయా రకాల గింజలను పిండిచేసిన ఆ మిశ్రమాన్ని సిరంజ్‌ ద్వారా ఆహారంగా అందిస్తున్నారు. ఇంత చేసినా కొన్ని పావురాలకు అప్పుడప్పుడు ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. కంటికి రెప్పలా కాపాడుకుంటే తప్ప బతకవు. ‘‘మా నాన్నకు పావురాలంటే ప్రాణం. ఆయనకు పదేళ్ల వయసున్నప్పటి నుంచి పావురాల పెంపకం అలవాటైంది. ఇప్పుడాయనకు 52 ఏళ్లు. ఈ వయసులోనూ ఓపికగా వాటి బాగోగులు చూసుకుంటారు. వీటి ఖర్చుకు వెనకాడరు. కొన్ని పావురాలను ఐదు వేల నుంచి 85 వేల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశారు నాన్న. దేశ, విదేశాలకు చెందిన అరుదైన మేలుజాతి పావురాలు మా వద్ద ఉన్నాయి. కేవలం పావురాల కోసమే ఒక ప్రేమాలయాన్ని మా తండ్రిగారు నిర్మించడం మాకెంతో గర్వకారణం..’’ అన్నారు శ్రీనివాసరావు కూతురు రవళి. పావురాలంటే వీరి కుటుంబానికి ఇంత ప్రేమ ఉంది కాబట్టే... అందరూ ‘పావురాల శ్రీనివాసరావు’ అని ముద్దుగా పిలుచుకుంటారు. అదే ఆయనకు ఆనందం.


- నక్కా ఏడుకొండలు, ఉంగుటూరు


‘‘మొదట్లో ఐదారు పావురాలను ఇంటివద్దే పెంచేవాణ్ణి. కాలక్రమేణా వాటితో విడదీయరాని బంధం ఏర్పడింది. వాటి కోసం ఇల్లు నిర్మించాలని సంకల్పించాను. ఎనిమిదేళ్ల కిందట ప్రత్యేకంగా కపోతాల కోసమే నా ఇంటిపక్కన మూడంతస్థుల భవంతిని నిర్మించాను. ఆ పక్షుల మధ్య కాసేపు గడిపితే చాలు.. నా ఒత్తిళ్లన్నీ మటుమాయం అవుతాయి. ఇప్పటి వరకు పావురాల కోసమే కోటి రూపాయల వరకు వెచ్చించాను. వాటి పోషణకు నెలకు సుమారు రూ.50 వేలు ఖర్చు అవుతోంది..’’


- చెరుకువాడ శ్రీనివాసరావు, 

పావురాల ప్రేమికుడు

Read more