-
-
Home » Prathyekam » Google marks 112th birth anniversary of physicist electronic music composer pcs spl-MRGS-Prathyekam
-
Google doodle: ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, సంగీత విద్వాంసుడు ఆస్కర్ శాలాకు గూగుల్ ఘన నివాళి..!
ABN , First Publish Date - 2022-07-19T00:46:45+05:30 IST
ప్రముఖ భౌతికశాస్త్రవేత్త, సంగీతకర్త ఆస్కర్ శాలా(Oskar Sala) 112వ జన్మదినాన్ని పురస్కరించుకుని టెక్ దిగ్గజం గూగుల్ సోమవారం ఓ డూడుల్‌ను రూపొందించింది.

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ భౌతికశాస్త్రవేత్త, సంగీతవిద్వాంసుడు ఆస్కర్ శాలా(Oskar Sala) 112వ జన్మదినాన్ని పురస్కరించుకుని టెక్ దిగ్గజం గూగుల్ సోమవారం ఓ డూడుల్‌ను రూపొందించింది. టెలివిజన్, రేడియో, సినిమా రంగాలకు సరికొత్త సౌండ్ ఎఫెక్ట్స్‌ను పరిచయం చేశారంటూ ప్రశంసల వర్షం కురిపించింది. ఓ ప్రత్యేక ఎలక్ట్రానిక్ సంగీతవాయిద్యం(సింథసైజర్) మిక్స్చర్- ట్రాటోనియమ్తో(Mixture-Trautonium) ఆస్కర్.. కళాప్రపంచం మునుపెన్నడూ వినని ధ్వనులను సృష్టించారు. ఇక 1959లో విడుదలైన రోస్మెరీ, 1962 నాటి ది బర్డ్స్ చిత్రాలు ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి.
శాలా 1910లో జర్మనీలో జన్మించారు. ఆయన తల్లి గాయని కాగా.. తండ్రేమో కంటి వైద్యుడు. 14వ ఏటనే ఆయన వయోలిన్, పియానోపై సంగీతబాణీలు కట్టడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఎలక్ట్రానిక్ వాయిద్యం ట్రాటోనియమ్ గురించి తొలిసారిగా విని ఆయన ముగ్ధుడైపోయారు. కొత్త కొత్త శబ్దాలు సృష్టిస్తున్న ఆ వాయిద్యం తీరుకు మైమరచిపోయారు. చివరికి.. అదే ఆయన జీవితంగా మారిపోయింది. అదే ఆయనను భౌతిక శాస్త్రంపైనా ఆసక్తి కలిగేలా చేసింది. భౌతికశాస్త్ర అభ్యాసంతో వచ్చిన మెళకువలతో ఆయన ట్రాటోనియమ్ను మరింత అభివృద్ధి పరిచి మిక్స్చర్ ట్రాటోనియమ్ రూపొందించారు. ఎలక్ట్రో ఇంజినీర్‌గా తనకున్న అనుభవంతో శాలా ట్రాటోనియమ్పై రూపొందించిన బాణీలు శ్రోతలను కట్టిపడేసేవీ. శాలాకున్న ఇంజినీరింగ్ నేపథ్యం.. ఆయన సంగీతానికి ఓ ప్రత్యేకతను తీసుకొచ్చింది. తన ప్రతిభకు గుర్తుగా శాలా ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇక తొలిసారిగా తను రూపొందించిన యంత్రాన్ని శాలా.. 1995లో జర్మనీ మ్యూజియమ్ ఫర్ కాన్టెంపరరీ టెక్నాలజీకి విరాళంగా ఇచ్చేశారు. తన కృషితో ఎలక్ట్రానిక్ సంగీతాన్ని కొత్త పుంతలు తొక్కించారు.