Google Doodle: నేటి డూడుల్‌ను చూశారా.. ఓ లెజెండ్‌ను గుర్తుచేసిన గూగుల్..!

ABN , First Publish Date - 2022-09-08T23:30:57+05:30 IST

ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అన్నట్టు.. గూగుల్ తన డూగుల్స్ ద్వారా ప్రతిరోజూ వివిధ రంగాల్లోని విశిష్ట వ్యక్తులను గుర్తుచేస్తుంటుంది.

Google Doodle: నేటి డూడుల్‌ను చూశారా..  ఓ లెజెండ్‌ను గుర్తుచేసిన గూగుల్..!

ఇంటర్నెట్ డెస్క్: ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అన్నట్టు.. గూగుల్(Google) తన డూడుల్స్(Doodles) ద్వారా ప్రతిరోజూ వివిధ రంగాల్లోని విశిష్ట వ్యక్తులను గుర్తుచేస్తుంటుంది. తాజాగా.. ప్రముఖ గీత రచయిత, గాయకుడు, దర్శకుడు, భారతరత్న అవార్డు గ్రహీత అయిన డా. భూపేన్ హజారికా(Bhupen Hazarika) జన్మదినాన్ని పురస్కరించుకుని గూగుల్ నేడు డూడుల్ రూపంలో ఆయనకు నివాళులు అర్పించింది. మనుషుల్లోని మానవత్వం, సౌభ్రాతృత్వాన్ని తట్టిలేపే పాటలకు పెట్టింది పేరు భూపేన్ హజారికా..!


అసోంలో జన్మించిన భూపేన్.. జానపద సంగీతం వింటూ పెరిగారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టు..చాలా చిన్నతనంలోనే భూపేన్ ప్రతిభ అందరినీ ఆశ్చర్యపరిచేది. పదేళ్ల వయసులోనే భూపేన్.. ప్రముఖ నిర్మాత బిష్ణు ప్రసాద్ రాభా, గేయరచయిత జ్యోతిప్రసాద్ అగర్వలా సాయంతో తన తొలి గేయాన్ని రికార్డు చేశారు. పన్నెండో ఏటనే మరో రెండు చిత్రాల్లోని పాటలకు బాణీలు సమకూర్చారు. వీరత్వం, పోరాటం, ఆనందం, వేదన, ప్రేమ, ఒంటరితనంలోని భావావేశాలను తన గీతాలలో మనసుకుతాకేలా పలికించడంలో భూపేన్ దిట్ట. గంభీరమైన గాత్రంతో శ్రోతలను సమ్మోహితులను చేసే భూపేన్.. ‘సుధా కాంత’ అనే బిరుదును సొంతం చేసుకున్నారు.. సుధా కాంత అంటే.. అమృతమయమైన గాత్రం అని అర్థం. 


ఇక సినీదర్శకుడిగా ఆయనకు సాటి రాగల వ్యక్తి మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. 1967లో ఆయనను ‘శకుంతల‘ అనే సినిమాకు గాను నేషనల్ ఫిల్మ్ అవార్డు వరించింది. 1992లో భూపేన్..  చిత్రపరిశ్రమలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును(Dadasaheb Phalke Award) దక్కించుకున్నారు.  అంతేకాకుండా.. పద్మభూషన్, పద్మవిభూషణ్, సంగీత్ నాటక్ అకాడమీ అవార్డులను కూడా గెలుచుకున్నారు. సినీ రంగానికి, సంగీత ప్రపంచానికి భూపేన్ సేవలకు గుర్తింపుగా ఎన్నో స్టాంపులు విడుదలయ్యాయి. ఢోలా-సాదియా వంతెనకు కూడా భూపేన్ పేరును పెట్టారు. అనారోగ్య సమస్యలతో సుదీర్ఘకాలం పాటూ పోరాడిన ఆయన 2011 నవంబర్‌లో కన్నుమూశారు. 

Updated Date - 2022-09-08T23:30:57+05:30 IST