MP Panchayat Election Result: తండ్రి ఎన్నికల్లో గెలిచాడని కుమారుడు మిఠాయిలు తెప్పించాడు.. ఇంతలో ఊహించని విధంగా...

ABN , First Publish Date - 2022-07-21T17:51:48+05:30 IST

మధ్యప్రదేశ్‌లోని సాత్నాలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడిన...

MP Panchayat Election Result: తండ్రి ఎన్నికల్లో గెలిచాడని కుమారుడు మిఠాయిలు తెప్పించాడు.. ఇంతలో ఊహించని విధంగా...

మధ్యప్రదేశ్‌లోని సాత్నాలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడిన సమయంలో విషాదం చోటుచేసుకుంది. కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్ కుమారుడు మరణించాడు. ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్దిసేపటికే వార్డు నెం.3 నుంచి కాంగ్రెస్‌ నుంచి కౌన్సిలర్‌గా ఎన్నికైన రాము కోల్‌ కుమారుడు కృష్ణ కోల్‌ (40)కు గుండెపోటు వచ్చింది. ఆస్పత్రికి తరలించేలోపే అతను మృతి చెందాడు. కౌంటింగ్ సమయంలో కృష్ణ ఇంట్లోనే ఉన్నాడని, ఫలితాలు రాగానే ఫోన్‌లో తండ్రి గెలుపు వార్త తెలియడంతో చాలా సంతోషించాడని స్థానికులు చెబుతున్నారు. మిఠాయిలు తీసుకురావాలని కొందరికి డబ్బులు ఇచ్చాడన్నారు. డీజే కోసం డబ్బు కూడా చెల్లించాడు. ఇంతలో అకస్మాత్తుగా అతని ఆరోగ్యం క్షీణించింది.


స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతనిని సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించి అతను చనిపోయినట్లు నిర్ధారించారు. కుమారుని మృతితో తండ్రి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. కృష్ణ తండ్రి కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై కౌన్సిలర్ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయనకు 390 ఓట్లు వచ్చాయి. ఎన్నికల్లో బీజేపీకి చెందిన పవన్ కోల్‌పై 14 ఓట్ల తేడాతో గెలుపొందగా, పవన్‌కు 376 ఓట్లు వచ్చాయి. ఫలితాల ప్రకటన తర్వాత కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్ విజయ ధృవీకరణ పత్రాన్ని పొందారు.

Updated Date - 2022-07-21T17:51:48+05:30 IST