Queen Elizabeth II: 60 ఏళ్లుగా ఒకే డైట్.. ఇదే ఆమె ఆరోగ్య రహస్యం.. ఉదయం నుంచి రాత్రి పడుకునే లోపు ఆమె ఏమేం తినేవారంటే..

ABN , First Publish Date - 2022-09-11T00:34:46+05:30 IST

డెబ్భై ఏళ్ల పాటు బ్రిటన్‌ను పరిపాలించిన రాణి ఎలిజబెత్-2(Queen Elizabeth-2).. సెప్టెంబర్ 8న కన్నుమూశారు. వేసవి విరామం కోసం స్కాట్లాండ్ లోని బల్మోరల్ కోటలో విశ్రాంతి..

Queen Elizabeth II: 60 ఏళ్లుగా ఒకే డైట్.. ఇదే ఆమె ఆరోగ్య రహస్యం.. ఉదయం నుంచి రాత్రి పడుకునే లోపు ఆమె ఏమేం తినేవారంటే..

డెబ్భై ఏళ్ల పాటు బ్రిటన్‌ను పరిపాలించిన రాణి ఎలిజబెత్-2(Queen Elizabeth-2).. సెప్టెంబర్ 8న కన్నుమూశారు. వేసవి విరామం కోసం స్కాట్లాండ్ లోని బల్మోరల్ కోటలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో తుదిశ్వాస విడిచారు. బ్రిటన్ రాజవంశ చరిత్రలో సుదీర్ఘ కాలం పాటు రాణిగా కొనసాగిన ఎలిజబెత్-2 మరణంతో ఒక శకం ముగిసిందని చెప్పొచ్చు. ఇన్నేళ్ల ఆమె పాలనలో ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్షిగా నిలవడమే కాకుండా.. ప్రపంచం మొత్తంపై ప్రత్యేక ముద్ర వేశారు. కాగా, ప్రస్తుతం సోషల్ మీడియాలో రాణి గురించిన పలు విషయాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆమె వ్యక్తిగత జీవితంతో పాటూ ఆహార అలవాట్లను (Food habits) తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు. తరాలు తిన్నా తరగని ఆస్తి ఉన్నా.. ఆహారపు అలవాట్ల విషయంలో రాణి ప్రత్యేక శ్రద్ధ కనబరచేవారని తెలిసింది. ఆదే ఆమె ఆరోగ్యం రహస్యం కూడా. ఉదయం నుంచి రాత్రి పడుకునే లోపు ఆమె ఏమేం తినేవారంటే..


222 ఏళ్ల నాటి పాత్రల్లో మాత్రమే..

రాణి ఎలిజబెత్-2 వ్యక్తిగత చెఫ్‌గా 15 ఏళ్ల పాటు పనిచేసిన డారెన్ మాగ్రాడీ.. 2007లో 'ఈటింగ్ రాయల్లీ- రెసిపీస్ అండ్ రిమెంబరెన్స్' అనే పుస్తకాన్ని రాశారు. ఇందులో రాణి ఆహారపు అలవాట్ల గురించి వివరించారు. రాణి ఆహార విషయంలో 60 ఏళ్లుగా పెద్ద మార్పులేవీ లేవు. రాజ మహల్‌లోని వంట గదిలో రాణికి వంట సిద్ధం చేయడానికి సుమారు 20 మంది చెఫ్‌లు పని చేసేవారు. ప్రధానంగా వంట చేసే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. ఇందుకోసం క్రీ.శ. 1800 నాటి పాత్రలను వినియోగించడం ఎప్పటి నుంచో సాంప్రదాయంగా వస్తోంది.  ప్రతి రోజూ రాణి కోసం మూడు రకాల మెనూలను సిద్ధం చేయగా.. వాటిలో రాణి ఒకదాన్ని మాత్రమే ఎంచుకుంటారని డారెన్ మాగ్రాడీ వివరించారు.


టీ, బిస్కెట్లతో ఉదయం ప్రారంభం..

దివగంత రాణి.. ఆహారం విషయంలో కొన్ని ప్రత్యేక పద్ధతులను అవలంభించేవారు. రోజూ తన బ్రేక్‌ఫాస్ట్‌ను టీ, బిస్కెట్లతో ప్రారంభించేవారు. సరిగ్గా ఉదయం 7:30 గంటలకు సేవకులు ఒక ట్రేలో 2 వెండి టీ కప్పులతో రాణి పడకగదికి చేరుకుంటారు. ఒక టీ కప్పులో ఎర్ల్ గ్రే టీ, మరో కప్పులో వేడినీరు ఉంటుంది. రాణి కోసం తయారు చేసే టీని 'ఎర్ల్ గ్రే' అని పిలుస్తారు. బేరిపండు, నారింజ తొక్కల నుంచి తీసిన నూనెను టీ తయారీలో వినియోగిస్తారట. తర్వాత అందులో పాలను జత చేస్తారు. అయితే చక్కెర మాత్రం అసలు వాడరట. అలాగే రాణికి చాక్లెట్ ఆలివర్స్ బిస్కెట్ అంటే చాలా ఇష్టమట. దీంతో పాటు అస్సాంకి చెందిన 'సిల్వర్ టిప్స్ చాయ్'ని కూడా ఎక్కువగా ఇష్టపడేవారట.


అల్పాహారం కోసం పండ్లు, తృణధాన్యాలు..

ఉదయం 8:30 గంటలకు అల్పాహారం కోసం రాణి తన ప్రైవేట్ డైనింగ్ రూమ్‌కి వచ్చేది. అల్పాహారం కోసం పండ్లు, తృణధాన్యాలు తీసుకునేవారు. రాణి ఎక్కువగా మామ్లెట్ (ఆరెంజ్ మార్మాలాడే), టోస్ట్‌ని ఇష్టపడేవారట. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అల్పాహారంగా సాల్మన్ చేపలు, గోధుమ రంగు గుడ్లను తీసుకునేవారట. రోజూ ఆమె ఆహారంలో చేపలు, కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకునేవారు. ఏ ఆహారం తీసుకున్నా మితంగా మాత్రమే తీసుకునేవారు. అలాగే ఆహార నియమాల విషయంలో అస్సలు రాజీ పడేవారు కాదట. అదేవిధంగా ఆమెకు చతురస్రాకారంలో ఉన్న ఆహారం, చివరలో కోణం ఆకారంలో ఉండే పదార్థాలు అసలు నచ్చవట. అందుకే రాణి వంటకాల మెనూలో ఇలాంటికి కనిపించవు.


బచ్చలికూర, గుమ్మడికాయతో చేసిన వంటకాలంటే..

రాణికి చెందిన తోటల నుంచి రోజూ తాజా పండ్లు, కూరగాయలను తీసుకొస్తుంటారు. ఇక మధ్యాహ్న భోజనంలో బచ్చలికూర, గుమ్మడికాయ, పాలకూర, కీరాదోసతో వంటకాలను తినేవారట.  అలాగే అప్పుడప్పుడూ సలాడ్‌తో పాటూ గ్రిల్డ్ చికెన్, చేపలు కూడా తీసుకునేవారు. మధ్యాహ్న సమయంలో ఆమె మరోసారి మరోసారి ఎర్ల్ గ్రే టీ సేవించేవారు. అదేవిధంగా కొన్నిసార్లు దోసకాయ శాండ్‌విచ్‌లు, ఫ్రూట్ కేక్‌లను తినేవారు. ఐదేళ్లుగా టమోటా శాండ్‌విచ్‌లు, జామ్ పెన్నే శాండ్‌విచ్‌లు ఎక్కువగా తీసుకునేవారట. బ్రెడ్‌పై కొద్దిగా వెన్న, స్ట్రాబెర్రీ జామ్‌తో కూడిన శాండ్‌విచ్ అంటే రాణికి ఎంతో ఇష్టమని తెలిసింది.


రాత్రి భోజనంలో చేపలు, సలాడ్, కూరగాయలు..

రాత్రి భోజనంలో రాణి ఎలిజబెత్.. చేపలు, కూరగాయలు, సలాడ్ మాత్రమే తీసుకునేవారు. కొన్నిసార్లు స్వీట్లు కూడా తీసుకుంటారు. అయితే ఎక్కువగా డార్క్ చాక్లెట్‌నే ఎంపిక చేసేవారట. అయినా అందులో చిన్న ముక్క మాత్రమే రుచి చూసేవారని తెలిసింది. రాణికి మిల్క్ చాక్లెట్ అంటే ఇష్టం ఉండేది కాదట. కాగా, ప్రయాణ సమయంలో ఎల్లప్పుడూ చాక్లెట్లు, బిస్కెట్లు, కేక్‌లు వెంట ఉంచుకునేవారట. మరోవైపు క్వీన్ ఎలిజబెత్‌.. 95 ఏళ్ల వరకు వైన్ తీసుకునేవారు. ఉదయం ఒక జిన్ కాక్‌టెయిల్‌ తీసుకుంటారు. తర్వాత భోజనంతో పాటూ గ్లాస్‌ వైన్ లేదా షాంపైన్, సాయంత్రం మరో గ్లాసు షాంపైన్, డ్రై మార్టినీ సేవించేవారట. కొన్నిసార్లు సాయంత్రం లేదా రాత్రి భోజన సమయంలో స్వీట్ వైన్ తాగేవారు. రాణి, రాజకుటుంబం కోసం బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో జిన్ తయారు చేసేవారు. దీంతో ఈ రాయల్ వైన్‌కి 'బకింగ్‌హామ్ ప్యాలెస్ జిన్' అని పేరు వచ్చింది. బకింగ్‌హామ్ ప్యాలెస్‌లోని 16 హెక్టార్లలో విస్తరించి ఉన్న రాయల్ గార్డెన్‌లో పెరిగిన నిమ్మకాయలు, బెర్రీలు తదితరాలతో ఈ ప్రత్యేకమైన వైన్ తయారు చేసేవారు.Read more