‘మీ బ్యాంకు ఖాతా క్లోజ్ అవబోతోంది’.. ఫోన్‌లో ఈ మాట వినగానే అతను అన్ని వివరాలు అందించాడు.. తరువాత ఏం జరిగిందంటే...

ABN , First Publish Date - 2022-09-10T16:25:15+05:30 IST

హర్యానాలోని రేవారీకి చెందిన ఓ వ్యక్తి మోసగాడి వలలో పడి...

‘మీ బ్యాంకు ఖాతా క్లోజ్ అవబోతోంది’.. ఫోన్‌లో ఈ మాట వినగానే అతను అన్ని వివరాలు అందించాడు.. తరువాత ఏం జరిగిందంటే...

హర్యానాలోని రేవారీకి చెందిన ఓ వ్యక్తి మోసగాడి వలలో పడి తన బ్యాంకు ఖాతాలోని రూ.1.20 లక్షల నగదు కోల్పోయాడు. నిందితుడు కేవైసీ పేరుతో మోసానికి పాల్పడ్డాడు. గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం రేవారిలోని మండౌలా గ్రామానికి చెందిన సుచేత్ కుమార్‌కు ఎస్‌బీఐ మానేటి బ్రాంచ్‌లో ఖాతా ఉంది. రవిప్రకాష్ వర్మ పేరుతో ఒక వ్యక్తి ఎస్‌బీఐ ముంబై కస్టమర్ కేర్‌ నుంచి ఫోన్ చేస్తున్నట్లు అతనికి కాల్ చేశాడు. మీ ఖాతాకు సంబంధించిన కేవైసీ పూర్తిచేయలేదని చెప్పాడు. అది పూర్తి చేయకపోతే ఖాతా క్లోజ్ అవుతుందని చెప్పాడు. దీంతో సుచేత్ కుమార్ అతను కోరిన సమాచారం అందించాడు. 


ఆ తర్వాత అతను మీ మొబైల్ నంబర్‌కి వచ్చే ఓటీపీ చెప్పాలని కోరాడు. ఓటీపీ రాగానే సుచేత్ దానిని ఆ వ్యక్తికి తెలియజేశాడు. దీని తర్వాత సుచేత్ తన ఏటీఎం పిన్, విసిఎస్‌ అతనికి తెలియజేశాడు. ఇది జరిగాక సుచేత్ డబ్బులు తీసుకునేందుకు ఏటీఎంకు వెళ్లాడు. అప్పుడు బ్యాలెన్స్‌ తక్కువగా ఉందనే మెసేజ్ అతనికి వచ్చింది. అతని బ్యాంకు ఖాతాలో కేవలం రూ.85 మాత్రమే ఉన్నట్టు కనిపించింది. సుచేత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఆ మోసగాడు రూ. లక్ష 20 వేల రూపాయలను డ్రా చేసుకున్నాడు. తాను మోసపోయానని గ్రహించిన సుచేత్ ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గుర్తుతెలియని వ్యక్తిపై చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సుచేత్‌కు ఫోన్‌ చేసిన నంబర్‌, నగదు బదిలీ అయిన ఖాతా తదితర వివరాలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు.


Updated Date - 2022-09-10T16:25:15+05:30 IST