Dance of Light tower: భవనాన్ని మెలితిప్పేసిన చైనా!

ABN , First Publish Date - 2022-09-04T22:27:11+05:30 IST

చైనా ఏం చేసినా అద్భుతమే. టెక్నాలజీలో అది ప్రపంచాన్నే శాసించే స్థాయికి చేరుకుంది. తాజాగా, ఈ డ్రాగన్ కంట్రీ

Dance of Light tower: భవనాన్ని మెలితిప్పేసిన చైనా!

బీజింగ్: చైనా ఏం చేసినా అద్భుతమే. టెక్నాలజీలో అది ప్రపంచాన్నే శాసించే స్థాయికి చేరుకుంది. తాజాగా, ఈ డ్రాగన్ కంట్రీ మరో అద్భుత కట్టడంతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. చాంగ్‌క్వింగ్‌ జిల్లాలోని జియాంగ్బీ 180 మీటర్ల పొడవున్న ఆకాశహర్మ్యాన్ని మెలితిప్పేసింది. దుబాయ్‌లోని ఏడాస్ (Aedas) ఆర్కిటెక్చర్ స్టూడియో ఈ ట్విస్ట్‌డ్ టవర్‌ను డిజైన్ చేసింది. సరళంగా, అద్భుతంగా ఉన్న ఈ భవనం చూస్తేనే మతిపోయేలా ఉంటుంది. పూర్తి కాంతి ఆధారంగా దీని ఆకృతిని డిజైన్ చేశారు. సూర్యకాంతి పరావర్తనంతో ఈ భవనం మరింత సుందరంగా కనిపిస్తుంది.


డబుల్ కర్వ‌డ్ సర్ఫేసెస్ కారణంగా టవర్‌ మెలితిరిగినట్టు ఉంటుంది. నిలువుగా కనిపించే లైన్స్ వల్ల భవనం వక్రీకృత ఆకారం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ కాంతి కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఇది అద్దాలపై పడి ప్రతిబింబించడమే కాకుండా వంగి ప్రయాణిస్తుంది. రోజు గడుస్తున్న కొద్దీ కాంతిలో మార్పుల కారణంగా వివిధ కోణాల నుంచి భవనం అత్యద్భుతంగా కనిపిస్తుంది. ‘డ్యాన్స్ ఆఫ్ ద లైట్ టవర్’ అన్న దాని పేరుకు అనుగుణంగానే ఈ భవనం ఉంటుంది. సూర్యుడు ఉదయించినప్పుడు దాని కిరణాలు భవనం వక్ర ముఖభాగాలపైన పడి ప్రకాశిస్తాయి.  ఆ వెంటనే టవర్ కాంతి భవనం (building of light)లా రూపాంతరం చెందుతుంది.


39 అంతస్తులు కలిగిన ఈ ఆకాశ హర్మ్యం ఫ్లోర్‌కు 8.8 డిగ్రీల ట్విస్టింగ్ యాంగిల్ కలిగి ఉంది. ప్రపంచంలోని ఇలాంటి భవనాల కంటే ఇది 1.5 రెట్లు ఎక్కువని ఏడాస్ పేర్కొంది. ‘డ్యాన్స్ ఆఫ్ లైట్’ ప్రపంచంలోని అత్యంత ట్విస్ట్‌డ్ టవర్లలో ఒకటని తెలిపింది. ఇందులో 34 అంతస్తులలో ఆఫీస్ స్పేస్ ఉండగా, మిగతా 5 అంతస్తులలో మీటింగ్ రూమ్స్, ఇతర సౌకర్యాలు ఉన్నాయి. కింది వాటిలో రెస్టారెంట్లు, కేఫ్‌లు ఉన్నాయి.



Updated Date - 2022-09-04T22:27:11+05:30 IST