EWS Certificate: ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్‌ పొందడం ఇంత సింపులా..!

ABN , First Publish Date - 2022-11-30T12:09:45+05:30 IST

అగ్రవర్ణాల పేదలకు ఉద్యోగాలు, చదువులకు సంబంధించి 10 శాతం రిజర్వేషన్లను కేంద్రం కల్పించిన నేపథ్యంలో, ఈ ప్రయోజనాలను పొందాలనుకుంటే..

EWS Certificate: ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్‌ పొందడం ఇంత సింపులా..!

ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్‌ పొందడం ఇలా..

ఏప్రిల్‌-మార్చి ఏడాది కాలానికి వర్తింపు

విద్య, ఉద్యోగార్థులు వీటిని గమనంలోకి తీసుకోవాలి

మీసేవ, సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు

ఆధార్‌తో నోటరీ చేయించి దరఖాస్తు చేసుకోవాలి

(ఆంధ్రజ్యోతి, విజయవాడ): అగ్రవర్ణాల పేదలకు ఉద్యోగాలు, చదువులకు సంబంధించి 10 శాతం రిజర్వేషన్లను కేంద్రం కల్పించిన నేపథ్యంలో, ఈ ప్రయోజనాలను పొందాలనుకుంటే.. ఎకనమికల్లీ వీకర్స్‌ సెక్షన్‌ (ఈడబ్ల్యూఎస్‌) సర్టిఫికెట్లు అవసరం. ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్ల కాలపరిమితి ఏడాది పాటు మాత్రమే ఉంటుంది. అగ్ర వర్ణాలలోని పేదలు సరైన సమయంలో వీటిని పొందటం ద్వారా రిజర్వేషన్ల ప్రయోజనాలను అందుకోవటానికి అవకాశం ఉంటుంది. ఒకసారి కాలపరిమితి ముగిస్తే మళ్లీ కొత్తగా తీసుకోవాల్సి ఉంటుంది.

ఈడబ్ల్యూఎస్‌ అర్హతలు

అగ్రవర్ణాలకు చెందిన వారి కుటుంబ ఆదాయం రూ.8 లక్షల లోపు ఉండాలి. వ్యవసాయ భూమి 5 ఎకరాల లోపు ఉండాలి. వెయ్యి చదరపు అడుగుల స్థలంలో ఇల్లు ఉండాలి. నోటిఫై చేసిన మునిసిపల్‌ ఏరియాలో 100 చదరపు గజాల స్థలం మాత్రమే ఉండాలి. అదే రూరల్‌ ఏరియాలో అయితే 200 చదరపు గజాలు స్థలం మాత్రమే ఉండాలి.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

దరఖాస్తు చేయాలనుకునేవారు ముందుగా నోటరీ చేయించాలి. ఆధార్‌ కార్డును అడ్వకేట్‌ దగ్గరకు తీసుకు వెళ్లి ఈడబ్ల్యూఎస్‌ దరఖాస్తు చేయటానికి నోటరీ చేసిన అఫిడవిట్‌ కావాలని కోరాలి. నోటరీ అఫిడవిట్‌ వెంటనే ఇస్తారు. ఈ ఒరిజినల్‌ నోటరీతో పాటు దరఖాస్తుదారుని అధార్‌ కాపీ, పాస్‌పోర్టు ఫొటో తీసుకుని మీసేవ, సచివాలయంలకు దేనికైనా వెళ్లాలి. అక్కడ వారు ఇచ్చే అప్లికేషన్‌ పూరించి సంతకం చేయాలి.

- ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్‌ కాలపరిమితి

* ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్‌ కాలపరిమితి సంవత్సరం ఉంటుంది. ఏప్రిల్‌ నుంచి మార్చి వరకు మాత్రమే ఉంటుంది. ఒక వేళ గడువు అయిపోతే మళ్లీ నోటరీ చేయించుకోవటం నుంచి మొదలు పెట్టాల్సి ఉంటుంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయం బట్టి 2022-23 ఆర్థిక సంవత్సరంలో పరిగణనలోకి తీసుకుంటారు.

* కుటుంబంలో ఒక్కరు తీసుకుంటే సరిపోదు. విద్య, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న కుటుంబంలోని వారంతా ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది.

- ఈడబ్ల్యూఎస్‌ వల్ల కలిగే ప్రయోజనాలు:

* కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న అన్ని కళాశాలల్లో 10 శాతం సీట్లు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలలో ఉండే అన్ని ఉద్యోగాలలో 10 శాతం కేటాయిస్తారు. అలాగే రాష్ట్ర పరిధిలో కూడా విద్య, ఉద్యోగాలలో 10 శాతం రిజర్వేషన్లు కేటాయించడం జరుగుతుంది.

Updated Date - 2022-11-30T12:10:45+05:30 IST