Mosquito bite: దోమకాటుతో కోమాలోకి వ్యక్తి.. 30 సర్జరీలు చేస్తే బతికాడు

ABN , First Publish Date - 2022-11-28T21:42:19+05:30 IST

దోమకాటు (Mosquito bite) కారణంగా మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులొస్తాయనే విషయం తెలిసిందే. ఒకవేళ అదే దోమకాటు ద్వారా వ్యక్తి శరీరంలోకి ఇతర వైరస్‌లు లేదా పరాన్నజీవులు ప్రవేశిస్తే ప్రాణాంతకమవ్వొచ్చు.

Mosquito bite: దోమకాటుతో కోమాలోకి వ్యక్తి.. 30 సర్జరీలు చేస్తే బతికాడు

దోమకాటు (Mosquito bite) కారణంగా మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులొస్తాయనే విషయం తెలిసిందే. ఒకవేళ అదే దోమకాటు ద్వారా వ్యక్తి శరీరంలోకి ఇతర వైరస్‌లు లేదా పరాన్నజీవులు ప్రవేశిస్తే ప్రాణాంతకమవ్వొచ్చు. అచ్చంగా ఇదే పరిస్థితి ఓ వ్యక్తికి ఎదురైంది. దోమకాటు కారణంగా ఒక వ్యక్తి 4 వారాలపాటు కోమా, ఏకంగా 30 సర్జీలు చేయించుకొని చావు అంచుల దాకా వెళ్లాల్సి వచ్చింది. గుండెల్లో దడ పుట్టిస్తున్న ఈ ఉదంతం జర్మనీకి చెందిన 27 ఏళ్ల సెబాస్టియన్ రొచే అనే యువకుడికి ఎదురైంది.

సెబాస్టియన్ 2021 వేసవికాలంలో ఏసియన్ టైగర్ (Asian tiger) దోమకాటుకు గురవ్వడమే అతడి దుస్థితికి కారణమైంది. దోమ కుట్టిన తర్వాత తొలుత ఫ్లూ లాంటి లక్షణాలు అతడిలో కనిపించాయి. అయితే ఇది ఆరంభం మాత్రమే. ఆ తర్వాత ఇన్‌ఫెక్షన్ కారణంగా అతడి రెండు కాలివేళ్లను తొలగించాల్సి వచ్చింది. బ్లడ్ పాయిజన్‌తోపాటు పలు సందర్భాల్లో కాలేయం, కిడ్నీలు, గుండె, ఊపిరితిత్తుల ఫెయిల్యూర్ వంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ఎడమకాలి తొడ భాగంలో పేరుకుపోయిన చీమును తొలగించేందుకు మరో ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ప్రాణాంతకమైన బ్యాక్టీరియా దాదాపు సగం తొడ భాగాన్ని తినేయడంతో అతడు బతకడం కష్టమని అంతా అనుకున్నారు. కానీ సర్జరీ నిర్వహించి చీముపట్టిన భాగాన్ని వైద్యులు తొలగించారు. కాగా ఇంత జరిగినా అతడు ప్రాణాలతో బయటపడడం విశేషం. ఇందుకోసం ఏకంగా 30 సర్జరీలు నిర్వహించాల్సి వచ్చింది. ఈ క్రమంలో 4 వారాలపాటు కోమాలోకి జారుకున్నాడు.

తాను ఎదుర్కొన్న ఈ దారుణ పరిస్థితిపై సెబాస్టియన్ స్పందించాడు. తానెప్పుడూ విదేశాలకు వెళ్లలేదని, జర్మనీలోనే ఈ దోమ కుట్టివుంటుందని అన్నాడు. తీవ్ర అనారోగ్యానికి గురయ్యానని, కనీసం బాత్‌రూమ్‌కు కూడా నడవలేకపోయానని చెప్పాడు. తీవ్రమైన జ్వరం కారణంగా తినలేకపోయేవాడినని పేర్కొన్నాడు. గజ్జ భాగం పూర్తిగా తడిసిపోయి ఉండేదని, అకస్మాత్తుగా ఒకరోజు తొడపై చీము పేరుకుపోయినట్టు గుర్తించానని చెప్పారు. వైద్యులను సంప్రదిస్తే ఆసియన్ టైగర్ దోమ కుట్టినట్టు నిర్ధారించారని సెబాస్టియన్ చెప్పాడు. ప్రస్తుతం బాగానే ఉన్నానని, ఇలాంటి దోమకాట్లకు దూరంగా ఉండాలని అందరికీ సలహా ఇచ్చాడు. కాగా ఆసియన్ టైగర్ దోమలను అడవి దోమలు అని కూడా అంటారు. ఇవి పగటిపూట కుట్టే కీటకాలు. ఇవి ఈస్టర్న్ ఈక్వైన్ ఎన్‌సెఫాలిటీస్ (EEE), జీకా వైరస్ (Zika virus), వెస్ట్ నైలు వైరస్ (West Nile virus), చికెన్‌గున్యా, డెంగ్యూ జ్వరం వంటి హానికర వ్యాధుల వ్యాప్తి చేయగలవు

Updated Date - 2022-11-28T21:45:16+05:30 IST